పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదు

ప్రభుత్వ పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదని.. 5 నుంచి 10 రోజుల తరువాత అమలు చేయాలని సూచించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా స్పష్టం చేశారు.

Published : 08 May 2024 06:24 IST

5-10 రోజులు వేచి ఉండాలని సూచించింది
సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనా

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదని.. 5 నుంచి 10 రోజుల తరువాత అమలు చేయాలని సూచించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రం నుంచి ఎప్పటికప్పుడు వివరాలు పంపుతున్నామని.. కొన్నింటి విషయంలో తరువాత అమలు చేయాలని సూచిస్తోందని తెలిపారు. ఇందులో ఇబ్బంది ఏముందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాల అమలును ఎన్నికల సంఘం అడ్డుకుంటోందని సీఎం జగన్‌ ఆరోపించారని విలేకరులు అడగగా...ఆయన పైవిధంగా స్పందించారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సీఈఓ మాట్లాడారు.

3.03 లక్షల పోస్టల్‌ బ్యాలెట్ల వినియోగం

పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న 4.30 లక్షల మందిలో ఇప్పటివరకు 3.03 లక్షల (70%) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని మీనా తెలిపారు. ‘3.20 లక్షల మంది ఉద్యోగులు, 40 వేల మంది పోలీసులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకున్నారు. హోమ్‌ ఓటింగ్‌ కేటగిరీలో 28 వేల మంది, అత్యవసర సేవల విభాగంలో 31 వేలు, ఇతరుల కేటగికీలో సెక్టార్‌ అధికారులు, తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వివిధ కారణాలతో పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకోని ఉద్యోగులు ఏ ఎన్నికల అధికారి పరిధిలో ఓటు హక్కు కలిగి ఉన్నారో ఆ ఫెసిలిటేషన్‌ కేంద్ర]ంలో స్పాట్‌లోనే ఓటు హక్కు బుధవారం కూడా వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నాం. అవసరమైతే మరో రోజు పొడిగించే విషయాన్ని పరిశీలిస్తాం. బందోబస్తులో పాల్గొనే పోలీసు అధికారులు, ఉద్యోగులు ఈ నెల 9న ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలిచ్చాం’ అని వివరించారు.

ప్రలోభాలకు గురిచేస్తే అరెస్టులు

‘పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని వినియోగించుకునే క్రమంలో ఉద్యోగులు కొందరు ప్రలోభాలకు లోబడుతున్నారన్న విషయం ప్రచారంలో ఉంది. ఇది చెడు సంకేతం. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డబ్బులు పంచుతున్న నలుగురిని అరెస్టు చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం. అనంతపురంలో నగదు పంపిణీ చేస్తున్న కానిస్టేబుల్‌ని సస్పెండ్‌ చేశాం. విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలోని ఫెసిలిటేషన్‌ సెంటర్‌ వద్ద నగదు పట్టుకుని తిరుగుతున్న ఇద్దర్ని అరెస్టు చేశాం. ఒంగోలులో కొంతమంది యూపీఐ విధానంలో ఉద్యోగులకు నగదు పంపిణీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఒంగోలు ఎస్పీని ఆదేశించాం. ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న వారి కాల్‌ డేటా, వారి బ్యాంకు లావాదేవీల ద్వారా 8 నుంచి 10 మంది ఉద్యోగులను గుర్తించాం’ అని ముకేశ్‌కుమార్‌ మీనా వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు