చేనేత కార్మికులపై.. ఉపాధి కోతల కత్తి

రాష్ట్రంలో చేనేత కార్మికుల మెడపై ఉపాధి కోతల కత్తి వేలాడుతోంది. వారి ఆదాయానికి గండిపడే పరిస్థితులు ఇప్పటికే  కొన్నిచోట్ల నెలకొన్నాయి.

Published : 06 Jun 2023 05:07 IST

మాస్టర్‌ వీవర్స్‌ దగ్గర భారీగా పేరుకుపోయిన నిల్వలు
ఫలితంగా ఉత్పత్తిని తగ్గిస్తున్న వైనం
కార్మికుల ఆదాయానికి గండి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో చేనేత కార్మికుల మెడపై ఉపాధి కోతల కత్తి వేలాడుతోంది. వారి ఆదాయానికి గండిపడే పరిస్థితులు ఇప్పటికే  కొన్నిచోట్ల నెలకొన్నాయి. పెరిగిన ముడి సరకు ధరలు, జీఎస్టీ ప్రభావంతో గత నవంబరు నుంచి మాస్టర్‌ వీవర్స్‌ దగ్గర క్రమక్రమంగా అమ్మకాలు తగ్గుతూ ఇప్పుడు భారీగా నిల్వలు పేరుకుపోయాయి. దీంతో వారు ఉత్పత్తిని తగ్గిస్తున్నారు. మరికొందరు మగ్గాల సంఖ్యను కుదిస్తున్నారు. ఇది చేనేత కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. కొన్నిచోట్ల వారి నెలసరి ఆదాయంలో 50 శాతం మేర తగ్గింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదని చేనేత కార్మికులు మండిపడుతున్నారు.

రాష్ట్రంలో కీలక చేనేత చీరల తయారీ ప్రాంతాలైన ధర్మవరం, మదనపల్లె, ఉప్పాడ, చీరాల, మంగళగిరి, ఎమ్మిగనూరు, కొడమూరుల్లో ఎటు చూసినా ఇదే పరిస్థితి. ఒక్కో మాస్టర్‌ వీవర్‌ దగ్గర వందల సంఖ్యలో చీరలు పేరుకుపోయాయి. ఇప్పటికిప్పుడు అవి తరిగిపోయే పరిస్థితులు కనిపించడం లేదని మాస్టర్‌ వీవర్స్‌ చెబుతున్నారు. కరోనాకు ముందు ముడిసరకు రూ.3,200 వరకు ఉండగా ప్రస్తుతం రూ.5,400 వేలకు చేరింది. నిన్నమొన్నటి వరకు రూ.6 వేలకు చేరినా కర్ణాటక ఎన్నికల ప్రభావంతో కొంతమేర తగ్గినట్లు చేనేత సంఘాల నేతలు చెబుతున్నారు. మళ్లీ పెరిగే అవకాశమున్నట్లు వారు పేర్కొంటున్నారు. ఈ ధరే ఇబ్బందికరంగా ఉండగా దీనిపై 12 శాతం జీఎస్టీ వసూలు గుదిబండగా మారింది. డిజైన్‌ పంచింగ్‌ కార్డ్సుపైనా 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. చీర డిజైన్‌ మార్చిన ప్రతిసారీ వీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది అదనపు భారమవుతోంది. రంగుల అద్దకానికి వినియోగించే పిండిపైనా జీఎస్టీ పడుతోంది. ఇవన్నీ కలిసి ఖర్చును అదనంగా సుమారు 20-25 శాతం పెంచుతున్నాయి. ఆ మేరకు చీరల ధరల్ని పెంచితే కొనుగోలుదారులు ముందుకురారనే ఆలోచనతో పెంపును విరమించుకుంటున్నారు. కరోనాకు ముందున్న ధరలతోనే చేనేత మాస్టర్‌ వీవర్స్‌ వస్త్ర వ్యాపారులకు అమ్మకాలు చేస్తున్నారు. కానీ అమ్మకాలు మాత్రం గణనీయంగా తగ్గుతున్నాయి. కొంతమంది ఇంటి అవసరాలు తీర్చుకోవడం కోసం ఉత్పత్తి ధరకే చీరలను అమ్మేస్తున్నారు. పవర్‌లూమ్‌లో చేనేత రకాలు నేయడమూ చేనేత వస్త్రాల అమ్మకాలు తగ్గడానికి మరో కారణంగా నేత కార్మికులు చెబుతున్నారు.

కార్మికుల ఆదాయంలో 50% కోత

గత 8 నెలలుగా మాస్టర్‌ వీవర్స్‌ నుంచి అమ్మకాలు తగ్గుతున్నాయి. గతంలో ఉత్పత్తి చేసిన చీరలు... ఏ నెలకానెల 95 శాతంపైగా అమ్ముడయ్యేవి. ప్రస్తుతం అమ్మకాలు క్రమక్రమంగా తగ్గుతూ 30 శాతానికి చేరాయి. నిల్వలు పేరుకుపోతున్నాయి. చేసేది లేక మాస్టర్‌ వీవర్స్‌ ఉత్పత్తిని, మరికొన్ని చోట్ల మగ్గాల సంఖ్యను తగ్గిస్తున్నారు. సాధారణంగా నెలకు ఒక మగ్గంపై పట్టు రకం చీరలను నాలుగింటిని నేస్తారు. ఇప్పుడు కొన్ని చోట్ల నెలకు రెండింటినే నేయాలని కార్మికులకు చెబుతున్నారు. ఫలితంగా వారి ఆదాయం తగ్గుతోంది. చిన్న రకాలు నేసే వారిపై నెలకు ఆదాయంలో రూ.7 వేలు తగ్గుదల ఉంది. పెద్ద రకాలు నేసే వారికి రూ.15-20 వేల వరకు ఆదాయంలో కోత పడుతోంది. సగటున 50% కోత పడుతోంది. ఎమ్మిగనూరు, కొడుమూరు, ఆదోని, గుడికల్లు, నాగలదిన్నె, నందవరం, చుట్టు పక్కల ప్రాంతాల్లోని దాదాపు 6 వేల కార్మిక కుటుంబాలపై ప్రభావం తీవ్రంగా ఉంది. ఉప్పాడ, కొత్తపల్లి ప్రాంతాల్లో కొంతమంది కార్మికులు చేనేత వృత్తిని వదిలి ఇతర పనులకు వెళుతున్నారు.

రూ.కోట్ల విలువైన నిల్వలు?

కంచిపట్టు చీరల తయారీకి ప్రసిద్ధి చెందిన ధర్మవరం, మదనపల్లెలో నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. ధర్మవరంలో రూ.200 కోట్లు, మదనపల్లెలో రూ.250 కోట్ల విలువైన చీరలు మాస్టర్‌ వీవర్స్‌ దగ్గర నిల్వ ఉన్నాయని చేనేత సంఘాల నేతలు చెబుతున్నారు. చీరాల, చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని రకాల చేనేత వస్త్రాలు కలిపి రూ.10 కోట్ల మేర నిల్వలున్నాయని రాష్ట్ర చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ కో కన్వీనర్‌ కొండయ్య తెలిపారు. 1989లో ఇలాంటి పరిస్థితి ఎదురైందని, ఆ తర్వాత మళ్లీ నిల్వలు పేరుకుపోయి కార్మికులు, మాస్టర్‌వీవర్స్‌ ఇబ్బంది పడటం ఇప్పుడే జరుగుతోందన్నారు. మదనపల్లె సమీపంలోని నీరుగట్టువారిపల్లెలో తయారయ్యే పట్టుచీరలను సింగపూర్‌, మలేసియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌ వంటి దేశాలకు ఎగుమతి చేసేవారు. కరోనా తర్వాత ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. మదనపల్లె, చుట్టు పక్కల ప్రాంతాల్లోని మాస్టర్‌ వీవర్స్‌కు బెంగళూరు, చెన్నై, హైదరాబాదు ప్రధాన మార్కెటింగ్‌ ప్రాంతాలు. నిన్న మొన్నటి వరకు వస్త్ర వ్యాపారులకు సరకు పంపాక కొద్దిరోజులకు డబ్బులు ఆన్‌లైన్‌లో వేసేవారు. ఇప్పుడు డబ్బులు చెల్లించాలని అడిగితే సరకును వెనక్కి పంపేస్తున్నారని మాస్టర్‌ వీవర్స్‌ వాపోతున్నారు. దీంతో వారు ఎప్పుడిస్తే అప్పుడు తీసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


10 మగ్గాలను తగ్గించా

- బి.సురేశ్‌బాబు, మాస్టర్‌ వీవర్‌, చీరాల

మొన్నటి వరకు 50 మగ్గాలతో కుప్పటాలు, మంగళగిరి రకం చీరలు నేయించేవాడిని. అమ్మకాలు లేక 10 మగ్గాలు తగ్గించా. గతంలో నెలకు 500 చీరలు నేస్తుంటేే ఇప్పుడు 250కు తగ్గాయి. నెలకు రూ.10 వేలైనా మిగలడం లేదు. చీటీ డబ్బులు, బ్యాంకు కిస్తీలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నాం. చేనేత సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించాలి.


సరకు వెనక్కి పంపేస్తున్నారు

- బండి నాగరాజు, మాస్టర్‌ వీవర్‌, మదనపల్లె

నవంబరు నుంచి పట్టుచీరల వ్యాపారం పూర్తిగా పడిపోయింది. సరకును విక్రయించుకోడానికి నానా అవస్థలు పడుతున్నాం. గతంలో అమ్మకాలు జరిగిన వెంటనే వ్యాపారులు డబ్బు ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం వారిచ్చినప్పుడే తీసుకోవాల్సి వస్తోంది. గట్టిగా అడిగితే సరకును వెనక్కి పంపేస్తున్నారు.


3 నెలల నుంచి ఉత్పత్తి తగ్గించాం

- రంగస్వామి, మాస్టర్‌ వీవర్‌, ఎమ్మిగనూరు

నేను, మా అన్న కలిసి 250 మగ్గాలపై గద్వాల చీరలు నేయిస్తున్నాం. నెలకు 700 చీరల వరకు గతంలో ఉత్పత్తి చేయగా... ప్రస్తుతం అమ్మకాల్లేక 400కి తగ్గించాం. మూడు నెలల నుంచి ఉత్పత్తిని క్రమక్రమంగా తగ్గిస్తున్నాం. 1,500 చీరల వరకు నిల్వ ఉన్నాయి. చిన్న రకాలు అమ్ముడుపోతున్నా... పెద్ద రకాలను ఎవరూ కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. చేనేత కార్మికుల ఆదాయంపైనా దెబ్బపడుతోంది.


30 శాతం అమ్మకాలే

- రాజేశ్‌, మాస్టర్‌ వీవర్‌, ధర్మవరం

35 మగ్గాలపై కంచి పట్టు చీరలను నేయిస్తున్నా. నెలకు 100 చీరల వరకు ఉత్పత్తి ఉంటుంది. గతంలో ఏ నెలలో ఉత్పత్తి చేసే చీరలు అదే నెలలో అమ్మకాలు జరిగేవి. నవంబరు నుంచి నెల ఉత్పత్తిలో 30 శాతం అమ్మకాలు జరగడం లేదు. 400 చీరలు నిల్వ ఉన్నాయి. నిల్వలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని