గాలేరు నగరి పేరుతో దగా

మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.

Updated : 16 Aug 2023 06:20 IST

నాడు ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన జగన్‌
అధికారంలోకి రాగానే పనులన్నీ రద్దు
మోసపోయిన ఉమ్మడి చిత్తూరు ప్రజలు
ఈనాడు - తిరుపతి, అమరావతి


మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.
2018 జనవరి 3న చిత్తూరు జిల్లా కలికిరిలో పాదయాత్రలో జగన్‌.


జలయజ్ఞంలో ప్రాధాన్య ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.
2019లో వైకాపా ఎన్నికల ప్రణాళిక


ప్రస్తుత పరిస్థితి:

గాలేరు నగరి సుజల స్రవంతి జలాల కోసం ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1.03 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందుతాయి. లక్షలమంది ప్రజల దాహార్తి తీరుతుంది. వైకాపా అధికారంలోకొచ్చిన ఈ నాలుగేళ్లలో ఒక్క జలాశయ నిర్మాణాన్నీ పూర్తి చేయలేదు. ప్యాకేజీల అంచనాలు పెంచినా పనులేమీ జరగలేదు.


గత ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్‌ చెప్పిందొకటి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చేస్తున్నదొకటి. నాడు ఆయన చెప్పిన మాటలను నమ్మిన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు.. ఇపుడు చేతలు చూసి విస్తుపోతున్నారు. ఎందుకంటే.. జగన్‌ అధికారంలోకొచ్చిన వెంటనే గాలేరు నగరి సుజల స్రవంతి రెండో దశ ప్యాకేజీ పనులను రద్దు చేసేశారు. అయిదు జలాశయాల నిర్మాణాన్ని పూర్తి చేసి 10 టీఎంసీల కృష్ణా జలాలతో నింపాల్సి ఉండగా.. వాటినీ రద్దు ఖాతాలో చేర్చేశారు. వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలన్నీ ఆగిపోయాయి. నేటికీ అడుగు ముందుకు పడితే ఒట్టు. సవరించిన అంచనాలకు పాలనామోదమూ ఇవ్వలేదు. ఇక టెండర్లను ఎపుడు పిలుస్తారు? గుత్తేదారులు ఎపుడు ఖరారవుతారు? గాలేరు జలాలు ఎప్పుడు వినియోగంలోకి వస్తాయి? ప్రజల ప్రశ్నలకు జగన్‌ సమాధానం చెబుతారా?


ఏమిటీ ప్రాజెక్టు?

  • గాలేరు నగరి సుజల స్రవంతిని రెండు దశల్లో చేపట్టాలనేది ప్రణాళిక.
  • శ్రీశైలం నుంచి 38 టీఎంసీల వరద జలాలను మళ్లించి కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు,. రెండోదశలో 2.25 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలన్నది లక్ష్యం.
  • ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,03,500 ఎకరాలకు నీరిచ్చి సమీప గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చడం.
  • తొలిదశ పనులు తెదేపా ప్రభుత్వ హయాంలోనే కొలిక్కి వచ్చినా ఇప్పటికీ డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయలేదు.
  • కడప జిల్లా కోడూరు తర్వాత తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోకి ఈ కాలువ ప్రవహిస్తుంది.
  • తిరుమలకు వచ్చే భక్తులకు శాశ్వత నీటి వసతి అందుబాటులోకొస్తుంది. బాలాజీ జలాశయం నుంచి నీటిని అందించాలన్న ప్రణాళిక సాకారమవుతుంది.

పెరిగిపోతున్న అంచనాలు

ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యేకొద్దీ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం తొలిదశలో రూ. 7,030.71 కోట్లకు, రెండో దశలో రూ. 4010.95 కోట్లకు పాలనామోదం వచ్చింది. రెండోదశ అంచనాలను రూ. 5,014 కోట్లకు పెంచి పాలనామోదానికి ప్రయత్నిస్తున్నారు.

బాలాజీ జలాశయం:  10.28 శాతం పనులే పూర్తయ్యాయి. తితిదే, తిరుపతి కార్పొరేషన్‌ సైతం నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. నీటి నిల్వ సామర్థ్యం 3.082 టీఎంసీలు. పూర్తయితే తిరుపతితోపాటు తిరుమలకు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించొచ్చు.

మల్లెమడుగు జలాశయం: నీటి నిల్వ సామర్థ్యం 2.683 టీఎంసీలు. పనులు 44 శాతమే పూర్తయ్యాయి. రెండో దశ అటవీ అనుమతులు రాకపోవడంతో నిలిపేశారు. ఇటు బాలాజీ జలాశయంతోపాటు అటు సోమశిల స్వర్ణముఖి లింకు కాలువ ద్వారా మేర్లపాక నుంచి నీటిని తరలించడానికి ప్రణాళికలున్నాయి.  

వేణుగోపాలసాగర్‌ ప్రాజెక్టు: నీటి నిల్వ సామర్థ్యం 2.68 టీఎంసీలు. 29 శాతం పనులే పూర్తయ్యాయి. అటవీ సమస్యలను పరిష్కరించలేకపోయారు. 25,800 ఎకరాలకు నీరివ్వాలన్నది లక్ష్యం.

అడవికొత్తూరు జలాశయం: 10 వేల ఎకరాలకు నీరందేలా ఒక టీఎంసీ సామర్థ్యంతో నిర్మాణం ఎప్పుడో మొదలైంది. 5 వేల ఎకరాలకు నీళ్లిచ్చేలా 0.533 టీఎంసీల సామర్థ్యంతో వేపగుంట జలాశయం నిర్మిస్తున్నారు.


ఈ 5 జలాశయాలకు నీరందేనా?

గాలేరు నగరి రెండో దశలో కోడూరు వరకు నీళ్లిస్తామని జగన్‌ సర్కారు ప్రకటిస్తున్నా ఆ పనులు వేగంగా సాగడం లేదు. కోడూరు వరకు పనులే ఇంకా పూర్తి కాలేదు. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో అయిదు జలాశయాలకు నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఏడు ప్యాకేజీల్లోని పనులు పూర్తి కాకుండానే రద్దు చేసేశారు. మిగిలి ఉన్న పనులకు మళ్లీ అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. మళ్లీ టెండర్లు పిలిచి పనులు చేపట్టాల్సి ఉంది. ఈ నాలుగేళ్లలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక్క రూపాయి ఖర్చు చేసిందీ లేదు. ఈ జలాశయాలు నిర్మిస్తే వాటి పరీవాహకం నుంచే ఒక్కో టీఎంసీ నీరు అందుతుందని అంచనాలు వేశారు. మరో అయిదు టీఎంసీల కృష్ణా వరద జలాలు మళ్లిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని