Gaddar: పాటే ఆయన ఆయుధం

భారత సమాజంలో ఎన్నిరకాల అసమానతలు ఉన్నాయో, ఎన్ని రకాలుగా దోపిడీ జరుగుతుందో, ఎన్ని రకాల వృత్తులున్నాయో అన్నింటిపై పాట రాసి, గజ్జెకట్టి పాడి జనాన్ని ఉర్రూతలూగించిన అభినవ వాగ్గేయకారుడు గద్దర్‌.

Updated : 07 Aug 2023 07:21 IST

అసమానతలు, దోపిడీలపై  ఎక్కుపెట్టిన ఉద్యమం
అభినవ వాగ్గేయకారుడిగా గుర్తింపు పొందిన గద్దర్‌

ఈనాడు, హైదరాబాద్‌: భారత సమాజంలో ఎన్నిరకాల అసమానతలు ఉన్నాయో, ఎన్ని రకాలుగా దోపిడీ జరుగుతుందో, ఎన్ని రకాల వృత్తులున్నాయో అన్నింటిపై పాట రాసి, గజ్జెకట్టి పాడి జనాన్ని ఉర్రూతలూగించిన అభినవ వాగ్గేయకారుడు గద్దర్‌. ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించి ఉద్యమంలో భాగమయ్యేలా చేయడంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రజా యుద్ధనౌక ఆయన. నిరసన వ్యక్తం చేయడానికి పాటే ఆయన ఆయుధం. కిర్రు కిర్రు చెప్పులోయమ్మా.. అంటూ అంటరానితనం గురించి ఆవేదన వ్యక్తం చేయడం.. ఎంత సక్కగుండాదే నా చెత్తకుండీ.. అంటూ దాని గొప్పతనాన్ని వర్ణించడం, సుందరాంగి పాయఖానా.. అంటూ ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో. సిరిమల్లె చెట్టుకిందా లచ్చుమమ్మో, కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మా, బావయ్యో ఒక్కసారి చూసిపోవా.. ఇలా మహిళా ఉద్యమం నేపథ్యంలో వారి గురించే ఎన్నో పాటలు. తెలంగాణ గురించి ఇది దగాబడ్డ తెలంగాణ అంటూ.. ఆయన రాయని, పాడని అంశం అరుదు. రష్యాలో గోర్కి, చైనాలో లుషాన్‌ ఎంత ప్రభావం చూపారో భారతదేశంలో గద్దర్‌ అంత ప్రభావం చూపారని అనేక మంది రచయితలు, పరిశోధకులు పేర్కొంటారు.

ఆయన మాటలు కవితాత్మకంగా ఉంటాయి కాబట్టి కవి అనొచ్చు.. ఆయన పాటలు కార్యాచరణకు ఉసిగొల్పుతాయి కాబట్టి విప్లవకారుడని పిలవొచ్చు.. ఆయన ఎప్పుడూ కార్యాచరణలోనే ఉన్నారు కాబట్టి ఉద్యమకారుడనొచ్చు. తెలుగు లోగిళ్లలోనే కాదు, అనేక రాష్ట్రాల్లో ఆయన ఆట పాటలతో లక్షల మందిని ఉర్రూతలూగించారు. దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన విప్లవ గాయకుల్లో అగ్రగణ్యునిగా గుర్తింపు పొందారు. విప్లవ, ప్రజాస్వామిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. గత అయిదు దశాబ్దాలుగా ప్రతి తెలుగు ఇంటికి గద్దర్‌ సుపరిచితం. మార్క్స్‌ రాజకీయ అర్థశాస్త్రాన్ని, మావో సిద్ధాంతాన్ని సులభమైన పాటలు, మాటల్లో చెప్పేవారు. పేదలు, కార్మికులు, రైతులు, కూలీలు, వృత్తి కార్మికులు ఇలా వారి జీవితాలనే పాటలు గట్టి పాడేవారు. గద్దర్‌ పాట ప్రజల్లో ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని నింపేది. ఆయన ఆట, పాట హృదయాన్ని తాకేది. సమాజంలోని రుగ్మతల గురించి ఆలోచింపజేసేవి. ఎందుకంటే వారి జీవితం గురించే ఆయన పాడేవారు. వారిపై బలమైన ముద్రవేసేవారు.

శ్రీకాకుళం రైతాంగ ఉద్యమం, విప్లవకారులైన వెంపటాపు సత్యం తదితరుల ప్రభావం గద్దర్‌పై బలంగా ఉంది. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమం.. నిరుద్యోగం, పేదరికాన్ని పారదోలుతుందనే నమ్మకం కలిగించినా.. కొన్నాళ్లకే దాని నుంచి దూరంగా జరిగారు. 1970వ దశకంలో విప్లవ రాజకీయాలవైపు  ఆకర్షితులయ్యారు. 1971లో బి.నరసింగరావుతో గద్దర్‌కు పరిచయం అయింది. ప్రజాస్వామ్యం, ప్రజల్లో సమానత్వం గురించి, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పనిచేసేందుకు బి.నరసింగరావు ప్రధాన ఆర్టిస్ట్‌గా ఏర్పడిన ఆర్ట్‌ లవర్స్‌ అసోసియేషన్‌లో గద్దర్‌ భాగమయ్యారు. ఆయన తీసిన మాభూమి సినిమాలో ‘బండెనక బండి కట్టి’ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ సంస్థ మొదట తెలంగాణ సంస్కృతి, గుర్తింపుపై ఎక్కువగా పనిచేసేది. గద్దర్‌ చేరిన తర్వాత దీని స్వభావమే మారిపోయింది. సమాజంలో మార్పు రావాలంటే విప్లవమే పరిష్కారమంటూ ఆ దిశలో పాటలతో ప్రచారం మొదలైంది. జననాట్య మండలిగా ఏర్పాటైన తర్వాత పీపుల్‌్్సవార్‌ గ్రూపునకు సాంస్కృతిక విభాగమైంది. ఈ మండలితో పెనవేసుకుపోయిన జీవితం గద్దర్‌ది. ఆయన పాట.. సంస్కృతి, సిద్ధాంతం మధ్య ఉన్న సంబంధాన్ని వివరించడమే కాదు, సామాజిక, రాజకీయ అవసరాలనూ తెలిపేది. పేదరికం, దోపిడీ గురించి వివరిస్తూ పాడటమే కాదు, ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించేవారు. తెలుగు సమాజంలో జరిగిన అన్ని ప్రత్యామ్నాయ ఉద్యమాల్లోనూ ఆయన భాగస్వాములయ్యారు. ఆల్‌ ఇండియా లీగ్‌ ఫర్‌ లిటరేచర్‌ అండ్‌ రెవల్యూషనరీ కల్చర్‌ (ఏఐఎల్‌ఆర్‌సీ) కార్యదర్శిగా దేశమంతా తిరిగి నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం వేల సంఖ్యలో ప్రదర్శనలిచ్చారు. అనేకమందిని కళాకారులుగా తయారు చేశారు. 2004లో ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య జరిగిన శాంతి చర్చల్లో భాగస్వామి అయ్యారు. నక్సల్బరీ రాజకీయాలతో మమేకమైనప్పుడైనా, తర్వాత అంబేడ్కర్‌ బాటలో నడిచినా.. ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా గద్దర్‌ ప్రత్యక్షమయ్యేవారు. చివరి వరకు జనంకోసమే ఆయన పాట, ఆట కొనసాగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని