Elon Musk: మస్క్‌.. ఈ ఏడాది చెల్లించే పన్నులే రూ.85వేల కోట్లు..!

ఈ ఏడాది తాను దాదాపు రూ.85వేల కోట్ల (11 బిలియన్‌ డాలర్లు)కుపైగానే పన్నుల రూపంలో చెల్లించనున్నట్లు ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు.

Published : 20 Dec 2021 17:13 IST

స్వయంగా వెల్లడించిన ప్రపంచ కుబేరుడు

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ నిలిచిన విషయం తెలిసిందే. అంత ఆదాయం కలిగిన మస్క్‌.. అసలు ప్రభుత్వానికి ఎంత పన్ను చెల్లిస్తారనే విషయంపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఇదే సమయంలో ప్రపంచ కుబేరుడు సరిగ్గా పన్నులు చెల్లిస్తారా అంటూ విమర్శలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎలాన్‌ మస్క్‌ తాజాగా ట్విటర్‌లో స్పందించారు. ఈ ఏడాది తాను దాదాపు రూ.85 వేల కోట్ల (11 బిలియన్‌ డాలర్లు)కుపైగానే పన్నుల రూపంలో చెల్లించనున్నట్లు వెల్లడించారు.

ఇటీవలే ఎలాన్‌ మస్క్‌ను ఈ ఏటి మేటి వ్యక్తిగా టైమ్‌ మ్యాగజైన్‌ ప్రకటించింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురిసింది. ఇదే సమయంలో మస్క్‌పై వచ్చిన ఓ వార్తా కథనాన్ని ట్యాగ్‌ చేసిన అమెరికాకు చెందిన డెమొక్రాటిక్‌ సెనెటర్‌ ఎలిజబెత్‌ వార్రెన్‌.. పన్నులను ఎగవేసే పద్ధతిని మారుద్దాం. దాంతో ‘ది పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ వాస్తవ పన్నులు చెల్లిస్తారంటూ (ఎలాన్‌ మస్క్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ) ట్విట్‌ చేశారు. సెనెటర్‌ చేసిన వ్యాఖ్యలకు ఎలాన్‌ మస్క్ బదులిచ్చారు. ‘ఒక్క రెండు సెకన్లు కళ్లు తెరచి చూస్తే తెలుస్తుంది.. ఈ ఏడాది నేను చెల్లించే పన్నులు అమెరికా చరిత్రలోనే లేవు’ అంటూ  బదులిచ్చారు. తాజాగా మరో ట్వీట్‌ చేసిన ఎలాన్‌ మస్క్‌.. ఈ ఏడాది దాదాపు 11 బిలియన్‌ డాలర్లకుపైగా పన్నుల రూపంలో చెల్లించనున్నట్లు వెల్లడించారు.

ఇదిలాఉంటే, ఇక ఈ ఏడాది ఒక్క టెస్లా మార్కెట్‌ విలువే దాదాపు లక్ష కోట్ల (1 ట్రిలియన్‌) డాలర్ల మార్కును దాటింది. దీని విలువ ఫోర్డ్‌ మోటార్స్‌, జనరల్‌ మోటార్స్‌ రెండింటి విలువ కంటే ఎక్కువ కావడం విశేషం. గతకొన్ని వారాలుగా టెస్లా షేర్లను విక్రయిస్తోన్న ఆయన.. ఇప్పటికే దాదాపు 14బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని