పెట్టుబడి ప్రభుత్వ బాండ్లలో

చిన్న మదుపరులు ప్రభుత్వ బాండ్లలో మదుపు చేసేందుకు 2021లో ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ పోర్టల్‌ను తీసుకొచ్చింది. దీన్ని మరింత సులభతరం చేసేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ బాండ్ల గురించి తెలుసుకుందాం.

Published : 12 Apr 2024 00:15 IST

చిన్న మదుపరులు ప్రభుత్వ బాండ్లలో మదుపు చేసేందుకు 2021లో ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ పోర్టల్‌ను తీసుకొచ్చింది. దీన్ని మరింత సులభతరం చేసేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ బాండ్ల గురించి తెలుసుకుందాం.

పెట్టుబడి సురక్షితంగా ఉండటంతో పాటు, ప్రభుత్వ హామీ ఉండే బాండ్లలో మదుపు చేయాలనుకునే వారికి ఇప్పుడు మరింత వెసులుబాటు రానుంది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో (బాండ్లు) మదుపు చేసేప్పుడున్నవిధానపరమైన సంక్లిష్టతలను తొలగించడమే దీని లక్ష్యం. మదుపరులు ఈ యాప్‌ ద్వారా ప్రాథమిక, సెకండరీ మార్కెట్‌లను యాక్సెస్‌ చేయొచ్చు. గతవారం నిర్వహించిన పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ ఈ ప్రత్యేక యాప్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.

ఏమిటివి?

మార్కెట్‌ నుంచి నిధులను సేకరించేందుకు ప్రభుత్వం ఉపయోగించే సాధనాలను ప్రభుత్వ సెక్యూరిటీలు అంటారు. ప్రభుత్వ హామీ ఉన్న పథకాలు కాబట్టి, ఇవి స్థిరమైన రాబడిని అందిస్తాయి. నష్టభయమూ అంతగా ఉండదు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలూ వీటిని జారీ చేస్తుంటాయి. ట్రెజరీ బిల్లులు ఏడాది కంటే తక్కువ వ్యవధికి అందుబాటులో ఉంటాయి. బాండ్లు దీర్ఘకాలం పాటు జారీ చేస్తారు. దీర్ఘకాలం పాటు బాండ్లలో మదుపు చేయాలనుకునే వారు వీటిని కొనుగోలు చేయొచ్చు. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇవి సాధారణంగా 7.1-7.50 శాతం వరకూ వార్షిక రాబడినిస్తాయి. కనీస పెట్టుబడి రూ.1,000 నుంచి ఉంటుంది. కొన్ని బాండ్లలో రూ.10,000 ఉంటుంది. వడ్డీ సాధారణంగా ఆరు నెలలకోసారి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఏడాదికోసారి నేరుగా పొదుపు ఖాతాలో జమ అవుతుంది.

ఖాతా ఎలా?

రిటైల్‌ మదుపరులు ముందుగా ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ ఖాతాను ప్రారంభించాల్సి ఉంటుంది. దీన్ని వ్యక్తిగతంగానూ, ఉమ్మడిగానూ తీసుకోవచ్చు. ప్రస్తుతం ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ పోర్టల్‌లో దీన్ని తీసుకోవచ్చు. పొదుపు ఖాతా, పాన్‌, కేవైసీ పత్రాలు (పాస్‌పోర్ట్‌, ఓటర్‌ ఐడీ, ఆధార్‌)లాంటి వివరాలు అవసరం అవుతాయి. ఇ-మెయిల్‌, మొబైల్‌ నంబర్లతో ఖాతాను ప్రారంభించవచ్చు. దీన్ని నిర్వహించేందుకు ఎలాంటి రుసుములూ ఉండవు.

ప్రయోజనాలు...

స్థిరమైన వడ్డీని అందించడంతోపాటు, సురక్షితంగానూ ఇవి ఉంటాయి. 91 రోజుల వ్యవధి నుంచి 40 ఏళ్ల వరకూ వీటి వ్యవధి ఉంటుంది. వీలును బట్టి, ఈ బాండ్లను ఎంచుకోవచ్చు. అవసరమైనప్పుడు సెకండరీ మార్కెట్లోనూ వీటిని విక్రయించుకోవచ్చు. స్టేట్‌ డెవలప్‌మెంట్‌ లోన్స్‌ (ఎస్‌డీఎల్‌) ఆకర్షణీయమైన రాబడులను అందిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు