విమానం ఎగరాలంటే మేం ఓకే అనాలి!

ప్రపంచవ్యాప్తంగా విమాన నిర్వహణ విభాగంలో మహిళలు 2.6 శాతం మాత్రమే. ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌ను కెరియర్‌గా తీసుకునే ఆడవాళ్ల సంఖ్య ఇప్పటికీ తక్కువే. మహిళలు అరుదుగా అడుగుపెట్టే ఈ రంగాన్ని ఏరి కోరి మరీ ఎంచుకుంది పూజా ఉమాశంకర్‌. విమానప్రయాణికుల భద్రతే తన లక్ష్యం అంటూ... త్వరలో ఆ బాధ్యతను చేపట్టనున్న ఆమె తన అనుభవాలను ‘వసుంధర’తో పంచుకుంది.

Updated : 28 Apr 2024 07:15 IST

ప్రపంచవ్యాప్తంగా విమాన నిర్వహణ విభాగంలో మహిళలు 2.6 శాతం మాత్రమే. ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌ను కెరియర్‌గా తీసుకునే ఆడవాళ్ల సంఖ్య ఇప్పటికీ తక్కువే. మహిళలు అరుదుగా అడుగుపెట్టే ఈ రంగాన్ని ఏరి కోరి మరీ ఎంచుకుంది పూజా ఉమాశంకర్‌. విమానప్రయాణికుల భద్రతే తన లక్ష్యం అంటూ... త్వరలో ఆ బాధ్యతను చేపట్టనున్న ఆమె తన అనుభవాలను ‘వసుంధర’తో పంచుకుంది.

నేను శ్రీలంకలో పుట్టిన తమిళమ్మాయిని. అమ్మానాన్నతో కలిసి నా పదో ఏట మొదటిసారి విమానమెక్కినప్పుడు ఆ శబ్దానికి చాలా భయపడ్డా. పైనుంచి కిందకు చూస్తే అందంగా కనిపించిన ప్రకృతి దృశ్యాలు నా భయాన్ని దూరం చేశాయి. ఇనుప వస్తువులా అనిపించే విమానం ఆకాశంలో ఎగరడం నాకు ఆ వయసులో వింతగా తోచి ఆశ్చర్యపోయాను. విమానాలకి సంబంధించిన చదువునే ఎంచుకోవాలనే ఆలోచన నా మనసులో అప్పుడు మొలకెత్తింది. నాన్న సింగనాయకం ఉమాశంకర్‌, అమ్మ రసిక. ఇద్దరిదీ ఉపాధ్యాయవృత్తి. నాన్న ఉన్నత విద్యాభ్యాసం కోసం 2011లో లండన్‌ వెళుతూ, అమ్మని, నన్ను కూడా అక్కడికే తీసుకెళ్లారు. నాలుగేళ్ల తరవాత ఇండియాకొచ్చాం. ఇక్కడే ఇంటర్‌ పూర్తి చేశా.

ప్రయోగాత్మకంగా...

విమానానికి సంబంధించిన ఇంజినీరింగ్‌ కోర్సుల కోసం వెతికినప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌ నన్ను ఆకట్టుకుంది. లండన్‌ సౌత్‌వేల్‌ యూనివర్సిటీలో చదివితే మంచి ప్లేస్‌మెంట్స్‌ వస్తాయని తెలిసినవాళ్లు చెప్పారు. దాంతో 2020లో అక్కడ చేరా. సాధారణంగా ఇంజినీరింగ్‌ అంటే తరగతి గదిలోనే మూడొంతుల కోర్సు పూర్తవుతుంది. ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌లో మాత్రం మొదటి నుంచే ప్రయోగాత్మకంగా పాఠాలు చెబుతారు. లెక్కలు, భౌతికశాస్త్రం, ఎలక్ట్రానిక్స్‌ తదితర సబ్జెక్టుల బేసిక్స్‌ నేర్చుకున్నాం. ఆ తరవాత మెయింటెనెన్స్‌, ఏరోడైనమిక్స్‌, రాడార్‌ పనితీరు, విండ్‌టేప్స్‌ పరిస్థితి, ఇంధనం సామర్థ్యం వంటివన్నీ పరిశీలించడం తెలుసుకున్నాం. గ్రౌండ్‌రన్‌, ఫ్లైట్‌ మాక్‌ డ్రైవింగ్‌లో ఇంజిన్‌ గురించి ప్రయోగాత్మకంగా తెలుసుకోవడం థ్రిల్లింగ్‌గా అనిపించాయి. మా శిక్షణ అంతా దాదాపు ప్రాక్టికల్‌గానే ఉంటుంది.

ఛాలెంజ్‌గా...

విమానాశ్రయంలో మా విభాగానికి ప్రాముఖ్యత ఎక్కువ. రన్‌వేపై ఆగిన వెంటనే విమానం కండిషన్‌ పరిశీలించాలి. ప్రతి అంగుళాన్ని చెక్‌ చేయాలి. విమానం గాల్లోకి ఎగిరేముందూ, అలాగే ల్యాండ్‌ అయిన తరవాత ఇంధనం స్థాయి నుంచి టైర్లలో ప్రెషర్‌, లైట్లు, ఎలివేటర్స్‌ సహా యంత్రాలన్నీ సరైన కండిషన్‌లో ఉన్నాయా లేదా పరిశీలించాలి. విమానం ఎగరడానికి ఎలాంటి సమస్యా లేదనే అనుమతి మా విభాగం నుంచే వెళ్లాలి. రన్‌వేపై దిగిన తరవాత సమస్య ఉంటే విమానాన్ని హంగర్‌కు తరలిస్తారు. అక్కడ కావాల్సిన మరమ్మతు చేపట్టి తిరిగి విమానాశ్రయానికి పంపించే బాధ్యత మాది. అలాగే విమానం బయలుదేరి మార్గమధ్యంలో బ్రేక్‌డౌన్‌ వంటి సమస్యలొస్తే ఆ చోటుకి మేం వెళ్లి పరిష్కరించాలి. మెటల్‌ వర్క్‌షాపులో డ్రిల్లింగ్‌, మెషీన్‌ కటింగ్‌, మెటాలిక్‌ వైర్‌ లాకింగ్‌ వంటివి చేయడంలో మొదట కష్టమనిపించింది. అలాగే రోజుకి ఎనిమిది గంటల శిక్షణలో నైట్‌ షిప్ట్‌లో ఇబ్బంది పడేదాన్ని. ముఖ్యంగా మెషీన్‌ కటింగ్‌లో ఎక్కువ ఒత్తిడికి లోనయ్యేదాన్ని. కోర్సు ఛాలెంజ్‌గా ముగిసింది. త్వరలో ఏరోనాటికల్‌ ఇంజినీర్‌గా చేరుతున్నా. భవిష్యత్తులో మాస్టర్స్‌ చేస్తా. ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరడానికి నావంతు బాధ్యత వహిస్తా.

కొరత ఉంది...

ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్‌గా ఉండాలంటే పూర్తిగా ఎండావానల్లో పని చేయాలి. అందుకే ఎయిర్‌హోస్టెస్‌లుగా లేదా విమానాశ్రయ కార్యాలయాల్లో ఉద్యోగాలనూ మహిళలెక్కువగా ఎంచుకుంటున్నారేమో. నా బ్యాచ్‌లో 48మందిలో అయిదుగురం మహిళలం. నాకు జూనియర్‌ బ్యాచ్‌లో ఒక్కరు కూడా ఆడవాళ్లు లేరు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, 2040కల్లా ఏడు లక్షలమంది ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్లు కావాలి. అప్పటికైనా మహిళల సంఖ్య పెరుగుతుందని ఆశిద్దాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్