టర్మ్‌ ఇన్సూరెన్స్‌ కుటుంబానికి భరోసానిచ్చేలా

బీమా పాలసీలు ఎన్నో రకాలుగా ఉంటాయి. కొన్ని పొదుపు చేసేందుకు ఉపయోగపడతాయి. మరికొన్ని పెట్టుబడులకు తోడ్పడతాయి. వీటికి భిన్నంగా పూర్తి రక్షణకే పరిమితమయ్యేవి టర్మ్‌ పాలసీలు. వీటిని ఆన్‌లైన్‌లోనూ తీసుకోవచ్చు. లేదా బీమా సలహాదారును సంప్రదించీ కొనుగోలు చేయొచ్చు.

Updated : 07 Apr 2024 00:54 IST

ఆర్థిక ప్రణాళికలో బీమాకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వీటిలోనూ తక్కువ ప్రీమియంతో, అధిక రక్షణ అందించే పాలసీలను ఎంచుకోవడం ద్వారా కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు వీలవుతుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఒక్కసారి మీ బీమా అవసరాలను సరి చూసుకోండి. పెరిగిన ఆదాయం, బాధ్యతలకు అనుగుణంగా పాలసీ విలువ ఉందా పరిశీలించండి.

బీమా పాలసీలు ఎన్నో రకాలుగా ఉంటాయి. కొన్ని పొదుపు చేసేందుకు ఉపయోగపడతాయి. మరికొన్ని పెట్టుబడులకు తోడ్పడతాయి. వీటికి భిన్నంగా పూర్తి రక్షణకే పరిమితమయ్యేవి టర్మ్‌ పాలసీలు. వీటిని ఆన్‌లైన్‌లోనూ తీసుకోవచ్చు. లేదా బీమా సలహాదారును సంప్రదించీ కొనుగోలు చేయొచ్చు. ఉద్యోగ జీవితం ప్రారంభమైనప్పటి నుంచీ కనీసం 35-40 ఏళ్లపాటు సంపాదన ఉంటుందని అనుకుంటాం. కానీ, మధ్యలో ఏదైనా అవాంతరం వచ్చినప్పుడు ఆధారపడిన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి? ఇలాంటి అనుకోని సంఘటనల వల్ల కుటుంబానికి ఆదాయం ఆగిపోయినప్పుడు ఆదుకునేదే టర్మ్‌ పాలసీ అని చెప్పొచ్చు. 15 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వ్యవధికి ఈ పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని బీమా సంస్థలు అంతకు మించి వ్యవధికీ దీన్ని అందిస్తున్నాయి. పాలసీని తీసుకునే వ్యక్తి తనకు అనుకూలమైన వ్యవధిని నిర్ణయించుకోవచ్చు. పాలసీని తీసుకునేటప్పుడు నిర్ణయించిన ప్రీమియమే.. చివరి వరకూ చెల్లించాలి. ఇది ఇందులో ఎంతో అనుకూలమైన అంశంగా పేర్కొనవచ్చు.

ఆర్థిక భద్రత: కుటుంబంలో ఆర్జించే వ్యక్తికి అకాల మరణం సంభవించినప్పుడు, ఆ కుటుంబానికి తగిన ఆర్థిక రక్షణ కల్పించడమే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ప్రధాన లక్ష్యం. కష్టకాలంలో ఆర్థిక భద్రతకు ఇది హామీ ఇస్తుంది. పాలసీ విలువను నామినీకి చెల్లించడం ద్వారా ఆ కుటుంబం జీవన శైలి దెబ్బతినకుండా భరోసానిస్తుంది. అతని/ఆమె బాధ్యతలను పాలసీ నెరవేరుస్తుందన్నమాట.

 తక్కువ ప్రీమియంతో: సంప్రదాయ పాలసీలను తీసుకున్నప్పుడు ప్రీమియం కాస్త అధికంగానే ఉంటుంది. తక్కువ ప్రీమియంతో అధిక రక్షణ కావాలంటే.. అందుకు అనువైన మార్గం టర్మ్‌ పాలసీలే. ఇతర లక్ష్యాలు దెబ్బతినకుండా బీమా పాలసీని కొనసాగించేందుకు ఇది తోడ్పడుతుంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ప్రీమియం రేట్లు కాస్త తేడా ఉంటాయి. వయసు తక్కువగా ఉన్నప్పుడు పాలసీ తీసుకుంటే, తక్కువ భారం ఉంటుంది. వయసుతో పాటే కొన్ని వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అప్పుడు ప్రీమియం పెరగడంతోపాటు, కొన్నిసార్లు పాలసీ ఇవ్వడానికి బీమా సంస్థలు నిరాకరించే ఆస్కారమూ ఉంటుంది.

అధిక మొత్తంలో: పాలసీదారులకు పెద్ద మొత్తంలో ఆర్థిక రక్షణ కల్పించడంలో టర్మ్‌ పాలసీలు ముందుంటాయి. కొన్ని టర్మ్‌ పాలసీలు ప్రీమియం తిరిగి ఇచ్చేవీ ఉన్నాయి. సాధారణంగా వీటికి కాస్త ప్రీమియం అధికంగా ఉంటుంది. మీ వీలును బట్టి, ఏ రకం పాలసీని ఎంచుకోవాలన్నది నిర్ణయించుకోవచ్చు.

అనుబంధ పాలసీలతో: ప్రమాదవశాత్తూ మరణం, తీవ్ర వ్యాధుల్లాంటి సందర్భాల్లో అదనపు పరిహారం లభించేలా కొన్ని అనుబంధ పాలసీలను జోడించుకునేందుకూ వీలుంటుంది. వ్యాధిని గుర్తించిన వెంటనే పాలసీ మొత్తాన్ని ఒకేసారి పరిహారంగా చెల్లిస్తుంది.

వాయిదాల్లోనూ: ఆన్‌లైన్‌ టర్మ్‌ పాలసీలను అందిస్తున్న బీమా సంస్థలు ప్రీమియం చెల్లించేందుకు వాయిదాల విధానాన్నీ అందిస్తున్నాయి. ప్రీమియాన్ని నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక, లేదా వార్షిక ప్రాతిపదికన చెల్లించే వీలుంటుంది. ప్రీమియం చెల్లింపులు సకాలంలో చేయడం ఎప్పుడూ మంచిది. వాయిదాల్లో చెల్లించే వీలుండటం వల్ల పాలసీదారుల ఇతర పెట్టుబడులకు, బాధ్యతలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.

పన్ను ప్రయోజనాలు: మంచి టర్మ్‌ పాలసీలను ఎంచుకోవడం ఆర్థిక ప్రణాళికలో కీలకం. వీటిని ఎంచుకున్నప్పుడు ఆదాయపు పన్ను మినహాయింపు లభించడం ఒక అదనపు ప్రయోజనంగానే చూడాలి. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80సీ కింద టర్మ్‌ పాలసీలకు చెల్లించిన ప్రీమియాన్ని చూపించుకోవచ్చు. ఈ సెక్షన్‌ కింద గరిష్ఠంగా రూ.1,50,000 వరకూ మినహాయింపు పొందవచ్చు.

బాధ్యతలు తీరేలా: ఒక వ్యక్తి తన వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ బీమా ఉండేలా చూసుకోవాలి. గృహరుణం, ఇతర అప్పులు, పిల్లల చదువుల ఖర్చులు, ఇతర బాధ్యతలన్నీ గణించి, ఆ తర్వాత ఎంత పాలసీ తీసుకోవాలనేది నిర్ణయించుకోవాలి. అప్పుడే అది పూర్తి స్థాయి బీమా పాలసీ అనిపించుకుంటుంది.

అన్ని వివరాలూ చెప్పండి: బీమా పాలసీ తీసుకునేటప్పుడు మీ ఆరోగ్య వివరాలన్నీ వెల్లడించండి. ఏదైనా వ్యాధులున్నప్పుడు కొన్నిసార్లు  ప్రీమియం పెరిగే అవకాశం ఉంటుంది. అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధంగా ఉండండి. దరఖాస్తు పత్రంలో తప్పులు నింపితే.. క్లెయిం సందర్భంలో నామినీకి ఇబ్బందులు రావచ్చనేది గుర్తుంచుకోవాలి.

రుణాల కోసం ప్రత్యేకంగా: గృహరుణంలాంటి దీర్ఘకాలిక అప్పులు తీసుకున్నప్పుడు దానికి అనుబంధంగా లోన్‌ కవర్‌ టర్మ్‌ పాలసీల్లాంటివి తీసుకోవడం మర్చిపోవద్దు. రుణ వ్యవధి కొనసాగినన్ని రోజులూ ఆ పాలసీని కొనసాగించడం మంచిది.

నెలనెలా.. : బీమా పాలసీ నుంచి పరిహారం ఒకేసారి లభించేలా ఎంచుకోవచ్చు. లేదా ప్రతి నెలా వేతనంలాగా అందే ఏర్పాటూ చేయొచ్చు. దీనివల్ల ఆర్జించే వ్యక్తిలేని లోటును ఆర్థికంగా భర్తీ చేసేందుకు వీలవుతుంది. పాలసీలను ఎంచుకునేటప్పుడు కేవలం ప్రీమియాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవద్దు. మీ కుటుంబానికి భరోసానిచ్చేలా పాలసీ ఉండాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని