ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి.

Published : 29 Mar 2024 00:31 IST

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. కొంతమంది ప్రీమియం పెరుగుతుందనో, పాలసీ ఇవ్వరనో ఈ వివరాలు తెలియజేయడానికి సంకోచిస్తారు. కానీ, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఉండాలంటే.. ముందస్తు వ్యాధుల గురించి పూర్తి సమాచారం ఇవ్వాలి. ఇలాంటప్పుడు రెండు మూడేళ్ల మినహాయింపుతో బీమా సంస్థలు పాలసీని జారీ చేస్తాయి. పాలసీ తీసుకున్న రెండు మూడేళ్ల తర్వాత బీపీ, మధుమేహం, థైరాయిడ్‌ వంటి జీవన శైలి వ్యాధుల బారిన పడితే అప్పుడేం చేయాలి? పాలసీ తీసుకున్న రెండు మూడేళ్ల తర్వాత వచ్చిన వ్యాధుల గురించి బీమా సంస్థకు తెలియజేయాల్సిన అవసరం నిబంధనల ప్రకారం లేదు. దీనివల్ల ఎలాంటి నష్టమూ లేదు. పాలసీని క్లెయిం చేసుకునేటప్పుడు ఈ వివరాలు తెలియజేయలేదనే కారణంతో తిరస్కరించేందుకూ వీల్లేదు. అదే సంస్థలో, అదే పాలసీ మొత్తంతో కొనసాగినన్ని రోజులూ దీనికి ఏ ఇబ్బందీ ఉండదు. పాలసీ విలువ పెంచుకోవడం, వేరే సంస్థకు బదిలీ చేసుకోవడంలాంటి పరిస్థితుల్లో ఇది కచ్చితంగా అవసరం అవుతుంది. పాలసీ తీసుకున్న తర్వాత వచ్చిన వ్యాధుల గురించి తమకు తెలియజేయాల్సిందిగా ఇటీవల కాలంలో బీమా సంస్థలు సూచిస్తున్నాయి. ఇలా మధ్యలో వచ్చిన వ్యాధుల వివరాలు చెబితే.. దానిని పాలసీలో చేరుస్తాయి. క్లెయిం సందర్భంలో ఇక దానిపై ఎలాంటి ప్రశ్నలూ అడిగేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ చెప్పకపోతే.. బీపీ, మధుమేహం, థైరాయిడ్‌ వంటివి తొలిసారి గుర్తించినప్పుడు దానికి సంబంధించిన రిపోర్టులను జాగ్రత్త పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఏదైనా క్లెయిం సందర్భంలో బీమా సంస్థ వీటికి సంబంధించిన ప్రశ్న వేసినప్పుడు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి, సాధ్యమైనంత వరకూ మధ్యలో గుర్తించిన వ్యాధుల వివరాలను తెలియజేయడమే మంచిది. కనీసం పాలసీ పునరుద్ధరణ సమయంలోనైనా ఈ వివరాలు తెలియజేయడం మంచిదని బీమా నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని