కార్పొరేట్‌ వైద్యమా.. అదెక్కడ?

బోధనాసుపత్రుల్లో కార్పొరేట్‌ వైద్యాన్ని అందుబాటులోకి తెస్తాం. వైద్యులు, ఇతర పారా మెడికల్‌ పోస్టులు ఖాళీ అయిన వెంటనే భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం.  బోధనాసుపత్రుల ద్వారా పేదలకూ నాణ్యమైన వైద్యం దీనివల్ల అందుబాటులోకి వస్తుంది.

Updated : 12 Dec 2023 10:27 IST

రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో అందని మెరుగైన వైద్యం
కాకినాడ, తిరుపతిలో గుండె శస్త్రచికిత్సలకూ దిక్కులేదు
ఈనాడు, అమరావతి

బోధనాసుపత్రుల్లో కార్పొరేట్‌ వైద్యాన్ని అందుబాటులోకి తెస్తాం. వైద్యులు, ఇతర పారా మెడికల్‌ పోస్టులు ఖాళీ అయిన వెంటనే భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం.  బోధనాసుపత్రుల ద్వారా పేదలకూ నాణ్యమైన వైద్యం దీనివల్ల అందుబాటులోకి వస్తుంది.

- ముఖ్యమంత్రి జగన్‌ (2020 ఫిబ్రవరి 19న కర్నూలులో మూడో విడత కంటి- వెలుగు ప్రారంభం సందర్భంగా)

రాష్ట్రంలో కార్పొరేట్‌ తరహా వైద్యం అందిస్తామని సీఎం జగన్‌ ప్రకటన చేసి, దాదాపు నాలుగేళ్లు అవుతోంది. ఇంకేం అన్ని ఆసుపత్రుల్లో ఆ తరహా వైద్యం అందుబాటులోకి వచ్చేసి ఉంటుందని అనుకుంటున్నారా? అయితే రండి చూద్దాం.. అసలు విషయం ఏంటో...

ఏలూరు జిల్లాకు చెందిన వీరాబత్తిని కన్నయ్య(62) అనారోగ్యంతో గురువారం ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరగా ఊపిరితిత్తుల్లో గడ్డ ఉందని వైద్యులు చెప్పారు. ఖర్చుకు భయపడి ఆరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రి అత్యవసర విభాగంలో ఉంచి కన్నయ్యకు చికిత్స అందించిన వైద్యులు, హాస్పిటల్‌లో బెడ్‌లు ఖాళీ లేవని రాత్రి 9.30గంటల సమయంలో ఇంటికి వెళ్లి, మరుసటిరోజు రమ్మన్నారు. వెళ్లే పరిస్థితి కాదని ఎంత బతిమాలినా బయటకు పంపేశారు. దీంతో ఆసుపత్రి ఆవరణలోనే
ఆ రాత్రంతా ఉండగా తెల్లవారేసరికి కన్నయ్య చనిపోయాడు.

రాష్ట్రంలో సామాన్యులకు అందుతున్న వైద్యం ఎలాగుందో చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలెన్నో!

బోధనాసుపత్రుల స్థాయికి తగ్గట్లు సూపర్‌ స్పెషలిస్టు వైద్యులు ఉంటారని, రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తారని, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయన్న ఆశతో దూరప్రాంతాల నుంచి అక్కడికి వెళ్లే వారికి నిరాశే మిగులుతోంది. రూ.8 వేల కోట్లతో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, మరో రూ.8 వేల కోట్లతో బోధనాసుపత్రులను ఆధునికీకరిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ పదేపదే చెప్పారు. అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులూ... రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో చికిత్స పొందేందుకు ఆసక్తి చూపడంలేదు. అందుకు ప్రధాన కారణం... వైద్య సేవలు సంతృప్తికరంగా లేకపోవడమే. అక్కడ ఒక పరీక్షకు పరికరాలుంటే మరో పరీక్షకు ఉండవు. రోగ నిర్ధారణ పరీక్షలు సక్రమంగా జరగవు. 

3-4 రకాల అనారోగ్య సమస్యలుంటే ఇక అంతే సంగతులు. ఆయా విభాగాల వైద్యుల మధ్య సమన్వయం ఉండట్లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికీ ఆసుపత్రుల్లో స్ట్రెచర్లు, వీల్‌ఛైర్లు ఉండటం లేదు. నాలుగో తరగతి సిబ్బంది అదనంగా అవసరం ఉన్నారు. నర్సుల సంఖ్య జాతీయ ప్రమాణాల ప్రకారం లేదు. పారిశుద్ధ్య నిర్వహణ పరిస్థితి సరేసరి! వీటన్నింటివల్లా... ప్రజాప్రతినిధులు చిన్న చికిత్సల కోసమైనా ప్రభుత్వాసుపత్రులకు రావడంలేదు. ఒకవేళ స్థానికంగా చికిత్స తీసుకున్నా ‘ప్రైవేట్‌ కార్పొరేట్‌’ వైద్యంవైపే మొగ్గుచూపుతున్నారు. మంత్రి వేణుగోపాల్‌ విజయవాడ జీజీహెచ్‌లో చికిత్స పొందిన తర్వాత కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఈ జనవరిలో గుండె సంబంధిత సమస్యతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందారు.

మంత్రి బొత్స సత్యనారాయణ హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ హాస్పిటల్‌లో బైపాస్‌ సర్జరీ చేయించుకున్నారు.  
గుండె సమస్యతోనే మంత్రి పినిపే విశ్వరూప్‌ ముంబయిలో ఉన్నతస్థాయి చికిత్స పొందారు.
కాలు బెణకడంతో పర్యాటక శాఖ మంత్రి రోజా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు.

వీళ్లే కాదు, ఎమ్మెల్యేలూ చిన్నాపెద్దా చికిత్సల కోసం కేరళ, బెంగళూరు, హైదరాబాద్‌... ఇలా ఇతర రాష్ట్రాలకు వెళ్లారు తప్ప రాష్ట్రంలో చికిత్స చేయించుకునే సాహసం చేయలేదు. అమ్మ పుట్టిల్లు మేనమామకు ఎరుక... అన్నట్టుగా, రాష్ట్రంలోని ఆసుపత్రుల లోపాలు వైకాపా మంత్రులూ, ఎమ్మెల్యేలకు కాకపోతే ఇంకెవరికి బాగా తెలుస్తాయి. కాబట్టే, వీరంతా రాష్ట్రంలోని బోధనాసుపత్రులకు కాకుండా పొరుగు రాష్ట్రాలకు వెళుతున్నారు. ప్రభుత్వ డబ్బుతోనే అక్కడ చికిత్స పొందుతున్నారు.


ఎవరి వైద్యం వారిదే

దిగువ స్థాయి ప్రభుత్వాసుపత్రుల నుంచి వచ్చే రిఫరల్స్‌కు తగ్గట్లు బోధనాసుపత్రుల పనితీరు మెరుగుపడటం లేదు. ఓపీలో, ఐపీలో రోగులకు అందుతున్న వైద్యం తీరుపై ఆడిటింగ్‌ జరగదు. లోపాలనూ గుర్తించరు. కేస్‌షీట్ల నుంచి కాగితాలు చిరిగిపోయినా పట్టించుకునే వారు లేరు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే వైద్యులు ఉంటున్నారు. సాయంత్రం రివ్యూ పేషంట్ల కోసం ఇటీవల ఏర్పాటు చేసిన ఓపీ కౌంటర్లు సక్రమంగా పనిచేయడం లేదు. వైద్యుల్లో కొందరు ముఖ ఆధారిత హాజరు కోసమే ఆసుపత్రులకు వచ్చి వెళ్తున్నారు.


అడుగడుగునా సమస్యలే...

తిరుపతి రుయాలో... ఒకప్పుడు గొప్పగా పేరొందిన గుండె వైద్య విభాగం ఐదేళ్ల నుంచి పడకేసింది. అందుబాటులో ఉన్న ఒక్క నిపుణుడు కూడా మెడిసిన్‌ విభాగం కిందనే పనిచేస్తున్నారు. క్యాథ్‌ల్యాబ్‌ అందుబాటులో లేనందున గుండెకు స్టెంట్లు, ఇతర వైద్య సేవలు అందడం లేదు.

  • కాకినాడ జీజీహెచ్‌లో... ముగ్గురు కార్డియో థొరాసిక్‌ సర్జన్లు ఉన్నారు. మరో ప్రొఫెసర్‌ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ బైపాస్‌ సర్జరీ, వాల్వ్‌ రిప్లేస్‌మెంట్‌ చేయడానికి అవసరమైన యంత్రాలు పురాతన కాలం నాటివి కావడంతో అవి పనిచేయడంలేదు.
  • కర్నూలు జీజీహెచ్‌లో... న్యూరో సర్జరీ వార్డులో ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఒక్కోటి ఖాళీగా ఉన్నాయి. ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో వైద్యులు అవసరాలకు తగ్గట్లు ఉన్నా... వార్డు లేదు. కొత్త వార్డు నిర్మాణం రెండేళ్ల నుంచి నడుస్తోంది.
  • విజయవాడ జీజీహెచ్‌లో... గుండె శస్త్రచికిత్సల కోసం అవసరమైన వైద్య నిపుణులు ఉన్నప్పటికీ... పరికరాలు, మందులు, ఇతర సామగ్రి కొరత వేధిస్తోంది. కనీసం 20-30మందికి అవసరమయ్యే శస్త్రచికిత్సల సామగ్రి ముందుగానే ఆసుపత్రిలో సిద్ధంగా ఉంచాలి. కానీ అలా జరగడంలేదు. సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ ఆధునికంగా నిర్మించినా నిర్వహణ సక్రమంగాలేదు. 
  • అనంతపురం జీజీహెచ్‌... అనుబంధ సూపర్‌ స్పెషాల్టీ వైద్యశాలలో కార్డియాలజీ విభాగంలో ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మాత్రమే ఉన్నారు.

ఖాళీలే... ఖాళీలు...

రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రుల్లో కలిపి ప్రొఫెసర్లు, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులు 392 మంజూరు చేయగా 233 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 159 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కొత్తగా ఏర్పడ్డ ఏలూరు, విజయనగరం, రాజమహేంద్రవరం, నంద్యాల, మచిలీపట్నం బోధనాసుపత్రుల నుంచి కూడా రిఫరల్‌ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. వీటిల్లో అత్యవసరంగా 25 మంది వైద్యుల అవసరం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని