సౌర విద్యుత్‌ సంస్థలకు భూములు

రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలకు గతంలో మంజూరు చేసిన సౌర విద్యుత్‌ ప్రాజెక్టులకు భూములు కేటాయిస్తూ ఈ నెల 15న ఉత్తర్వులివ్వగా వాటికి సంబంధించిన గెజిట్‌ను మంగళవారం ప్రచురించారు.

Updated : 27 Mar 2024 05:14 IST

గెజిట్‌లో చేర్చిన ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలకు గతంలో మంజూరు చేసిన సౌర విద్యుత్‌ ప్రాజెక్టులకు భూములు కేటాయిస్తూ ఈ నెల 15న ఉత్తర్వులివ్వగా వాటికి సంబంధించిన గెజిట్‌ను మంగళవారం ప్రచురించారు. గ్రీన్‌కో, ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ గతంలో ప్రభుత్వం అనుమతించింది. ఆయా సంస్థలు ప్రాజెక్టుల ఏర్పాటుకు వీలుగా మొత్తం 18,104.47 ఎకరాల్లో లీజు విధానంలో 15,715.01 ఎకరాలు, అవుట్‌రైట్‌ సేల్స్‌ కింద 2,389.46 ఎకరాలను కేటాయించింది.

నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భూకేటాయింపు

  • నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని వివిధ సర్వేనంబర్లలో 10,225.94 ఎకరాలను ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు లీజు విధానంలో కేటాయిస్తూ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. ఏపీ పునరుత్పాదక విద్యుత్‌ ఎగుమతి విధానం-2020 నిబంధనల మేరకు లీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది ఎకరాకు ఏటా రూ.31 వేల చొప్పున చెల్లించాలని పేర్కొంది. దీని కోసం ఏపీ గ్రీన్‌ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు అడ్వాన్స్‌ పొజిషన్‌ ఇస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది.
  • అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని ఊరచింతల గ్రామ పరిధిలో 2,692.49 ఎకరాలను ఏపీ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) ద్వారా ఇండోసోల్‌కు లీజు విధానంలో కేటాయించేలా మరో ఉత్తర్వునిచ్చింది. ఈ సంస్థకు 3,500 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టును ప్రభుత్వం గతంలో కేటాయించింది.
  • నంద్యాల జిల్లా అవుకు మండలం జుంతులా గ్రామ పరిధిలోని వివిధ సర్వేనంబర్లలో 4,800 ఎకరాలను గ్రీన్‌కో సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అందులో 2002.42 ఎకరాలను ఎకరా రూ.5 లక్షల చొప్పున విక్రయించడానికి అనుమతించింది. మిగిలిన 2,797.58 ఎకరాలను ఇంధన శాఖ ప్రస్తుత నిబంధనల మేరకు సంస్థకు కేటాయిస్తున్నట్లు పేర్కొంది.
  • కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామ పరిధిలోని వివిధ సర్వేనంబర్లలో 386.04 ఎకరాలను గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఎకరా రూ.5 లక్షల చొప్పున అవుట్‌రైట్‌ సేల్స్‌ విధానంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని