అనూహ్య వర్షాలతో అతలాకుతలం

వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన అనూహ్య మార్పులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి.

Published : 08 May 2024 06:27 IST

అత్యధికంగా వేమగిరిలో 12.4 సెం.మీ. వర్షపాతం
పిడుగుపాటుతో ఆరుగురి కన్నుమూత
రాజమహేంద్రవరంలో వర్షం బీభత్సం

ఈనాడు డిజిటల్‌, న్యూస్‌టుడే బృందం: వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన అనూహ్య మార్పులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రధానంగా రాజమహేంద్రవరంతో పాటు విజయవాడలో భారీ వర్షాలతో జనజీవనం కాసేపు స్తంభించింది. మంగళవారం మధ్యాహ్నం గంటన్నరపాటు కురిసిన భారీ వర్షానికి ఈ నగరాలు అతలాకుతలమయ్యాయి. రాజమహేంద్రవరంలో 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వర్షపు నీటికి తోడు మురుగు ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మురుగు, చెత్త వర్షం నీటితో కలిసి రోడ్డెక్కింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని తూర్పుగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, పల్నాడు, కాకినాడ, తిరుపతి తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి.

పిడుగుపాటుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. నిన్నటివరకు నిప్పుల కొలిమిని తలపించిన వాతావరణం కాస్త చల్లబడటంతో ప్రజలు ఊరట చెందారు. మంగళవారం ఉదయం 8.30 గంటలనుంచి రాత్రి ఏడింటి వరకు తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో అత్యధికంగా 12.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేటలో 12 సెం.మీ., నూజివీడు, మచిలీపట్నంలలో 7.3 సెం.మీ. వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో 2 సెం.మీ.నుంచి 6.4 సెం.మీ.వరకు వర్షపాతం నమోదైంది. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో పలు చోట్ల భారీ వృక్షాలు రహదారులకు అడ్డంగా నేలకొరగడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. విద్యుత్తు స్తంభాలు కొన్ని చోట్ల విరిగిపోయాయి. ధాన్యపు రాశుల చుట్టూ నీరు చేరి రైతులకు నష్టం వాటిల్లింది.

 కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం ముందుకొచ్చి అలజడి సృష్టించింది.

పిడుగుపాటుతో మృత్యువాత

పిడుగుపాటుకు పల్నాడు జిల్లాలో వేర్వేరు చోట్ల నలుగురు, ఏలూరు జిల్లాలో ఇద్దరు చనిపోయారు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షంలో భారీ వర్షానికి కొబ్బరి చెట్టు మీద పడి రైతు నిమ్మల శ్రీను (45) దుర్మరణం చెందారు.

నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం

బుధ, గురువారాల్లోనూ రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వివరించింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటినుంచి మోస్తరు వర్షాలకు అవకాశముందని పేర్కొంది. మరోవైపు మంగళవారం కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.4, ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 43.2, వైఎస్సార్‌ జిల్లా మద్దూరు, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 42.9 డిగ్రీల చొప్పున, నెల్లూరు జిల్లా మనుబోలు, నంద్యాల జిల్లా మహానందిలో 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు