Chandrababu: ఏ తప్పూ జరగలేదు.. సీఐడీ ప్రశ్నలకు తెదేపా అధినేత చంద్రబాబు సమాధానాలు

సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు తెదేపా అధినేత చంద్రబాబు సూటిగా, స్పష్టంగా సమాధానాలిచ్చారు.

Updated : 24 Sep 2023 10:00 IST

తొలిరోజు దాదాపు 5 గంటల పాటు విచారణ

ఈనాడు-అమరావతి, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే-దానవాయిపేట: సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు తెదేపా అధినేత చంద్రబాబు సూటిగా, స్పష్టంగా సమాధానాలిచ్చారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు, శిక్షణ సహా వాటికి సంబంధించి ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగలేదని, అంతా నిబంధనల ప్రకారమే నడిచిందని తేల్చిచెప్పారు. దర్యాప్తు అధికారులు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా ఏ నిర్ణయం, ఎందుకు తీసుకున్నామనేది ఎలాంటి శషభిషలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా వివరాలు వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి తొట్రుపాటు లేకుండా ధీమాగా సమాధానాలిచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి తప్పిదమూ చోటుచేసుకోలేదని చెప్పారు. వైకాపా ప్రభుత్వం, సీఐడీ అధికారులు.. జరగని కుంభకోణం జరిగినట్లు దుష్ప్రచారం చేస్తుండటం చాలా బాధాకరమని అన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి తీసుకున్న సీఐడీ అధికారులు తొలిరోజైన శనివారం ఆయన్ను దాదాపు అయిదు గంటల పాటు విచారించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం లోపల ఉన్న కాన్ఫరెన్స్‌ హాలులో ఈ విచారణ కొనసాగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీఐడీ అధికారులు అడిగినవాటిలో కొన్ని ప్రశ్నలు,  వాటికి చంద్రబాబు చెప్పిన సమాధానాల వివరాలిలా ఉన్నాయి.

సీఐడీ: ఘంటా సుబ్బారావు, కె.లక్ష్మీనారాయణను నైపుణ్యాభివృద్ధి సంస్థలో కీలక బాధ్యతల్లో ఎందుకు నియమించారు?

చంద్రబాబు: ప్రపంచంలోని అత్యుత్తమ సాఫ్ట్‌వేర్‌ నిపుణుల్లో ఘంటా సుబ్బారావు ఒకరు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కూడా ఆయనకు మూడు కీలక పదవులిచ్చారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఆయన్ను నైపుణ్యాభివృద్ధి సంస్థలో నియమించొచ్చేమో పరిశీలించాలని అధికారులకు సూచించాను. ఆయన నియామకం బిజినెస్‌ రూల్స్‌కు అనుగుణంగానే జరిగింది. ఎగ్జిక్యూటివ్‌, ఆర్థిక అధికారాలు ఇవ్వలేదు. కె.లక్ష్మీనారాయణ గతంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆయన అనుభవాన్ని వినియోగించుకోవటం సముచితంగా ఉంటుందని నైపుణ్యాభివృద్ధి సంస్థలోకి తీసుకున్నాం. ఈ నియామకం కూడా నిబంధనల ప్రకారమే జరిగింది.

నైపుణ్యాభివృద్ధి సంస్థను ఎందుకు ఏర్పాటుచేశారు?

యువత కోసం సాధ్యమైనన్ని ఎక్కువ ఉద్యోగాలు సృష్టించాలనేది మా పార్టీ విధానం. ఉద్యోగాలు రావాలంటే యువతలో నైపుణ్యాలు పెంచాలి. ఆ దిశగా అవసరమైన శిక్షణ ఇచ్చి వారిని తీర్చిదిద్దడానికి వివిధ రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటుచేశా. దీనిద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించాం. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఏదో కుంభకోణం జరిగిపోయిందంటూ మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం.

నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆడిటర్‌గా వెంకటేశ్వర్లును నియమించాలని మీరే ఆదేశించారట కదా?

అలాంటి ఆదేశాలు నేను ఇవ్వలేదు. నైపుణ్యాభివృద్ధి సంస్థ డైరెక్టర్ల బోర్డు ఆయన్ను నియమించుకుంది. ఆ నియామకంతో నాకు సంబంధం లేదు.

కొన్ని నిర్ణయాలు పేరుకే మంత్రివర్గ నిర్ణయాలు తప్ప.. అవన్నీ మీ సొంత నిర్ణయాల్లానే కనిపిస్తున్నాయి?

ముఖ్యమంత్రి కూడా మంత్రివర్గంలో ఒక సభ్యుడు మాత్రమే. నిర్ణయాలన్నీ మంత్రివర్గం సమష్టిగా తీసుకుంటుంది. ఒక్కోసారి మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. కొన్ని అంశాలను తిరస్కరిస్తుంటారు. మరికొన్ని అంశాలపై నిర్ణయాల్ని వాయిదా వేస్తుంటాం. ఎప్పుడూ ముఖ్యమంత్రిదే అంతిమనిర్ణయం కాదు.

మధ్యాహ్నం 12 నుంచి విచారణ మొదలు..

ఉదయం 9.30కు విచారణ ప్రారంభించాల్సిన సీఐడీ అధికారులు 9.45కి జైలు ప్రాంగణానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబును విచారణకు పిలిచారు. 10-15 నిమిషాల పాటు ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు. సీఐడీ కస్టడీపై కోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను చంద్రబాబుకు అందించి.. అది ఆయన చదివిన తర్వాత 12.15 నుంచి విచారణ ప్రారంభించారు. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ విచారణ కనిపించేంత దూరంలో ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు విచారణ ముగిసినా, వాంగ్మూలాల నమోదు తదితర ప్రక్రియల కోసం మరో గంట సమయం తీసుకున్నారు. విచారణ ప్రక్రియ పూర్తయ్యాక రాత్రి 7.08 గంటలకు సీఐడీ దర్యాప్తు అధికారుల బృందం జైలు నుంచి బయటకు వచ్చింది. సీఐడీ అధికారులు బసచేసిన రహదారులు, భవనాల శాఖ అతిథిగృహం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని