New Pensions In AP: ఏపీలో కొత్త పింఛన్లు కొందరికేనా?

పారదర్శకతపై గంభీరమైన మాటలు చెప్పే ముఖ్యమంత్రి జగన్‌....పాలనలో అడుగడుగునా గోప్యత పాటిస్తున్నారు.

Updated : 25 Aug 2023 08:13 IST

కొన్ని దరఖాస్తులనే పరిశీలనకు పంపిన ప్రభుత్వం
వివరాలు బయటకు పొక్కకుండా ఎంపీడీవో కార్యాలయాల్లో తనిఖీ
అర్జీదారుల్లో ఆందోళన

ఈనాడు, అమరావతి: పారదర్శకతపై గంభీరమైన మాటలు చెప్పే ముఖ్యమంత్రి జగన్‌... పాలనలో అడుగడుగునా గోప్యత పాటిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వుల్ని పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచకుండా ప్రత్యేక వ్యవస్థను తెచ్చిన ఆయన... సామాజిక భద్రత పింఛన్లపై అదే గోప్యత అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఆరు నెలలకోసారి (జులై, జనవరి) కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పిన గడువు దాటి మరో రెండు నెలలు గడుస్తోంది. జులై 1వ తేదీనే కొత్త పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా... సెప్టెంబర్‌ 1వ తేదీ వచ్చేస్తోంది. వచ్చే నెల అయినా కొత్త పింఛన్లు పంపిణీ చేస్తారని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. గతేడాది నవంబర్‌ 20 తర్వాత నుంచి ఈ ఏడాది మే నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకున్న వారి అర్హతను నిర్ధారించి కొత్త పింఛన్లు ఇవ్వాల్సి ఉంది. రెండు రోజుల క్రితం దరఖాస్తులను.. పరిశీలన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీవో కార్యాలయాల వారీగా విభజించి పంపారు. నిర్దేశిత గడువులో నమోదైన అన్ని దరఖాస్తులను ప్రభుత్వం క్షేత్రస్థాయికి పంపలేదని తెలిసింది.

రాష్ట్రవ్యాప్తంగా కొన్ని సచివాలయాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్యకు...ప్రభుత్వం తాజాగా పరిశీలనకు పంపిన దరఖాస్తులకు దాదాపుగా 60% తేడా ఉన్నట్లు సమాచారం. ఏ ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకుని కొన్నింటిని మినహాయించారనే విషయం బయటకు పొక్కకుండా అధికారులు గోప్యత పాటిస్తున్నారు. జిల్లాల్లో డీఆర్‌డీఏలకు కూడా పూర్తి సమాచారం లేదు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు దీనిపై వాకబు చేస్తున్నా వారికీ సమాధానం లభించని పరిస్థితి. ప్రభుత్వం తాజాగా 1.49 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. దీనిపై వివరణ కోరితే తమకు అందిన దరఖాస్తులన్నీ పరిశీలన కోసం క్షేత్రస్థాయికి పంపామని చెబుతూ గ్రామ, వార్డు సచివాలయ, సెర్ప్‌ అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు.

నిధుల కొరతా?

రాష్ట్ర ప్రభుత్వానికి 2014-15 నాటి రెవెన్యూ లోటు గ్రాంటు కింద కేంద్రం ఇటీవలే రూ.10 వేల కోట్లకుపైగా నిధులు విడుదల చేసింది. ఇది కాక ఎప్పటికప్పుడు అప్పులూ తెస్తోంది. అయినా ఇటీవల సీఎం జగన్‌ బటన్‌ నొక్కుతున్న పథకాల లబ్ధి.. ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యేందుకు తీవ్ర జాప్యం జరుగుతోంది. డ్వాక్రా సంఘాల మహిళల ఖాతాల్లో వైయస్‌ఆర్‌ ఆసరా మూడో విడత నిధులు మొత్తం పూర్తిగా జమ అయ్యేనాటికి 50 రోజులకుపైగానే సమయం పట్టింది. జూన్‌లో విడుదల చేసిన అమ్మఒడి పథక నిధులు లబ్ధిదారులందరికీ జమకావడానికి 25 రోజులపైనే పట్టింది. జులై 1వ తేదీన ఇవ్వాల్సిన పింఛన్లను రెండు నెలలపాటు జాప్యం చేసింది. పైగా దరఖాస్తు చేసుకున్న అందరి వివరాలూ పరిశీలించకుండా కొన్నింటిని మాత్రమే క్షేత్రస్థాయిలో తనిఖీకి పంపింది.


పక్క వ్యక్తికి కూడా తెలియకుండా..

కొత్త పింఛన్ల పరిశీలనకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే విషయం కార్యాలయంలో పక్కన ఉన్న వ్యక్తికి కూడా తెలియకూడదని  సచివాలయ కార్యదర్శులకు కొన్ని చోట్ల ఎంపీడీవోలు మౌఖిక ఆదేశాలు ఇస్తున్నారు. మరికొన్ని చోట్ల దరఖాస్తుదారుల అర్హతను తనిఖీ చేసేందుకు వారిని ఎంపీడీవో కార్యాలయాలకే రప్పించుకుంటున్నారు. పరిశీలనకు దరఖాస్తులు తక్కువగా పంపారనే విషయం కొన్ని చోట్ల బయటకు చేరింది. దీనిపై దరఖాస్తుదారులు సచివాలయాలకు వచ్చి సంక్షేమ కార్యదర్శులను ప్రశ్నిస్తున్నారు. తమకు పింఛను ఇస్తారో లేదో అనే ఆందోళన వారిలో నెలకొంది.

  • అనంతపురం అర్బన్‌ పరిధిలో 1,615 మందికి కొత్తగా పింఛను పత్రాలు మంజూరు చేశారు. ఇక్కడ పరిశీలనకు 631 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
  • చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో 328 మంది దరఖాస్తు చేసుకుంటే పరిశీలనకు 162 మాత్రమే వచ్చాయి.
  • మన్యం జిల్లా పరిధిలోని ఓ నియోజకవర్గంలో 2300 మంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం తనిఖీకి సుమారు 1000 దరఖాస్తులనే పంపింది. దీనిపై అక్కడి ఎమ్మెల్యే అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
  • విజయనగరం మండల పరిధిలో 272 మంది దరఖాస్తు చేసుకుంటే పరిశీలనకు 150లోపే వచ్చాయి.
  • ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కొన్ని సచివాలయాల పరిధిలో దరఖాస్తులను 50 శాతానికిపైగానే కుదించి పరిశీలనకు పంపారు. ఎందుకు తక్కువగా పంపారో తమకు ఏ మాత్రం సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు.
  • ఉమ్మడి కడప జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని