CBI - Ajeya Kallam: ఒత్తిడితోనే మాటమార్చిన అజేయ కల్లం

మాజీమంత్రి వివేకా హత్యకేసులో ప్రాసిక్యూషన్‌ సాక్షిగా ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారి, ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం వాంగ్మూలం ఆడియో రికార్డును తెలంగాణ హైకోర్టుకు సీబీఐ శుక్రవారం సీల్డ్‌కవర్‌లో సమర్పించింది.

Updated : 17 Sep 2023 10:58 IST

వివేకా హత్య కేసులో ఆయన చెప్పిందే నమోదు చేశాం.. మార్పుచేర్పులూ చేశారు
ఇతర సాక్షులను ప్రభావితం చేయాలన్న ఎత్తుగడ ఇది
వాంగ్మూలాన్ని తొలగించాలన్న అజేయ కల్లం పిటిషన్‌పై సీబీఐ కౌంటరు
తెలంగాణ హైకోర్టుకు వాంగ్మూలం ఆడియో రికార్డు అందజేత

ఈనాడు, హైదరాబాద్‌: మాజీమంత్రి వివేకా హత్యకేసులో ప్రాసిక్యూషన్‌ సాక్షిగా ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారి, ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం వాంగ్మూలం ఆడియో రికార్డును తెలంగాణ హైకోర్టుకు సీబీఐ శుక్రవారం సీల్డ్‌కవర్‌లో సమర్పించింది. తన వాంగ్మూలాన్ని వక్రీకరించి... సీబీఐ కింది కోర్టుకు సమర్పించిందని, దాన్ని రికార్డుల నుంచి తొలగించాలన్న అజేయ కల్లం ఆరోపణల నేపథ్యంలో ఆడియో రికార్డును హైకోర్టుకు సీబీఐ సమర్పించింది. ఏప్రిల్‌ 29న అజేయ కల్లం వాంగ్మూలాన్ని నమోదుచేయగా ఇంత ఆలస్యంగా దాన్ని ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారంటే ఆయనపై ఒత్తిడి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని సీబీఐ వెల్లడించింది. ‘‘ఆయన చెబుతుంటే దర్యాప్తు అధికారి టైప్‌ చేశారు. తర్వాత ఆయన దాన్ని పరిశీలించి, మార్పుచేర్పులు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. తనపై ఒత్తిడి రావడంతో ఆ తర్వాత వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. ఈ స్థాయి సాక్షి ఎదురుతిరిగితే సాధారణ సాక్షుల పరిస్థితి ఏంటి? ఈ ఎత్తుగడ ఇతర సాక్షుల ఆలోచనలపై ప్రభావం చూపుతుంది’’ అని తెలిపింది.

తన వాంగ్మూలాన్ని సీబీఐ వక్రీకరించిందని, దాన్ని కోర్టు రికార్డుల నుంచి తొలగించేలా ఆదేశించాలంటూ అజేయ కల్లం తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ శుక్రవారం కౌంటరు దాఖలుచేసింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి..

‘‘పిటిషన్‌ దాఖలుచేయడం చట్టప్రక్రియను దుర్వినియోగం చేయడమే. ఈ పిటిషన్‌ విచారణార్హం కాదు. ప్రధానకార్యదర్శిగా పదవీవిరమణ చేసిన అజేయ కల్లం ఇప్పుడు, వాంగ్మూలం నమోదు చేసినప్పుడూ ఏపీ ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు. పిటిషన్‌లో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే సీబీఐ అదనపు ఎస్పీ ముఖేష్‌ శర్మ, ఎస్పీ వికాస్‌కుమార్‌ ఎదుట ఆయన ఇంట్లోనే నమోదుచేసిన వాంగ్మూలాన్ని ఇంత ఆలస్యంగా ఉపసంహరించుకుంటున్నారంటే ఆయనపై ఒత్తిడి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఏప్రిల్‌ 29న వాంగ్మూలం నమోదుచేయగా ఇప్పటివరకు దర్యాప్తు అధికారిపై ఫిర్యాదుచేయలేదు. దీన్నిబట్టి వాంగ్మూలానికి ఆయన అంగీకారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. మాజీ ఐఏఎస్‌ అధికారిగా సీఆర్‌పీసీ సెక్షన్‌ 161 కింద నమోదుచేసిన వాంగ్మూలం గురించి ఆయనకు స్పష్టంగా తెలుసు. చట్టప్రకారం వాంగ్మూలాన్ని దర్యాప్తు అధికారి రికార్డు చేసి, దాన్ని చదివి వివరిస్తారు. సీఎస్‌ స్థాయిలో పనిచేసిన వ్యక్తి తన వాంగ్మూలం విరుద్ధంగా ఉందని, మే మూడోవారంలో పత్రికల్లో వచ్చిన తర్వాత మీడియా సమావేశం ద్వారా ఖండించాల్సి వచ్చిందని ఆరోపించారు. అయినా ఈ వాంగ్మూలంలో ఒక భాగాన్నే ఆయన తిరస్కరిస్తున్నారు.

విచారణార్హం కాదు

అజేయ కల్లం అనుమతితో దర్యాప్తు అధికారి చట్టప్రకారం వాంగ్మూలం నమోదు చేసినందున చట్టప్రకారం ఈ పిటిషన్‌ చెల్లదు. దర్యాప్తు అధికారిపైన, సీబీఐపైన తప్పుడు ఆరోపణలు, అపోహలతో దాఖలు చేసినందున పిటిషన్‌ విచారణార్హం కాదు. సీనియర్‌ అధికారిగా పనిచేసిన అజేయ కల్లం.. ఈ కేసులో దర్యాప్తుసంస్థ, న్యాయవ్యవస్థపై విశ్వసనీయత చూపాల్సింది పోయి నేర న్యాయప్రక్రియకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

చెప్పినది చెప్పినట్లే..

సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద సాక్షికి నోటీసు ఇచ్చి పిలిపించే అధికారం దర్యాప్తు అధికారికి ఉంది. 15 ఏళ్లలోపువారిని, 60 ఏళ్లు దాటినవారిని, మహిళలను పిలిపించకూడదు. వారి దగ్గరికే వెళ్లి వాంగ్మూలాన్ని నమోదుచేయాలి. అందుకే పిటిషనర్‌ను వాట్సప్‌, ఫోన్‌ ద్వారా సంప్రదించి ఆయనకు వీలైన సమయం, ప్రదేశం తెలుసుకుని వెళ్లాం. చెప్పినది చెప్పినట్లు రికార్డు చేశాం. ఇప్పుడు దర్యాప్తు సంస్థపై ఆరోపణలు చేస్తూ ఉపసంహరించుకుంటున్నారు. ఆయన ఆరోపణలన్నీ కల్పితమే.

కేసును నీరుగార్చే ప్రయత్నం

చెప్పాలనుకున్నది చెప్పే హక్కు పిటిషనర్‌కు ఉంది. అది విచారణ సమయంలో చెప్పాలి. ఈ దశలో పిటిషన్‌ వేసి ఆరోపణలు చేయడం సరికాదు. ఇది వివేకా హత్యకేసు దర్యాప్తును నీరుగార్చేందుకు, సీబీఐ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు చేసే ప్రయత్నం. వివేకా హత్యపై నిష్పాక్షికంగా, పారదర్శకంగా దర్యాప్తుచేశాం. నిర్దోషులను తప్పుగా ఇరికించే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. జూన్‌ 28న అనుబంధ అభియోగపత్రం దాఖలుచేయడంతో దర్యాప్తు పూర్తయింది.

నేర న్యాయవ్యవస్థ అపహాస్యమే

ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించడం ద్వారా ప్రతి సాక్షీ వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంటే.. నేర న్యాయవ్యవస్థ అపహాస్యం పాలవుతుంది. సాక్షిగా మాజీ ఐఏఎస్‌ స్థాయి అధికారి వ్యక్తి విచారణ ప్రారంభం కాకముందే ఎదురుతిరిగితే సాధారణ సాక్షులపై తీవ్ర ప్రభావం పడుతుంది. సాక్షులను ప్రభావితం చేయాలన్న ఉద్దేశంతో దాఖలుచేసిన ఈ పిటిషన్‌ను భారీ జరిమానా విధిస్తూ కొట్టేయాలి’’ అని తెలంగాణ హైకోర్టును సీబీఐ అభ్యర్థించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని