రాయల్స్‌.. రయ్‌మని

ఎప్పుడో ఐపీఎల్‌ తొలి ఏడాది ఛాంపియన్‌గా నిలిచింది రాజస్థాన్‌. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది.

Updated : 28 Apr 2024 06:58 IST

8వ విజయంతో ప్లేఆఫ్స్‌ స్థానం దాదాపు ఖాయం
మెరిసిన సంజు, జురెల్‌
రాహుల్‌ శ్రమ వృథా.. లఖ్‌నవూ ఓటమి

ఎప్పుడో ఐపీఎల్‌ తొలి ఏడాది ఛాంపియన్‌గా నిలిచింది రాజస్థాన్‌. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. అయితే రెండోసారి కప్పు కలను నెరవేర్చుకునే దిశగా రాయల్స్‌ ఈసారి దూసుకుపోతోంది. సూపర్‌స్టార్లు లేకపోయినా దుర్భేద్యంగా కనిపిస్తోన్న ఆ జట్టు ఎనిమిదో విజయంతో ప్లేఆఫ్స్‌లో స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. బంతితో సందీప్‌ శర్మ.. బ్యాటుతో సంజు శాంసన్‌, ధ్రువ్‌ జురెల్‌ మెరిసిన వేళ రాయల్స్‌ శనివారం లఖ్‌నవూను మట్టికరిపించింది.

లఖ్‌నవూ

రాజస్థాన్‌ జోరు కొనసాగిస్తోంది. ఎనిమిదో విజయం సాధించిన ఆ జట్టు.. దాదాపుగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టినట్లే. రాజస్థాన్‌ శనివారం 7 వికెట్ల తేడాతో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ను ఓడించింది. కెప్టెన్‌ రాహుల్‌ (76; 48 బంతుల్లో 8×4, 2×6), దీపక్‌ హుడా (50; 31 బంతుల్లో 7×4) మెరవడంతో మొదట లఖ్‌నవూ 5 వికెట్లకు 196 పరుగులు చేసింది. సందీప్‌ శర్మ (2/31) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. కెప్టెన్‌ సంజు శాంసన్‌ (71 నాటౌట్‌; 33 బంతుల్లో 7×4, 4×6), ధ్రువ్‌ జురెల్‌ (52 నాటౌట్‌; 34 బంతుల్లో 5×4, 2×6) సత్తా చాటడంతో లక్ష్యాన్ని రాజస్థాన్‌ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

మెరిసిన శాంసన్‌, జురెల్‌: రాజస్థాన్‌ ఛేదన ఆసక్తికరంగా సాగింది. జట్టు విజయంలో తలో చేయి వేశారు. బట్లర్‌ (34; 18 బంతుల్లో 4×4, 1×6), జైస్వాల్‌ (24; 18 బంతుల్లో 3×4, 1×6) బ్యాట్‌ ఝళిపించడంతో 5.4 ఓవర్లలో 60/0తో నిలిచింది రాయల్స్‌. కానీ 18 పరుగుల తేడాలో బట్లర్‌, జైస్వాల్‌, పరాగ్‌ (14) వికెట్లు కోల్పోయి ఛేదనలో వెనుకబడింది. ఆ దశలో శాంసన్‌, ధ్రువ్‌ జరెల్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే 11 ఓవర్లలో 104 పరుగులు చేయాల్సిన స్థితిలో లక్ష్యం పెద్ద సవాలే అనిపించింది. కానీ బ్యాటర్లు దూకుడు పెంచడంతో 12వ ఓవర్లో 17 పరుగులొచ్చాయి. జురెల్‌ మూడు ఫోర్లు, సిక్స్‌ బాదడంతో 14వ ఓవర్లో మోసిన్‌ 20 పరుగులు సమర్పించుకున్నాడు. క్రమంగా లఖ్‌నవూ అవకాశాలు సన్నగిల్లుతూ పోయాయి. శాంసన్‌ కూడా చెలరేగడంతో రాజస్థాన్‌ వడివడిగా లక్ష్యం దిశగా సాగింది. బిష్ణోయ్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, సిక్స్‌ బాదిన శాంసన్‌.. మొహ్‌సిన్‌ వేసిన 18వ ఓవర్లో రెండు సిక్స్‌లు దంచేయడంతో లక్ష్యం చాలా తేలికైపోయింది. ఆఖరి రెండు ఓవర్లలో రాజస్థాన్‌ 11 పరుగులు చేయాల్సిన పరిస్థితి. 19వ ఓవర్‌ ఆఖరి రెండు బంతుల్లో శాంసన్‌ 4, 6 బాదేయడంతో లాంఛనం పూర్తయింది. శాంసన్‌, జురెల్‌ జంట అభేద్యమైన నాలుగో వికెట్‌కు 62 బంతుల్లో 121 పరుగులు జోడించింది.

రాణించిన రాహుల్‌: కెప్టెన్‌ రాహుల్‌ రాణించడంతో అంతకుముందు లఖ్‌నవూ రెండొందలకు చేరువగా వెళ్లగలిగింది. 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు మెరుగైన స్కోరు చేయడానికి కారణం రాహులే. దీపక్‌ హుడా కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ రెండు ఓవర్లకే డికాక్‌ (8), స్టాయినిస్‌ (0) వికెట్లు కోల్పోగా.. హుడాతో కలిసి రాహుల్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. బ్యాటర్లిద్దరూ వీలైనప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును నడిపించారు. అవేష్‌ వేసిన ఓ ఓవర్లో రాహుల్‌ రెండు సిక్స్‌లు, ఫోర్‌ బాదేశాడు. హుడా కూడా చక్కని షాట్లు ఆడాడు. 13వ ఓవర్లో హుడాను అశ్విన్‌ ఔట్‌ చేయడంతో 115 (62 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రాహుల్‌కు హార్డ్‌ హిట్టర్‌ పూరన్‌ (11) తోడుగా ఉండగా.. 15 ఓవర్లలో 150/3తో లఖ్‌నవూ బలమైన స్థితిలో నిలిచింది. కానీ భారీ స్కోరు చేసే అవకాశాన్ని వృథా చేసుకుంది. చివరి అయిదు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి కేవలం 46 పరుగులే చేయగలిగింది. పూరన్‌, రాహుల్‌ కొద్ది తేడాలో ఔట్‌ కావడంతో లఖ్‌నవూ వేగానికి కళ్లెం పడ్డట్లయింది. పూరన్‌ను సందీప్‌, రాహుల్‌ను అవేష్‌ వెనక్కి పంపారు. బదోని (18 నాటౌట్‌), కృనాల్‌ (15 నాటౌట్‌) ఆఖర్లో బ్యాట్‌ ఝళిపించలేకపోయారు. సందీప్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలో, ఆఖర్లో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు.

లఖ్‌నవూ ఇన్నింగ్స్‌: డికాక్‌ (బి) బౌల్ట్‌ 8; రాహుల్‌ (సి) బౌల్ట్‌ (బి) అవేష్‌ ఖాన్‌ 76; స్టాయినిస్‌ (బి) సందీప్‌ 0; దీపక్‌ హుడా (సి) పావెల్‌ (బి) అశ్విన్‌ 50; పూరన్‌ (సి) బౌల్ట్‌ (బి) సందీప్‌ 11; బదోని నాటౌట్‌ 18; కృనాల్‌ పాండ్య నాటౌట్‌ 15; ఎక్స్‌ట్రాలు 18 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 196; వికెట్ల పతనం: 1-8, 2-11, 3-126, 4-150, 5-173; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-41-1; సందీప్‌ శర్మ 4-0-31-2; అవేష్‌ ఖాన్‌ 4-0-42-1; అశ్విన్‌ 4-0-39-1; చాహల్‌ 4-0-41-0

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌: యశస్వి జైస్వాల్‌ (సి) బిష్ణోయ్‌ (బి) స్టాయినిస్‌ 24; బట్లర్‌ (బి) యశ్‌ 34; శాంసన్‌ నాటౌట్‌ 71; పరాగ్‌ (సి) బదోని (బి) మిశ్రా 14; జురెల్‌ నాటౌట్‌ 52; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (19 ఓవర్లలో 3 వికెట్లకు) 199; వికెట్ల పతనం: 1-60, 2-60, 3-78; బౌలింగ్‌: మాట్‌ హెన్రీ 3-0-32-0; మోసిన్‌ఖాన్‌ 4-0-52-0; యశ్‌ ఠాకూర్‌ 4-0-50-1; స్టాయినిస్‌ 1-0-3-1; కృనాల్‌ పాండ్య 4-0-24-0; అమిత్‌ మిశ్రా 2-0-20-1; రవి బిష్ణోయ్‌ 1-0-16-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని