పసిడిలో మదుపు 10 శాతమే..

నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి.

Updated : 29 Mar 2024 01:08 IST

నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. నెలకు రూ.10వేల వరకూ మదుపు చేయాలని ఆలోచన. దీనికోసం ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

- సుధీర్‌

 మీ కుటుంబ బాధ్యతలకు తగిన రక్షణ కల్పించేందుకు తగిన మొత్తానికి టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా, మంచి క్లెయిం చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు కంపెనీల నుంచి తీసుకునేందుకు ప్రయత్నించండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.10వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. నెలకు రూ.10వేల చొప్పున 21 ఏళ్లపాటు మదుపు చేస్తే సగటున 12 శాతం వార్షిక రాబడి అంచనాతో రూ.98,03,848 అయ్యేందుకు అవకాశం ఉంది.


నా వయసు 64. నెలకు రూ.15వేలు ఆదాయం వచ్చేలా కొంత మొత్తాన్ని పోస్టాఫీసు పథకాల్లో మదుపు చేద్దామని అనుకుంటున్నాను. ఎందులో ఎక్కువ వడ్డీ వస్తుంది? 

సూర్యనారాయణ
ప్రస్తుతం బ్యాంకుల్లో ఎఫ్‌డీ రేట్లు కాస్త అధికంగానే ఉన్నాయి. వీటినీ పరిశీలించవచ్చు. పోస్టాఫీసులో సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంలో 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. అయిదేళ్ల వ్యవధికి దీన్ని తీసుకోవచ్చు. మూడు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు. సగటున నెలకు రూ.15వేలు రావాలంటే.. కనీసం రూ.22 లక్షలు జమ చేయాల్సి ఉంటుంది.


మా అమ్మాయి వయసు 8 ఏళ్లు. తన పేరుమీద నెలకు రూ.12వేల వరకూ పెట్టుబడి పెట్టాలని ఆలోచన. కనీసం 14 ఏళ్లపాటు మదుపు చేసేందుకు ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

- రాజు
ముందుగా మీ పేరుపై ఒక టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోండి. విద్యా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి వచ్చేలా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించాలి. రూ.4వేలను సుకన్య సమృద్ధి యోజనలో జమ చేయండి. మిగతా రూ.8వేలను ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. వీలైనప్పుడల్లా పెట్టుబడి మొత్తాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించండి.


మూడేళ్ల నుంచీ నెలకు రూ.25వేలు గోల్డ్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నాను. పెద్దగా రాబడి కనిపించడం లేదు. దీనికి బదులుగా షేర్లలో మదుపు చేస్తే మంచి లాభం వస్తుందా?

- మధుకర్‌
మీ మొత్తం పెట్టుబడిలో 5-10 శాతం వరకే బంగారానికి కేటాయించాలి. పెట్టుబడి ఒకే చోట ఉండటం సరికాదు. ఈ మధ్య బంగారం ధర కాస్త పెరిగింది. మూడేళ్లుగా స్టాక్‌ మార్కెట్‌ మంచి లాభాలను ఇచ్చింది. దీర్ఘకాలంలోనూ రాబడి అధికంగానే ఉండే అవకాశాలు లేకపోలేదు. షేర్లలో నేరుగా మదుపు చేయాలంటే వాటిపై పూర్తి అవగాహన ఉండాలి. ఎప్పటికప్పుడు గమనించేందుకు తగిన సమయమూ ఉండాలి. వీటికి బదులుగా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో కనీసం అయిదారేళ్ల వ్యవధికి మదుపు చేయండి.
- తుమ్మ బాలరాజ్ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని