ఆదాయపు పన్ను ఈ పొరపాట్లు చేయొద్దు

ఆదాయపు పన్ను భారం తగ్గించుకునేందుకు  వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు చట్టం అవకాశం కల్పించింది. కేవలం  ఇలా మదుపు చేయడంతోనే పన్ను ప్రణాళిక పూర్తయినట్లు చాలామంది భావిస్తారు. ఆర్థిక ప్రణాళికలో పన్ను ఆదా పథకాలూ ఎంతో కీలకం.

Updated : 08 Mar 2024 00:51 IST

ఆదాయపు పన్ను భారం తగ్గించుకునేందుకు  వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు చట్టం అవకాశం కల్పించింది. కేవలం  ఇలా మదుపు చేయడంతోనే పన్ను ప్రణాళిక పూర్తయినట్లు చాలామంది భావిస్తారు. ఆర్థిక ప్రణాళికలో పన్ను ఆదా పథకాలూ ఎంతో కీలకం. ఆర్థిక  సంవత్సరం ముగింపు సమీపిస్తున్న నేపథ్యంలో పన్ను ఆదా చేసుకోవాలని ఆలోచిస్తున్న  వారు చేయకూడని పొరపాట్లేమిటో చూద్దాం...

ప్రస్తుత  ఆర్థిక సంవత్సరంలో (2023-24) పన్ను ఆదా చేయాలనుకునే వారు మార్చి 31  లోగా తమ పెట్టుబడులను పూర్తి చేయాల్సి ఉంటుంది. కొత్త పన్ను విధానం  ఎంచుకున్న వారికి ఎలాంటి పెట్టుబడులతోనూ పనిలేదు. పాత పన్ను విధానంలో  కొనసాగుతున్న వారు మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. సాధారణంగా  పన్ను ప్రణాళిక ఎప్పుడూ ఆర్థిక సంవత్సరం మొదటి నెల నుంచే ప్రారంభించాలి.  చాలామంది ఈ విషయాన్ని అప్పుడు పట్టించుకోరు. చివరి నిమిషంలో పెట్టుబడులు  పెట్టే క్రమంలో ఏదో ఒక పథకాన్ని ఎంచుకొంటారు. తాత్కాలికంగా పన్ను ఆదా  లక్ష్యం నెరవేరొచ్చు. కానీ, ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి అడ్డంకిగా మారే  ఆస్కారం ఉంది.


ఉన్న పెట్టుబడులను విస్మరించడం

పన్ను ఆదా కోసం మీకు ఏ పథకం  సరిపోతుంది అని తెలుసుకునే ముందు ఇప్పటికే మీరు ఏయే పథకాల్లో  మదుపు చేశారన్న సంగతి తెలుసుకోవాలి. మీరు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగ  భవిష్య నిధి (ఈపీఎఫ్‌) ఉంటుంది. ఇది ఎలాంటి నష్టభయం లేని పథకం.  సెక్షన్‌ 80సీలో ఉన్న రూ.1,50,000 పరిమితిలో అధిక భాగం ఇదే ఉంటుంది.  కొంతమందికి ఈ మొత్తం ఈపీఎఫ్‌తోనే పూర్తయ్యే అవకాశమూ ఉంది. ఇలాంటప్పుడు  కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఈపీఎఫ్‌ మొత్తం తీసేసిన  తర్వాత పిల్లల ట్యూషన్‌ ఫీజులను లెక్కలోకి తీసుకోవాలి. సాధారణంగా ఈ రెండింటితోనే సెక్షన్‌ 80సీ పరిమితి పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి,  ఇతర పథకాలను ఎంచుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు. పన్ను ఆదా చేయాల్సిన  అవసరం లేకున్నా.. మినహాయింపు ఇచ్చే పెట్టుబడి పథకాలను ఎంచుకోవడం  సరికాదు.


దీర్ఘకాలిక పథకాలను ఎంచుకోవడం..

సాధారణంగా యూనిట్‌ ఆధారిత  బీమా పాలసీలు, సంప్రదాయ ఎండోమెంట్‌ పాలసీలు కనీసం 15 ఏళ్ల వ్యవధికి  అందుబాటులో ఉంటాయి. చాలామంది ఈ పాలసీలను తాత్కాలికంగా పన్ను ఆదా  చేసుకునేందుకు ఎంచుకుంటారు. కొన్నాళ్లపాటు ప్రీమియం చెల్లించిన తర్వాత రద్దు చేసుకోవాలనే ఆలోచనతో ఉంటారు. కొన్నాళ్ల తర్వాత ఆర్థిక  ఇబ్బందులు, లేదా ఆ పాలసీ మీకు సరిపోదని రద్దు చేసుకోవాలని అనుకుంటే  నష్టపోయే అవకాశం ఉంది. సంప్రదాయ బీమా పాలసీల్లో దీర్ఘకాలం కొనసాగినా  కనీసం 5-6 శాతానికి మించి రాబడిని ఇవ్వకపోవచ్చు.


చివరి నిమిషం వరకూ..

పన్ను ఆదా పెట్టుబడులకు మార్చి 31  వరకూ వేచి చూడటం సరికాదు. అవసరమైన మేరకు పెట్టుబడులు  పెట్టేందుకు వెంటనే ప్రయత్నించండి. సాధారణంగా పన్ను ఆదా పథకాలు  దీర్ఘకాలిక వ్యవధితో ఉంటాయి. బీమా పాలసీలు ఎంచుకుంటే.. 15 ఏళ్ల వరకూ  ప్రీమియం చెల్లించాలి. పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వ్యవధి అయిదేళ్లు.  ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) లాకిన్‌ వ్యవధి మూడేళ్లు.  ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)లో 15 ఏళ్లపాటు కొనసాగాలి. ఆర్థిక లక్ష్యాల  సాధనలో మీకు ఏ పథకం అనువుగా ఉంటుందో  చూసుకొని, దాన్ని ఎంచుకునేందుకు ప్రయత్నించాలి.


వివరాలు అందించారా?

ఉద్యోగులకు మూలం వద్ద  పన్ను కోత (టీడీఎస్‌) ఎంత మేరకు విధించారు, ఇంకా ఎంత మేరకు పన్ను  చెల్లించాలో తెలుసుకోండి. మీరు పన్ను మినహాయింపు పొందేందుకు  సమర్పించాల్సిన అన్ని పత్రాలూ అందించారా లేదా చూసుకోండి. పిల్లల ఫీజుల రశీదులు, గృహరుణం వడ్డీ, అసలు చెల్లింపు ధ్రువీకరణ, ఇంటి అద్దె రశీదుల్లాంటివి అందించారా చూసుకోండి.పన్ను ఆదా ప్రణాళిక ఒక్క రోజుతో  పూర్తయ్యేది కాదు. ఆర్థిక సంవత్సరం మొత్తం దీని గురించి ఆలోచించాలి. ప్రతి  పెట్టుబడీ దీర్ఘకాలంలో ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు తోడ్పడేలా చూసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని