Bapatla: అమర్‌నాథ్‌ హత్యపై పెల్లుబికిన ఆగ్రహం

అక్కను వేధిస్తున్నారేమని అడగడమే ఆ చిన్నారి పాలిట మరణశాసనమైంది. కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని చిన్నవయసులో చేసిన ప్రయత్నం.. అతడి ప్రాణాలు తీసింది. అరాచకశక్తుల దాష్టీకానికి ఆ కుటుంబం అండను కోల్పోయింది.

Updated : 18 Jun 2023 07:56 IST

మృతదేహంతో జాతీయ రహదారిపై బీసీ సంఘాల ఆందోళన
బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కలెక్టర్‌ హామీ
పరామర్శకు వచ్చిన ఎంపీ మోపిదేవిని.. గో బ్యాక్‌ అంటూ గ్రామస్థుల నినాదాలు

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- చెరుకుపల్లి గ్రామీణ: అక్కను వేధిస్తున్నారేమని అడగడమే ఆ చిన్నారి పాలిట మరణశాసనమైంది. కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని చిన్నవయసులో చేసిన ప్రయత్నం.. అతడి ప్రాణాలు తీసింది. అరాచకశక్తుల దాష్టీకానికి ఆ కుటుంబం అండను కోల్పోయింది. పదో తరగతి చదువుతున్న బాలుడు ఉప్పాల అమర్‌నాథ్‌ దారుణ హత్యపై బాపట్ల జిల్లాలో శనివారం ఆందోళనలు మిన్నంటాయి. వైకాపా అల్లరిమూకలే హత్య చేశాయని, ఆ పార్టీ నాయకులు హంతకులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని నిరసనలు పెల్లుబికాయి. బాలుడి మృతదేహంతో గంటన్నరకు పైగా స్థానిక ఐలాండ్‌ సెంటర్‌లో బాధిత కుటుంబసభ్యులు, గౌడసేన, బీసీ సంఘాలు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ నేతృత్వంలో రహదారిపై బైఠాయించి హంతకులకు ఉరిశిక్ష వేయాలన్న డిమాండుతో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు నుంచి ఉదయం 11.30 ప్రాంతంలో అంబులెన్సులో అమర్‌నాథ్‌ మృతదేహాన్ని బాలుడి స్వగ్రామం ఉప్పాలవారిపాలెం తీసుకెళ్తుండగా మండల కేంద్రం చెరుకుపల్లికి చేరుకుంది. మృతుడి కుటుంబీకులు, బంధువులు అంబులెన్సును అడ్డుకొని అందులోంచి మృతదేహాన్ని కిందకు దించి ఆందోళన చేశారు. మృతదేహంతో స్టేషన్‌ వద్దకు వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టారు. వాటిని నెట్టుకొని ముందుకెళ్తుండగా పోలీసులు ఆందోళనకారుల్ని వెనక్కు నెట్టేయడంతో రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి రోడ్డుమీద కూర్చున్నారు. మిగిలిన ఆందోళనకారులూ ఆయనతో పాటు బైఠాయించి 2గంటల పాటు ఆందోళన కొనసాగించారు.

హంతకులను అప్పగించాలని డిమాండు

తన అక్కను వేధిస్తున్నారని నిలదీసిన పాపానికి బాలుడిని అత్యంత పాశవికంగా కొట్టి పెట్రోలు పోసి దారుణంగా హతమారిస్తే... నిందితులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఆందోళనకారులు తీవ్రంగా మండిపడ్డారు. నిందితులకు వైకాపా నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయని, అందుకే వారు అంతలా తెగబడ్డారని, వారిని అరెస్టు చేయడం కాదని.. తమకు అప్పగించడమో, లేదా పోలీసులు వెంటనే ఉరితీసి తమకు తక్షణన్యాయం చేయాలని పట్టుబట్టారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఆందోళన విరమించాలని ఆర్డీవో, డీఎస్పీ, తహసీల్దార్‌ వచ్చారు. ఎలా న్యాయం చేస్తారో కలెక్టర్‌, ఎస్పీ వచ్చి స్పష్టమైన హామీనివ్వాలని బాధితులు పట్టుబట్టారు. ఇప్పటికే ప్రభుత్వానికి కుటుంబ ఆర్థిక పరిస్థితిపై నివేదిక పంపామని, వారి అనుమతి మేరకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని, ఆందోళన విరమించాలని ఆర్డీవో పార్థసారథి, డీఎస్పీ మురళీకృష్ణ కోరినా ససేమిరా అన్నారు. చివరకు అధికారులు ఎమ్మెల్యేతో మాట్లాడి కలెక్టర్‌కు ఫోన్‌ చేయించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల సాయంతో పాటు ఇల్లు కట్టిస్తామని, అమ్మాయి చదువు పూర్తికాగానే ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ విషయాల్ని ఆర్డీవో పార్థసారథి ఆందోళనకారులకు చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని సొంతూరికి తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ పాడె మోశారు.

వైకాపా నాయకుడి అండతోనే: ఎమ్మెల్యే అనగాని

బాలుడిని చంపిన నిందితులు నలుగురికి స్థానిక వైకాపా నాయకుడు జెస్సీరెడ్డి అండదండలు ఉన్నాయని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఆరోపించారు. చెరుకుపల్లి రూరల్‌ సీఐ తన వద్దకు వచ్చే ఫిర్యాదుదారుల్ని.. ఏ పార్టీ అని అడిగి ఇబ్బంది పెడుతున్నారన్నారు. తన అక్కను వేధిస్తున్నారని నిలదీసిన బాలుడిని ఇంతకుముందే నిందితుడు కొడితే, పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వారి ఉదాసీనతకు నిదర్శనమని మండిపడ్డారు. హత్య అనంతరం నిందితులు జెస్సీరెడ్డి ఇంటికి వెళ్లారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. జెస్సీరెడ్డిని నిందితుల జాబితాలో చేర్చాలని ఎస్పీ వకుళ్‌ జిందాల్‌ను కోరగా, అందుకు ఆయన అంగీకరించారని తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండుచేశారు.


మీ డబ్బులొద్దు.. ఉద్యోగం వద్దు

‘‘సోదరిని వేధిస్తున్నారని ప్రశ్నిస్తే కొట్టి పెట్రోలు పోసి చంపేస్తారా? ఇంతకన్నా ఘోరం ఇంకేం ఉంటుంది? నేరగాళ్ల రాజ్యంలో మా అబ్బాయి ప్రాణమే పోయింది. మీరొచ్చి ఇదిగో సాయం అంటూ రూ.లక్ష ఇస్తారా.. మీ లక్షొద్దు.. ఉద్యోగం వద్దు’’ అని ఎంపీ మోపిదేవి వెంకటరమణరావుపై ఉప్పాలవారిపాలెం గ్రామస్థులు మండిపడ్డారు. అమర్‌నాథ్‌ కుటుంబీకులను పరామర్శించడానికి శనివారం ఉదయం ఎంపీ మోపిదేవి ఆ గ్రామానికి వెళ్లగా.. ఆయనను అడ్డుకున్నారు. బాధిత కుటుంబం నివసిస్తున్న ప్రాంతానికి వెళ్లనివ్వకుండా వాళ్ల బంధువులు రహదారికి అడ్డుగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆయన వెంట ఉన్న స్థానిక వైకాపా నాయకులు గ్రామస్థులకు నచ్చజెప్పి బాధిత కుటుంబీకులను అక్కడకు పిలిపించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తామని, ప్రభుత్వపరంగా రావాల్సిన సాయాన్ని అందించే ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఆ తర్వాత రూ.లక్ష నగదు తీసి బాధిత కుటుంబీకులకు ఇవ్వబోతుండగా.. అక్కడే ఉన్న బంధువులు మీ సాయం వద్దే వద్దని ఆ డబ్బు వెనక్కి ఇచ్చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని