పెట్రోల్‌ తీసుకురండిరా... తగలెట్టేద్దాం

‘‘రేయ్‌.. నిన్ను ఇక్కడే పెట్రోల్‌ పోసి తగలబెడితే దిక్కెవరు? మా ఇష్టమొచ్చినట్లు ఇసుక తవ్వేసుకుంటాం. జిల్లా కలెక్టరే ఇక్కడికొచ్చి చూసి ఏమీ చేయకుండా వెళ్లిపోయారు. ఇక్కడ అడుగు పెట్టాలంటే పోలీసులే వణికిపోతారు.

Updated : 15 Feb 2024 09:42 IST

అమరావతి ‘న్యూస్‌టుడే’ కంట్రిబ్యూటర్‌ పరమేశ్వరరావుపై ఇసుక మాఫియా కిరాతకం
మల్లాది రీచ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలను బయటపెట్టేందుకు వెళ్లగా.. రాళ్లదాడి
ఛాతీ, ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూ ఊపిరాడనీయకుండా చేసిన వైనం
ద్విచక్రవాహనంపై నుంచి తోసేసి... బూతులు తిడుతూ నిర్బంధం
కలెక్టరే వెళ్లిపోయారు... పోలీసులు ఇక్కడ అడుగు పెట్టాలంటే వణికిపోతారు
నువ్వు ఫొటోలు తీస్తావా? చంపేస్తే నీకు దిక్కెవరు?
దాడి సమయంలో పేట్రేగిపోయిన వైకాపా నేతలు

ఈనాడు, అమరావతి: ‘‘రేయ్‌.. నిన్ను ఇక్కడే పెట్రోల్‌ పోసి తగలబెడితే దిక్కెవరు? మా ఇష్టమొచ్చినట్లు ఇసుక తవ్వేసుకుంటాం. జిల్లా కలెక్టరే ఇక్కడికొచ్చి చూసి ఏమీ చేయకుండా వెళ్లిపోయారు. ఇక్కడ అడుగు పెట్టాలంటే పోలీసులే వణికిపోతారు. అలాంటిది ఇక్కడికొచ్చి ఫొటోలు తీస్తావా? ఎంత ధైర్యం రా? నీకు’’ అంటూ పల్నాడు జిల్లా అమరావతి మండల ‘న్యూస్‌టుడే’ కంట్రిబ్యూటర్‌ తేలప్రోలు పరమేశ్వరరావుపై వైకాపాకు చెందిన అరాచక మూకలు దారుణ దాడికి తెగబడి హత్యాయత్నం చేశాయి. అమరావతి మండలం మల్లాది ఇసుక రీచ్‌లో పర్యావరణ అనుమతులు లేకుండా అడ్డగోలుగా, అక్రమంగా ఇసుక తవ్వేస్తున్న తీరును ‘ఈనాడు’ పత్రిక ద్వారా వెలుగులోకి తెచ్చేందుకు అక్కడకెళ్లిన పరమేశ్వరరావుపై వైకాపా నేతలైన వెంపా శ్రీను, ఆయన అనుచరులు తులసి తిరుపతిరావు, భవిరిశెట్టి సునీల్‌, భవిరిశెట్టి నాగేశ్వరరావు, మరో నలుగురు మూకుమ్మడిగా దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పరమేశ్వరరావు కష్టం మీద తప్పించుకుని బయటపడ్డారు. ఆయన అలా బయటకు రాకపోయుంటే అధికారపార్టీ నాయకులంతా కలిసి అక్కడే చంపేసేవారు. ఒకప్పుడు బిహార్‌లో గూండారాజ్‌, చంబల్‌లోయలోని బందిపోట్ల అరాచక రాజ్యంలో జరిగిన ఇలాంటి   దారుణాలు ఇప్పుడు జగన్‌ జమానాలో నిత్యకృత్యమయ్యాయి.

ఛాతీ, ముఖంపై పిడిగుద్దులు...ఊపిరాడనీయకుండా దాడి

మల్లాది ఇసుక రీచ్‌లో అధికారపార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమ తవ్వకాల ఫొటోలు తీయడానికి పరమేశ్వరరావు బుధవారం ఉదయం వెళ్లారు. తిరిగి వస్తుండగా.. అక్కడున్న వైకాపా నాయకులు బూతులు తిడుతూ బండిపై నుంచి కిందకు తోసేశారు. కిందపడ్డ ఆయన పైకి లేచేందుకు యత్నిస్తుండగా ఆయన ఛాతీ, ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. కొంతసేపు ఊపిరాడనీయకుండా చేశారు. ఎలాగోలా వారి చెర నుంచి తప్పించుకున్న పరమేశ్వరరావు ఫోన్‌లో పోలీసులకు చెబుతుండగా.. వైకాపా నాయకులు పరుగున వచ్చి, సెల్‌ఫోన్‌ లాక్కుని మళ్లీ దాడిచేశారు. ఆయన ద్విచక్రవాహనం తాళాల్ని తీసేసుకున్నారు. మొత్తంగా 8 మంది కలిసి ఈ దాడికి తెగబడ్డారు.

ఆపే ధైర్యం ఉందా?

పరమేశ్వరరావును నిర్బంధించిన వైకాపా నాయకులు ఆయన్ను చంపేసేందుకు ప్రయత్నించారు. ‘‘పెట్రోల్‌ సీసాలు తీసుకురండిరా.. పరమేశ్వరరావును తగలబెట్టేద్దాం’’ అంటూ వైకాపా నాయకుడు వెంప శ్రీను తన అనుచరులను ఆదేశించారు. ‘‘ఇక్కడ నిన్ను చంపేస్తే కాపాడేదెవరు? ‘ఈనాడు’ వచ్చి నిన్ను రక్షిస్తుందా? చూద్దాం రమ్మను. నిన్ను చంపితే మమ్మల్ని ఆపే ధైర్యం ఎవరికైనా ఉందా?’’ అంటూ పరమేశ్వరరావుపై విరుచుకుపడ్డారు.

అధికారంలో ఉన్నాం.. మమ్మల్ని మీరేం చేయగలరు?

‘‘మా పార్టీ అధికారంలో ఉంది. మా వెనక ఎమ్మెల్యే శంకర్రావు ఉన్నారు. మమ్మల్ని మీరేం చేయగలరు’’ అంటూ పరమేశ్వరరావును వైకాపా నాయకులు బెదిరించారు. పరమేశ్వరరావు తీవ్రంగా పెనుగులాడి తప్పించుకుని వెళ్లిపోతుండగా.. గట్టిగా కేకలేస్తూ, అరుస్తూ వెంటాడారు. అతనిపైకి రాళ్లు విసిరారు. పరమేశ్వరరావు ఎలాగోలా ద్విచక్రవాహనంపై అమరావతి చేరుకుని ఆసుపత్రిలో చేరారు. తర్వాత పోలీసులు ఆసుపత్రికి వెళ్లి ఆయన నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. మల్లాది రీచ్‌లో పరమేశ్వరరావును వైకాపా నాయకులు నిర్బంధించిన ఘటనపై తొలుత పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సత్తెనపల్లి డీఎస్పీ, అమరావతి సీఐలతో మాట్లాడి వెంటనే అక్కడికెళ్లాలని ఆదేశించారు. పోలీసులు ఇసుక రీచ్‌ వద్దకు చేరుకునేసరికే పరమేశ్వరరావు బయటకొచ్చేశారు. రీచ్‌ వద్ద వివరాలు తీసుకున్న పోలీసులు... వైకాపా నేతలు లాగేసుకున్న పరమేశ్వరరావు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ప్రమాదకర ఆయుధాలతో దాడి ఘటన కింద కేసు నమోదుచేశారు. హత్యాయత్నం సెక్షన్లు పెట్టలేదు. మరోవైపు పెదకూరపాడు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి కొమ్మాలపాటి శ్రీధర్‌ అమరావతి ఆసుపత్రిలో పరమేశ్వరరావును పరామర్శించారు. వైకాపా నేతల దాడిని ఖండించారు.


ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదు

‘‘అమరావతి మండలం మల్లాది ఇసుక రీచ్‌లో మంగళవారం పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ తనిఖీకి వచ్చినప్పుడు తవ్వకాలు నిలిపేశారు. బుధవారం ఉదయం నుంచి తిరిగి తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అక్కడికి వెళ్లాను. మల్లాది ఇసుక రీచ్‌లో పొక్లెయిన్లతో లారీల్లో ఇసుక నింపుతున్నారు. తవ్వకాలు, తరలింపు జరుగుతున్న తీరును ఫొటోలు, వీడియోలు తీశాను. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వస్తుండగా లారీలకు బిల్లులు రాసే షెడ్డు వద్ద కాపు కాసిన వైకాపా నేత వెంపా శ్రీను, ఆయన అనుచరులు అడ్డుకున్నారు. శ్రీనుతో పాటు తులసి తిరుపతిరావు, భవిరిశెట్టి సునీల్‌, భవిరిశెట్టి నాగేశ్వరరావు, మరో నలుగురు నా వాహనాన్ని ఆపి వాదనకు దిగారు. ఆ ఎనిమిది మంది నన్ను ఒక్కసారిగా చుట్టుముట్టారు. మారుమాట్లాడకుండా పిడిగుద్దులు గుప్పించారు. బూతులు తిడుతూ ముఖం, వీపు, డొక్కలపై ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. అక్కడి పరిస్థితి చూసి ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదు. ఒక్కసారిగా భార్యాపిల్లలు గుర్తొచ్చారు. ఆ దేవుడే నన్ను కాపాడాడు అనుకుంటున్నా.’’

తేలప్రోలు పరమేశ్వరరావు, న్యూస్‌టుడే కంట్రిబ్యూటర్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని