నడవాలు ‘నాశనం’!

‘నాకు దక్కకపోతే ఎవరికీ దక్కకూడదు’... ఇది ముఖ్యమంత్రి జగన్‌ వైఖరి. కేవలం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రాజెక్టులను   కొనసాగిస్తే ఆ కీర్తి వారికి చెందుతుందనే వికృత ఆలోచనతో అభివృద్ధికి చోదక శక్తిలాంటి  పారిశ్రామిక నడవాల నడకను ఆపేశారు.

Published : 08 May 2024 05:50 IST

పారిశ్రామిక కారిడార్లను అడ్డుకున్న జగన్‌
కేంద్రం నిధులిస్తానన్నా నిర్లక్ష్యం
ఫలితం.. 5 లక్షల మంది ఉపాధిపై ప్రభావం
తెదేపాకు కీర్తి దక్కుతుందనే అక్కసుతోనే... ఇలా!
ఈనాడు, అమరావతి, బిజినెస్‌ బ్యూరో

ప్రాజెక్టుల కోసం భూమిని సేకరించడం చేతకాదు..
పారిశ్రామిక నడవాలను అభివృద్ధి చేయడం రాదు..
ఉపాధి కల్పించే ప్రాజెక్టుల కోసం ముందుండి పోరాడడం తెలీదు..
పెట్టుబడులను ఆకర్షించే నైపుణ్యం అంతకన్నా లేదు..
రాష్ట్రానికి ఆదాయం పెంచే ఆలోచనలు లేనేలేవు..

‘నాకు దక్కకపోతే ఎవరికీ దక్కకూడదు’... ఇది ముఖ్యమంత్రి జగన్‌ వైఖరి. కేవలం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రాజెక్టులను   కొనసాగిస్తే ఆ కీర్తి వారికి చెందుతుందనే వికృత ఆలోచనతో అభివృద్ధికి చోదక శక్తిలాంటి  పారిశ్రామిక నడవాల నడకను ఆపేశారు. వాటిని కొనసాగిస్తే వందలాది పరిశ్రమలు రావడంతో పాటు... లక్షల మందికి ఉపాధి కలిగే అవకాశం ఉన్నా జగన్‌ లెక్కచేయలేదు. కేంద్రం నిధులు ఇస్తానన్నా ఇండస్ట్రియల్‌ కారిడార్లను ముందుకు కదలనివ్వలేదు. పారిశ్రామిక వేత్తలతో నిర్వహించే సమావేశాలు.. సదస్సులు ఏవైనా ‘మూడు పారిశ్రామిక కారిడార్లు.. పోర్టులు.. విమానాశ్రయాలు.. తీర ప్రాంతం’ అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టడం సీఎం జగన్‌కు  ఆనవాయితీ. ఆయన చెబుతున్న మూడు    పారిశ్రామిక కారిడార్లు విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు, బెంగళూరు-హైదరాబాద్‌. వీటి   అభివృద్ధికి చేసే ఖర్చులో మెజారిటీ వాటాను కేంద్రమే భరిస్తుంది. కానీ నామమాత్రంగా ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా ప్రాజెక్టులను ముందుకెళ్లనీయలేదు. రాష్ట్ర ప్రయోజనాలు భారీగా దెబ్బతింటాయని తెలిసినా కనీస ఆలోచన చేయలేదు.

  •  విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు నడవాలకు సంబంధించిన ప్రతిపాదనలు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ పరిధిలోకి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు నోడ్‌ను జగన్‌ ప్రభుత్వం చేర్చింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) రుణం, నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం, ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌ (నిక్‌డిక్ట్‌) కింద పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితే మూడు పారిశ్రామిక కారిడార్లలో కలిపి 43,852 ఎకరాలు, ఓర్వకల్‌ నోడ్‌లో 26,499 ఎకరాలు పారిశ్రామిక  అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం సాధ్యమయ్యేది.
  • పారిశ్రామికంగా ఎంతో వెనకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక  కారిడార్‌ (వీసీఐసీ) ప్రాజెక్టు ప్రాణాధారం. ఉద్యోగాల కల్పనలో, ప్రభుత్వానికి ఆదాయం సంపాదించడంలో ఇది కీలకమైన ప్రాజెక్టు. కానీ ఈ ప్రాజెక్టు విషయంలో జగన్‌ ప్రభుత్వం మొక్కుబడిగా వ్యవహరించింది. రెండు, మూడు సమీక్షా సమావేశాలు నిర్వహించి, అంతటితో కాడి వదిలేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు తన వంతుగా చేయాల్సింది తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి, భూమి కేటాయించడమే. అనంతరం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి, అనుమతులు మంజూరుచేస్తుంది. ఇంతటి మహత్తర అవకాశాన్ని జగన్‌ చేజేతులా నాశనం చేశారు.
  • విశాఖ-చెన్నై నడవా మొదటి దశ పనులు రూ.2,278.60 కోట్లతో గత ప్రభుత్వ  హయాంలోనే మొదలయ్యాయి. ప్రాజెక్టు అమలుకు అవసరమైన నిధుల్లో ఏడీబీ 78.5 శాతాన్ని రుణంగా అందిస్తుంది. మిగిలిన 21.5 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం   భరించాలి. 2017, 2018లలో గుత్తేదారులతో ఒప్పందాన్ని కుదుర్చుకుని.. రెండేళ్లలో మొదటి దశ పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం. ప్రాజెక్టులో 70 శాతం పనులు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. ఐదేళ్లలో మిగిలిన 30 శాతం పనులను జగన్‌ పూర్తి చేయలేకపోయారు. గుత్తేదారులకు సుమారు రూ.170 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో వారు పనులు నిలిపేశారు. దీంతో పనులను ఏపీఐఐసీ ద్వారా చేపట్టేలా ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులు పోను.. ఇంకా రూ.685 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.147.27 కోట్లు భరిస్తే సరిపోయేది
  • వీసీఐసీ రెండో దశలో ప్రతిపాదించిన ప్యాకేజీల సంఖ్యను జగన్‌ ప్రభుత్వం ఏడుకు కుదించింది. రూ.2,838.39 కోట్లతో ఏడీబీ ఆమోదించిన ప్రతిపాదనల్లో రూ.1,205.57 కోట్లు కోత కోసింది. భూసేకరణకు చేసే ఖర్చు రూ.164.70 కోట్లు పోను రూ.1,468.12 కోట్లతో పనులు చేపట్టేలా పిలిచిన టెండర్లనూ ఐదేళ్లలో ఖరారు చేయలేక చేతులెత్తేసింది.
  • హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక నడవా (హెచ్‌బీఐసీ)లో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 9,724 ఎకరాల్లో చేపట్టిన ఓర్వకల్లు పారిశ్రామిక పార్కు అభివృద్ధి పనుల్లోనూ వేగం లేదు. పారిశ్రామిక పార్కు నీటి అవసరాలకు రూ.250 కోట్లతో పైప్‌ లైన్‌ పనులు మాత్రమే నిర్వహిస్తోంది. అవి కూడా అసంపూర్తిగా ఉన్నాయి.

‘విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్‌ (వీసీఐసీ) ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు.. 10 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. కానీ జగన్‌ ప్రభుత్వ అలసత్వం వల్ల ఈ విషయంలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు’’

 ఇటీవల అనకాపల్లి పర్యటనలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌


‘క్రిస్‌ సిటీ’ ఏమైంది?

చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవా (సీబీఐసీ) మొదటి దశలో ‘కృష్ణపట్నం సిటీ  (క్రిస్‌ సిటీ)’ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం  ప్రతిపాదించింది. పర్యావరణ అనుకూల   నయా నగరం నిర్మిస్తామంటూ జగన్‌ ప్రభుత్వం ఊదరగొట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్‌ జోన్‌.. వాకింగ్‌.. సైక్లింగ్‌ ట్రాక్‌లు.. పని ప్రదేశంలో నివాస ప్రాంతాలు.. ఫుడ్‌ కోర్టు.. పని షెడ్లు.. అధునాతన బస్టాప్‌.. ఇవన్నీ కలిపి ఒక అత్యాధునిక నగరాన్నే నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పింది. దీనికి  అవసరమైన నిధులను పూర్తిగా నిక్‌డిక్ట్‌ భరిస్తుంది. ప్రాజెక్టు అమలుకు అవసరమైన భూములను సమకూర్చడమే ప్రభుత్వం చేయాల్సిన పని. తొలిదశలో 2,134 ఎకరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1,054.6 కోట్లను ఖర్చు చేసేలా ఏపీఐఐసీ ప్రతిపాదించింది. ఈ పనులకు మూడుసార్లు టెండర్లు   పిలిచినా గుత్తేదారులను ఖరారు చేయడం సాధ్యం కాలేదు. తొలిదశలో అభివృద్ధి చేసే   ఈ నోడ్‌ ద్వారా సుమారు రూ.18,458 కోట్ల పెట్టుబడులతో.. 98 వేల మందికి ఉపాధి  లభిస్తుందని అంచనా. సీబీఐసీలో భాగంగా మొత్తం 11,095.90 ఎకరాల్లో క్రిస్‌ సిటీ  నిర్మాణాన్ని చేపట్టాలని ప్రతిపాదించారు.

ఐదేళ్లలో... అడుగు ముందుకు పడితే ఒట్టు

‘రూ.4.37 లక్షల కోట్ల పెట్టుబడులు..  2.5 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి’    ఈ లెక్కలు చాలు. ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంత   కీలకమైందో చెప్పడానికి. అది కూడా దశాబ్దాల కరవు పీడిత.. వలసల ప్రభావిత ప్రాంతంలో పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చే ప్రాజెక్టు.    అలాంటిది ప్రభుత్వం దీన్ని చేజేతులా నాశనం చేసింది. నిమ్జ్‌ (నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌    మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌) ప్రాజెక్టుపై జగన్‌ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం అంతులేనిది. గత ప్రభుత్వ హయాంలో ఎంతో కొంత పురోగతిలో ఉన్న ప్రాజెక్టును వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో అధఃపాతాళానికి తొక్కిపెట్టింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని మెట్ట ప్రాంతాల ప్రజలకు ప్రత్యామ్నాయ అభివృద్ధి ప్రాజెక్టు ద్వారా వస్తుందన్న కనీస కనికరం కూడా జగన్‌ చూపలేదు. ప్రాజెక్టు అమలుకు 14,346.61 ఎకరాల్లో వాయంట్స్‌ సంస్థ తయారుచేసిన మాస్టర్‌ ప్లాన్‌ను కేంద్రం ఆమోదించింది. దీనికి అయ్యే ఖర్చు  రూ.3.35 కోట్లను కేంద్రమే భరించింది. అందులో 7,735.34 ఎకరాలను గత ప్రభుత్వాలు సేకరించాయి. ఈ ప్రాజెక్టు అమలు కోసం రాష్ట్ర ఖజానా నుంచి పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తే చాలు. ఆ మాత్రం కూడా    ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం చేయలేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు