ఆంధ్ర వర్సిటీ ప్రతిష్ఠపై మసక!

ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) వందేళ్ల సంబరాలకు చేరువవుతోంది. ఇక్కడ విద్యనభ్యసించిన ఎందరో దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.

Updated : 01 Aug 2023 06:31 IST

లైంగిక వేధింపులపై వరుస ఫిర్యాదులు
కాసులిస్తే పీహెచ్‌డీలు మంజూరు?

ఈనాడు, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) వందేళ్ల సంబరాలకు చేరువవుతోంది. ఇక్కడ విద్యనభ్యసించిన ఎందరో దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వర్సిటీకి గుర్తింపు ఉంది. ఆ ప్రతిష్ఠ ఇప్పుడు మంటగలిసేలా ఘటనలు, ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఇప్పటికే వీసీ ఛాంబర్‌ వైకాపా కార్యాలయంలా మారిందన్న ఆరోపణలు ఉండగా, తాజాగా ఆచార్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. ఏకంగా 1400 పీహెచ్‌డీ పట్టాలు అమ్మకానికి సిద్ధం చేశారంటూ వర్సిటీ ప్రొఫెసరే చెప్పడం సంచలనమైంది. అంతేనా.. క్యాంపస్‌లో లిక్కర్‌ వ్యాపారం, గంజాయి లభిస్తుండటంతోపాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడం కలకలం రేపుతోంది.

బయటకు వచ్చినవి కొన్నే

వర్సిటీలో హిందీ విభాగాధిపతి సత్యనారాయణ ఓ రీసెర్చ్‌ స్కాలర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు జాతీయ మహిళా కమిషన్‌కు ఇటీవల ఫిర్యాదు అందింది.  ప్రీ-టాక్‌, వైవా కోసం డబ్బులు డిమాండ్‌ చేశారని, తనతో బయటకు రావాలని లైంగికంగా వేధించారన్న ఫిర్యాదును ఏయూ మహిళా గ్రీవెన్స్‌ సెల్‌కు పంపి విచారణ ఆరంభించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను విభాగాధిపతిగా తొలగించారు. ఏయూలో చాలా వేధింపులు జరుగుతున్నా అవి వెలుగులోకి రావడం లేదని సమాచారం. ఒకవేళ వచ్చినా రాజకీయ ఒత్తిళ్లతో ఉన్నతాధికారులు హెచ్చరించి వదిలేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. గతంలో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డీన్‌గా ఉన్న ఓ కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులందాయి. కొన్ని నెలల క్రితం విశ్రాంత ఆచార్యులు ఇద్దరిపైనా ఈ తరహా ఆరోపణలు రావడం గమనార్హం. సోషల్‌ వర్క్స్‌ విభాగ ఉద్యోగి,  ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌పై అభియోగాలు రాగా, మహిళా కమిటీ విచారణ జరిపి నివేదికలిచ్చింది. ప్రస్తుతం వీరిద్దరూ సస్పెన్షన్‌లో ఉన్నారు. ఇటీవల ఓ ప్రొఫెసర్‌ మద్యం మత్తులో నాలుగో తరగతి ఉద్యోగినిని వేధించడంతో పెద్ద గొడవ జరిగింది. ఒక ప్రొఫెసర్‌ నాన్‌ టీచింగ్‌ ఉద్యోగినికి క్యాంపస్‌లో క్వార్టర్స్‌ ఇప్పించారని, మరో సీనియర్‌ ప్రాంగణంలోని రేకుల షెడ్డులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు ఇటీవల వరసగా వచ్చాయి.

అమ్మకానికి పీహెచ్‌డీలు

ఎగ్జిక్యూటివ్‌ పీహెచ్‌డీల పేరుతో భారీ దందా జరుగుతోందని వర్సిటీ పాలకమండలిపై హిందీ విభాగాధిపతి సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు 1400 అడ్మిషన్లు జరగ్గా...ఎగ్జిక్యూటివ్‌ కోటా పేరు చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయన్నారు. డీన్‌గా, వివిధ హోదాల్లో పనిచేసిన సత్యనారాయణే ఇలా ఆరోపించడం సంచలనమైంది. ఇవి నిజమే అనేలా ఒక ఉన్నతాధికారి వ్యవహార శైలి, నిర్ణయాలున్నాయి. కంప్యూటర్‌ సైన్సులో రీసెర్చ్‌ చేసి ఓ ప్రైవేటు కళాశాలలో ప్రిన్సిపాల్‌గా ఉన్న వ్యక్తికి వర్సిటీలో కీలక హోదా కూడా కట్టబెట్టారు. ఎలాంటి రీసెర్చ్‌ (పరిశోధన) అనుభవం లేనప్పటికీ ఓ విభాగానికి డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. ‘తమకున్న అధికారాలతో ఏడాదిన్నర, రెండేళ్లకే సబ్‌మిషన్‌కు అవకాశం కల్పించేస్తున్నారు. ఆ తరవాత రెండు, మూడు నెలల్లోనే పీహెచ్‌డీ ప్రదానం చేస్తున్నారు. ఇందుకు ఒక్కో పీహెచ్‌డీకి రూ.5లక్షల వరకు వసూలు చేస్తున్నారు’ అనేవి కీలక ఆరోపణలు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా

ఒక స్కాలర్‌ భర్తకు డిఫెన్స్‌ రంగానికి చెందిన వారితో ఉన్న పరిచయాలతో మద్యం బాటిళ్లు తీసుకువచ్చి ఏయూలో వ్యాపారం చేస్తుంటారని ప్రొఫెసర్‌ సత్యనారాయణ ఆరోపించారు. పీహెచ్‌డీలు, లిక్కర్‌ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఇటీవల కొందరు భద్రతా సిబ్బంది వద్ద గంజాయి పట్టుకున్నారు. వర్సిటీలో కొన్నిచోట్ల చదును చేస్తున్న సమయంలో కండోమ్‌ ప్యాకెట్లు గుట్టలు గుట్టలుగా దొరికాయి. ఇలాంటి సంఘటనలతో ఏయూలో అసలు ఏం జరుగుతోందనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని