74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!

సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్‌ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి.

Published : 29 Apr 2024 02:07 IST

సమీక్ష: సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్‌ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. దేశీయంగా చూస్తే.. ఏప్రిల్‌లో భారత కాంపోజిట్‌ పీఎంఐ 14 ఏళ్ల గరిష్ఠమైన 62.2గా నమోదైంది. తయారీ పీఎంఐ 59.1గా ఉంది. 2023-24లో దేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17.7% వృద్ధితో రూ.19.58 లక్షల కోట్లకు చేరాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు నడిపించాయి. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌పైనా మార్కెట్లు దృష్టి పెట్టాయి. ఇరాన్‌- ఇజ్రాయెల్‌ పరిణామాలతో బ్యారెల్‌ ముడిచమురు ధర 2.3% పెరిగి 89.3 డాలర్లకు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.44 నుంచి 83.35కు బలపడింది.

అంతర్జాతీయంగా.. అమెరికా మొదటి త్రైమాసిక జీడీపీ అంచనాల కంటే తక్కువగా 1.6 శాతంగా నమోదైంది. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ వడ్డీ రేట్లను 0-0.1 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. డాలర్‌తో పోలిస్తే యెన్‌ జీవనకాల కనిష్ఠమైన 156.79కు పడిపోయింది. చైనా కేంద్ర బ్యాంక్‌ కూడా రుణ రేట్లలో మార్పులు చేయలేదు. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 0.9% లాభంతో 73,730 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 1.2% తగ్గి 22,420 పాయింట్ల దగ్గర స్థిరపడింది. రంగాల వారీ సూచీల్లో మన్నికైన వినిమయ వస్తువులు, స్థిరాస్తి, లోహ షేర్లు లాభపడగా.. ఐటీ స్క్రిప్‌లు డీలాపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.14,704 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.20,796 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. ఏప్రిల్‌లో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ.6,304 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 1:1గా నమోదు కావడం..
పెద్ద షేర్లలో కొంత స్థిరీకరణను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: గతవారం లాభాల్లో ముగిసిన సెన్సెక్స్‌, ప్రస్తుతం కీలక నిరోధమైన 74,000- 74,500 పాయింట్ల శ్రేణికి చేరువైంది. ఈ స్థాయిని అధిగమిస్తే జీవనకాల గరిష్ఠమైన 75,124 పాయింట్లను పరీక్షించే అవకాశం ఉంది. మరోవైపు 73,000 పాయింట్ల వద్ద మద్దతు లభించొచ్చు. ఈ స్థాయి దిగువకు పడిపోతే, స్వల్పకాలంలో స్థిరీకరించుకోవచ్చు.
ప్రభావిత అంశాలు: దేశీయ సూచీలపై అంతర్జాతీయ సంకేతాల ప్రభావం కొనసాగొచ్చు. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా బుధవారం సెలవు కావడంతో ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలు, దేశీయ ఆర్థిక గణాంకాలు కీలకం కానున్నాయి. ఈ వారం అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హావెల్స్‌, ఇండస్‌ టవర్స్‌, ఐఓసీ, అదానీ పవర్‌, అంబుజా సిమెంట్స్‌, అదానీ పోర్ట్స్‌, కోల్‌ ఇండియా, డాబర్‌, టైటన్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. ఫలితాల సందర్భంగా యాజమాన్యాలు చేసే వ్యాఖ్యలపై దృష్టిపెట్టొచ్చు. తయారీ పీఎంఐ, మౌలిక రంగ వృద్ధి, నెలవారీ వాహన విక్రయాలు, బ్యాంక్‌ రుణాల వృద్ధి, జీఎస్‌టీ వసూళ్లు గణాంకాలు వెలువడనున్నాయి. లోక్‌సభ ఎన్నికల మొదటి రెండు విడతల్లో తక్కువ పోలింగ్‌ నమోదైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపాకు ఇది ప్రతికూలమని అంటున్నారు. ఎన్నికలతో పాటు దేశంలో వాతావరణ పరిస్థితులు, ఇరాన్‌- ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల వంటివి మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపొచ్చు. రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడులు, చమురు ధరల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు. అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరల ఒడుదొడుకులు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా.. యూరోజోన్‌ ఎకనామిక్‌ సెంటిమెంట్‌, చైనా తయారీ పీఎంఐ, అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల నిర్ణయం, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ మినిట్స్‌, అమెరికా నిరుద్యోగ క్లెయిమ్‌ గణాంకాలు విడుదల కానున్నాయి.

తక్షణ మద్దతు స్థాయులు: 73,227, 72,365, 71,816
తక్షణ నిరోధ స్థాయులు: 74,571, 75,124, 75,600

సెన్సెక్స్‌ 74,500 అధిగమిస్తే, కొత్త గరిష్ఠాలను తాకొచ్చు.

సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని