మొక్కు‘బడి’లో ‘గ్లోబల్‌’ మోసం

పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్‌ సర్కార్‌ మాత్రం అంతా రివర్స్‌.

Updated : 30 Apr 2024 06:39 IST

వందల పాఠశాలల్లో కనీస సంఖ్యలోనూ ఉపాధ్యాయులు లేరు
ఆంగ్లం చెప్పే టీచర్లు లేకుండానే టోఫెల్‌ శిక్షణ అంటూ ప్రచారం
చాలాచోట్ల గణితం, సామాన్య శాస్త్రాలకూ టీచర్లు లేరు
కొన్ని ప్రాథమికోన్నత స్కూళ్లలో ఎస్జీటీలతో బోధన
పేద పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేసిన జగన్‌
ఈనాడు, అమరావతి

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా..? సబ్జెక్టు టీచర్లు లేని మన పాఠశాలల నుంచి విశ్వ విద్యార్థులు సరే... కనీస ప్రమాణాలున్న పిల్లలైనా తయారవుతారా? పేద పిల్లలకు కార్పొరేట్‌ స్థాయి విద్య అంటూ ఊదరగొట్టిన జగన్‌ ప్రభుత్వం సర్కారు స్కూళ్లను గాలికొదిలేసింది. వేల సంఖ్యలో ఉపాధ్యాయుల కొరత... కనీసం సబ్జెక్టులు చెప్పేవారూ లేరు... అయిదేళ్లలో విద్యా వ్యవస్థపై అలుముకున్న నీలి నీడలతో పేదపిల్లల చదువులు కొండెక్కాయి...

పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్‌ సర్కార్‌ మాత్రం అంతా రివర్స్‌. పాఠాలు చెప్పేందుకు సబ్జెక్టు ఉపాధ్యాయులు లేకపోయినా విద్యలో దేశానికే ఆంధ్రప్రదేశ్‌  ఆదర్శమంటూ గొప్పలు చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారిలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పేద పిల్లలే ఎక్కువ మంది ఉంటారు. వీరికి నాణ్యమైన విద్యను అందించకుండా ఎన్నికల ప్రచారం కోసం ట్యాబ్‌లు, టోఫెల్‌ అంటూ ప్రచారం చేసుకుందీ ప్రభుత్వం. రూ.70 కోట్లు ఖర్చు చేశాం.. డిజిటల్‌ విద్యను తీసుకొచ్చామంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్‌ అయిదేళ్లలో కనీస సంఖ్యలో టీచర్లను నియమించలేకపోయారు. ఉపాధ్యాయుడికి ఏదీ ప్రత్యామ్నాయం కాదనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి ట్యాబ్‌లు ఇచ్చి.. ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ (ఐఎఫ్‌పీ) పెడితే చదువు వస్తుందంటూ ప్రచారం చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్‌ శిక్షణ పెట్టిన ప్రభుత్వం చాలాచోట్ల ఆంగ్ల భాష బోధించే టీచర్ల పోస్టులను గాలికి వదిలేసింది. అసలు ఉపాధ్యాయులు లేకుండా నైపుణ్యం ఎలా వస్తుందనే విషయాన్ని విస్మరించింది. ఖర్చు తగ్గించేందుకు 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, హైస్కూళ్లలో విలీనం చేసి, సబ్జెక్టు టీచర్లతో బోధనంటూ మోసంచేసింది. కొత్త నియామకాలు చేపట్టకుండా ఉన్నవారికే పదోన్నతులు కల్పించి, సర్దేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

6వేల మందికి పైగా ఉపాధ్యాయుల కొరత

రాష్ట్రవ్యాప్తంగా పురపాలక పాఠశాలల్లో మరో 1,785 సబ్జెక్టు టీచర్లు అవసరం ఉండగా.. జిల్లా పరిషత్తు, ఎంపీపీ పాఠశాలల్లో 5,743 స్కూల్‌ అసిస్టెంట్ల కొరత ఉంది. జగన్‌ ప్రభుత్వం డీఎస్సీ వేసి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా పేద పిల్లలను నాణ్యమైన చదువుకు దూరంచేసింది. చాలాచోట్ల ప్రాథమికోన్నత పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎస్జీటీలతోనే సబ్జెక్టుల బోధన చేయించారు. ఓ వైపు సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉండగా.. మరోవైపు డబ్బుల కోసం ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి పైరవీల బదిలీలు, డిప్యుటేషన్లకు తెరతీయడంతో మారుమూల ప్రాంతాల్లో పాఠాలు చెప్పేవారు లేకుండా పోయారు.

సామర్థ్యాలకు కొరివి...

  • ప్రాథమికోన్నత పాఠశాలల్లో 30 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటేనే గణితం, సామాన్యశాస్త్రం, ఆంగ్లం సబ్జెక్టులకు ఉపాధ్యాయులను ఇచ్చారు. అంతకన్నా తక్కువ ఉంటే ఒకే ఒక్క స్కూల్‌ అసిస్టెంట్‌ను నియమించారు. దీన్నీ కొన్నిచోట్ల అమలు చేయలేదు. 1-5 తరగతులకు చెప్పే సెకండరీ గ్రేడ్‌ టీచర్ల్ల (ఎస్జీటీలు)తోనే పాఠాలు చెప్పించారు. పిల్లలు తక్కువగా ఉన్న బడిలో చదవడం విద్యార్థుల తప్పే అన్నట్లు ప్రభుత్వం వ్యవహరించింది. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందకుండా చేసింది.
  • సామాన్యశాస్త్రం, గణితం, ఇతర సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నచోట ఉపాధ్యాయులు 9, 10 తరగతులకే ప్రాధాన్యం ఇచ్చారు.  6, 7, 8 తరగతులకు బోధనను తూతూమంత్రంగా పూర్తిచేశారు. కింది తరగతుల్లో గణితం, సామాన్యశాస్త్రం సబ్జెక్టుల్లో కనీస నైపుణ్యం లేకపోవడంతో పైతరగతులకు వెళ్లిన తర్వాత విద్యార్థులు ఫెయిల్‌ కావడంతో పాటు ఆయా సబ్జెక్టులపై ఆసక్తి లేక, బడి మానేసే పరిస్థితి ఏర్పడింది.
  • కొన్నిచోట్ల ఎస్జీటీలతో ఆంగ్లం, హిందీ, సాంఘికశాస్త్రం, తెలుగులాంటి సబ్జెక్టులు చెప్పించారు. ఈ సబ్జెక్టుల్లోని సిలబస్‌ పూర్తి చేసి, మమ అనిపిస్తున్నారు. విద్యార్థులకు అర్థమైందా? లేదా? వారు ఎంతవరకు నేర్చుకున్నారు? అనే విషయాలను పట్టించుకోలేదు.

పేద పిల్లలపై ఇదేం కక్ష..!

  • ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల హైస్కూల్‌లో 6-10 తరగతుల్లో 1,067 మంది విద్యార్థులున్నారు. వీరికి పాఠాలు చెప్పేందుకు 41 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు అవసరం కాగా 15 మంది మాత్రమే పనిచేశారు. ప్రధానోపాధ్యాయుడితో పాటు పలు సబ్జెక్టు టీచర్ల పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆంగ్లం సబ్జెక్టును ఎస్జీటీ ఉపాధ్యాయుడితో చెప్పించారు. హిందీ సబ్జెక్టును చిన్నదోర్నాల ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు రోజు మార్చి రోజు వచ్చి చెప్పేవారు. గణితానికి ఆరుగురు టీచర్లు కావాల్సి ఉండగా నలుగురితో నెట్టుకొచ్చారు.
  • అనంతపురం జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణదేవరాయ నగరపాలకోన్నత పాఠశాలలో 612 మంది విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు 24 మంది అవసరంకాగా...చాలాకాలం 8 మంది రెగ్యులర్‌ టీచర్లతో నెట్టుకొచ్చారు.  గత ఆగస్టులో మరో 9 మందిని డిప్యుటేషన్‌పై వేశారు.
  • కర్నూలు జిల్లా హొళగుంద జడ్పీ హైస్కూల్‌లో తెలుగు, కన్నడ, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాల్లో 1,834 మంది విద్యార్థులున్నారు. వీరికి బోధన చేసేందుకు 59మంది ఉపాధ్యాయులు అవసరం కాగా.. 38 మందితోనే సరిపెట్టారు.
  • అన్నమయ్య జిల్లా మదనపల్లె మాయాబజార్‌లోని వివేకానంద పురపాలక ఉన్నత పాఠశాలలో 655 మంది విద్యార్థులు ఉండగా.. 11 మంది శాశ్వత, ఇద్దరు పొరుగుసేవల ఉపాధ్యాయులు ఉన్నారు.  నిబంధనల ప్రకారం 26మంది అవసరం కాగా.. సగం మందిని కూడా నియమించలేదు.
  • నంద్యాల జిల్లా సున్నిపెంట హైస్కూల్‌లో జీవశాస్త్రం సబ్జెక్టుకు ముగ్గురికి ఒక్కరు, గణితానికి నలుగురికి ఇద్దరు మాత్రమే ఉన్నారు. సాంఘిక శాస్త్రానికి ఒక్కరూ లేరు. దీంతో కింది తరగతులను పూర్తిగా వదిలేశారు. మిగిలిన అందరినీ ఒకేచోట కూర్చోబెట్టి పాఠాలు చెప్పారు.
  • అనంతపురం జిల్లా  కళ్యాణదుర్గంలోని బాలికోన్నత పాఠశాలలో ఆంగ్లం బోధించే ఉపాధ్యాయ పోస్టు ఖాళీగా ఉంచేశారు. ఇతర సబ్జెక్టుల టీచర్లతో ఇంగ్లిషు పాఠాలు చెప్పించారు.

ఏకో... నారాయణా!

రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తామని, ప్రతి బడికీ ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తామని గొప్పలు చెప్పిన జగన్‌ ఆ హామీని గాలికి వదిలేశారు. జగన్‌ పాలనలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య భారీగా పెరిగింది. ఈ విషయంలో రాష్ట్రం జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. 2020  అక్టోబరు నాటికి ఏకోపాధ్యాయ పాఠశాలలు 7,774 ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 9,602కు పెరిగింది. హేతుబద్ధీకరణ ఉత్తర్వుల ప్రకారం 20 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను నియమించాల్సి ఉన్నా ఎస్జీటీల కొరత పేరుతో కొన్నిచోట్ల 30-40 మందికి ఒక్కరినే నియమించారు. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న చోట ఒకే గదిలో అందరినీ కూర్చోబెట్టడం వల్ల ఎవరికి ఏ పాఠం చెబుతున్నారో తెలియని గందరగోళం ఏర్పడుతోంది. ఎప్పుడైనా సెలవు పెడితే ఆ రోజుకు చదువు అటకెక్కినట్టే.


తెలుగు టీచర్‌తో టోఫెల్‌ పాఠాలు...

ఆంగ్లభాష నైపుణ్యాలు నేర్పించేందుకు టోఫెల్‌ అమలు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం దానికి తగినట్లు ఉపాధ్యాయులను నియమించలేదు. ఆంగ్ల భాష టీచర్ల కొరత కారణంగా ఎస్జీటీలతో పాఠాలు చెప్పించారు. కొన్నిచోట్ల తెలుగు సబ్జెక్టు టీచర్‌తోనూ టోఫెల్‌ పాఠాలు చెప్పించారు. మరికొన్నిచోట్ల ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులు బోధించారు. ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్నామని బాకా ఊదుకున్న ప్రభుత్వం ఆంగ్లం సబ్జెక్టు బోధించేందుకు ఉపాధ్యాయులు లేకుండా చేసింది. ఆంగ్ల ఉపాధ్యాయులను నియమించకుండా టోఫెలే సర్వం అన్నట్లు ప్రచారం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని