సంక్షిప్త వార్తలు

స్టాక్‌ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్‌లైన్‌ చెల్లింపు గేట్‌వే ఇంటర్‌మీడియర్‌లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది.

Published : 29 Apr 2024 02:07 IST

స్టాక్‌ మార్కెట్లకు ఎఫ్‌ఐయూ తాజా హెచ్చరికలు

దిల్లీ: స్టాక్‌ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్‌లైన్‌ చెల్లింపు గేట్‌వే ఇంటర్‌మీడియర్‌లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. ఆయా చానెళ్ల ద్వారా మనీ లాండరింగ్‌ కార్యకలాపాలు, ఉగ్రవాదులకు నిధులకు అందజేసే లావాదేవీలు జరుగుతున్నాయేమో పరిశీలించేందుకు తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని హెచ్చరించింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల కింద ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. ఇందులో భాగంగా ఆర్థిక సంస్థలు, ఇంటర్‌మీడియర్‌లు అనుమానాస్పద లావాదేవీలను ఎఫ్‌ఐయూకు తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది.


ఐటీపీసీఎల్‌ రుణ పునర్‌వ్యవస్థీకరణ.. ఎస్‌బీఐ అభ్యంతరాన్ని తిరస్కరించిన ఎన్‌సీఎల్‌ఏటీ

దిల్లీ: ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌నకు చెందిన థర్మల్‌ విద్యుత్‌ కంపెనీ ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ తమిళనాడు పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐటీపీసీఎల్‌)కు ఉపశమనం లభించింది. ఐటీపీసీఎల్‌ లీడ్‌ బ్యాంకర్‌గా ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) అందించిన కంపెనీ లిక్విడేషన్‌ విలువను వ్యతిరేకిస్తూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) తిరస్కరించింది. ఐటీపీసీఎల్‌ రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను ఎస్‌బీఐ ఆపలేదని పేర్కొంది. ఈ సందర్భంగా ఎస్‌బీఐ దాఖలు చేసిన 3 దరఖాస్తులను ఎన్‌సీఎల్‌ఏటీ తోసిపుచ్చింది. 30.09.2018 నాటికి ఐటీపీసీఎల్‌ లిక్విడేషన్‌ విలువను నిర్ణయించడంలో ఎటువంటి తప్పు జరగలేదని వెల్లడించింది. ఆర్‌బీఐ సర్క్యులర్‌ ప్రకారం.. రుణదాతల మధ్య ఇంటర్‌-క్రెడిటర్‌ ఒప్పందం జరిగిందని అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ గుర్తించింది. ఐటీపీసీఎల్‌ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికకు 90 శాతానికి పైగా రుణదాతలు ఆమోదం తెలిపారని స్పష్టం చేసింది.


దివాలా ప్రక్రియను వేగవంతం చేయండి
హిందుజా గ్రూప్‌ సంస్థను కోరిన ఆర్‌క్యాప్‌ రుణదాతలు

దిల్లీ: దివాలా ప్రక్రియ నెమ్మదించడంపై రిలయన్స్‌ క్యాపిటల్‌ (ఆర్‌క్యాప్‌) రుణదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. రుణ పరిష్కార ప్రణాళిక గడువుగా ఉన్న మే 27కు కట్టుబడి ఉండాలని, తప్పనిసరి నియంత్రణపరమైన అనుమతులు పొందే ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా హిందుజా గ్రూప్‌ సంస్థ ఇండస్‌ఇండ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ను కోరారు. ఇండస్‌ఇండ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ అధికారులతో ఆర్‌క్యాప్‌ రుణదాతలు భేటీ అయ్యారు. గడువులోగా తమకు రూ.9,650 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఆర్‌క్యాప్‌ పరిష్కార ప్రణాళికకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది. 90 రోజుల్లోగా (మే 27కు) ఈ ప్రణాళికను అమలు చేయాల్సిందిగా ఇండస్‌ఇండ్‌ హోల్డింగ్స్‌ను ఆదేశించింది. దీంతో ఆర్‌క్యాప్‌ రుణదాతలకు కంపెనీ రూ.9,650 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇండస్‌ఇండ్‌ హోల్డింగ్స్‌కు కీలకమైన ఐఆర్‌డీఏఐ ఆమోదం లభించాల్సి ఉండటంతో, రుణదాతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని