I-PAC - CM Jagan: ఏ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు?

రాబోయే ఎన్నికలకు వైకాపా అభ్యర్థుల ఖరారుపై ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ వేగంగా కసరత్తు చేస్తున్నారు.

Updated : 08 Jul 2023 09:19 IST

ఎవరెవరిని వచ్చే ఎన్నికల్లో కొనసాగించొచ్చు?
ఐ-ప్యాక్‌ బృందంతో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష
నియోజకవర్గాల బాధ్యులపైనా ఆరా

ఈనాడు, అమరావతి: రాబోయే ఎన్నికలకు వైకాపా అభ్యర్థుల ఖరారుపై ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ వేగంగా కసరత్తు చేస్తున్నారు. వైకాపా ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఐ-ప్యాక్‌ ప్రతినిధులతో తరచూ సమీక్షిస్తున్న ఆయన శుక్రవారం కూడా క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులు వారి నియోజకవర్గాల్లో ఎలా పనిచేస్తున్నారు? జనంలో వారిపై ఉన్న అభిప్రాయం ఏమిటనే అంశాలపై ఐ-ప్యాక్‌ సిద్ధం చేసిన నివేదికలను సీఎం సమీక్షించారు. వారిలో ఎవరెవరిని కొనసాగించొచ్చు అనే అంశంపై చర్చించినట్టు సమాచారం. అలాగే వివిధ నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను బరిలో దింపేందుకు క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేల్లో ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వచ్చాయనే అంశాలపైనా చర్చించినట్లు తెలిసింది. త్వరలో అభ్యర్థులను ఖరారు చేసేందుకు వీలుగా ఈ నివేదికలన్నింటినీ కొలిక్కి తేవాలని జగన్‌ సూచించినట్లు సమాచారం. తాజాగా హిందూపురం నియోజకవర్గ పార్టీ బాధ్యతలను కొత్త అభ్యర్థికి ఇచ్చారు. అదే తరహాలో పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాలకు సమన్వయకర్తలను త్వరగా ఖరారు చేసేందుకు వైకాపా అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. పనితీరు బాగోలేదని గుర్తించిన ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారిని తీసుకొచ్చే అంశంపైనా సీరియస్‌గానే దృష్టి పెట్టారంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని