జ్యోతి అదరహో..

తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్‌ కాంపౌండ్‌ విభాగంలో హ్యాట్రిక్‌ స్వర్ణాలు సాధించింది.

Updated : 28 Apr 2024 03:48 IST

ఆర్చరీ ప్రపంచకప్‌లో స్వర్ణాల హ్యాట్రిక్‌

తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్‌ కాంపౌండ్‌ విభాగంలో హ్యాట్రిక్‌ స్వర్ణాలు సాధించింది. దీపిక కుమారి తర్వాత ఓ ప్రపంచకప్‌లో మూడు స్వర్ణాలు సాధించిన భారత రెండో ఆర్చర్‌గా ఆమె ఘనత సాధించింది.

షాంఘై

ర్చరీ ప్రపంచకప్‌లో జ్యోతి సురేఖ తిరుగులేని ప్రదర్శన చేసింది. కాంపౌండ్‌ మహిళల వ్యక్తిగత, టీమ్‌, మిక్స్‌డ్‌  విభాగాల్లో ఆమె పసిడి పతకాలు గెలిచింది. ప్రపంచ నంబర్‌ 3 జ్యోతి వ్యక్తిగత ఫైనల్లో టాప్‌ సీడ్‌ ఆండ్రియా బెకెరా (మెక్సికో)ను ఓడించింది. స్కోరు 146-146తో సమం కాగా.. షూటాఫ్‌లో జ్యోతి పైచేయి సాధించింది. ఈ విజయంతో ఆమె అక్టోబరులో మెక్సికోలో జరిగే ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌కు కూడా అర్హత సాధించింది. 27 ఏళ్ల జ్యోతి అభిషేక్‌ వర్మతో కలిసి మిక్స్‌డ్‌ ఈవెంట్‌.. అదితి వర్మ, ప్రణీత్‌ కౌర్‌తో కలిసి మహిళల టీమ్‌ ఈవెంట్లోనూ విజేతగా నిలిచింది. భారత కాంపౌండ్‌ ఆర్చర్లు శనివారం మొత్తం అయిదు పతకాలు గెలిచారు. ఉదయం సెషన్లో టీమ్‌ విభాగాలను భారత జట్టు క్లీన్‌స్వీప్‌ చేసింది.

మహిళల ఫైనల్లో జ్యోతి సురేఖ త్రయం 236-225తో ఇటలీ జట్టుపై విజయం సాధించింది. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో జ్యోతి, అభిషేక్‌ వర్మ జోడీ 158-157తో ఎస్తోనియాకు చెందిన లిసెల్‌ జాత్మా, రాబిన్‌ జాత్మా ద్వయాన్ని ఓడించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. అభిషేక్‌ వర్మ, ప్రియాంశ్‌, ప్రథమేశ్‌లతో కూడిన జట్టు పురుషుల టీమ్‌ విభాగంలో స్వర్ణాన్ని ముద్దాడింది. ఫైనల్లో ఈ జట్టు 238-231తో నెదర్లాండ్స్‌కు చెందిన క్లోసెర్‌, సిల్‌ పేటర్‌, విల్మెన్స్‌ త్రయాన్ని ఓడించింది. పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రియాంశ్‌ రజతం గెలుచుకున్నాడు. రికర్వ్‌ విభాగంలో మెడల్‌ రౌండ్లు ఆదివారం జరుగుతాయి. భారత ఫురుషుల బృందం ఫైనల్లో దక్షిణకొరియా జట్టుతో తలపడుతుంది. మహిళల వ్యక్తిగత  సెమీఫైనల్లో దీపిక.. దక్షిణ కొరియాకు చెందిన ప్రత్యర్థిని ఢీకొంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని