ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా

మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్‌ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి.

Updated : 19 Apr 2024 00:46 IST

నాకు నెలకు రూ.56 వేల వేతనం వస్తోంది. టర్మ్‌ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. నా వయసు 29. ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలి? నెలకు రూ.9 వేల వరకూ మదుపు చేయాలంటే ఏం చేయాలి?

మధు

మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్‌ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.9వేలలో రూ.3 వేలను ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)లో జమ చేయండి. రూ.6,000 డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా నెలనెలా మదుపు చేయండి. ఇలా మీ పెట్టుబడిని కనీసం 20 ఏళ్లు కొనసాగిస్తే.. సగటున 11 శాతం వార్షిక రాబడితో రూ.69,33,905 అయ్యేందుకు అవకాశం ఉంది.

నా దగ్గర రూ.5లక్షలు ఉన్నాయి. మరో రెండేళ్ల వరకూ వీటితో అవసరం లేదు. కాస్త సురక్షితంగా ఉండేలా ఎక్కడ మదుపు చేయాలి? మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి మంచిదేనా?

 రమణ
ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత పథకాల్లో స్వల్పకాలంలో నష్టభయం ఉంటుంది. మీకు రెండేళ్ల వ్యవధే ఉందంటున్నారు కాబట్టి, మీ పెట్టుబడిపై ఎలాంటి నష్టభయం లేకుండా చూసుకోవాలి. ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. మీకు ఎప్పుడు డబ్బు అవసరమవుతుందో చూసుకొని, ఆ వ్యవధి మేరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయండి. కనీసం నాలుగు నుంచి అయిదేళ్ల వ్యవధి ఉంటేనే ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయాలి.

నాలుగేళ్ల మా అమ్మాయి భవిష్యత్‌ అవసరాల కోసం నెలకు రూ.15వేల వరకూ పెట్టుబడి పెట్టాలని ఆలోచన. దీనికోసం ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

హరి

ముందుగా మీ అమ్మాయి భవిష్యత్‌ అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. మీరు పెట్టే పెట్టుబడి ద్రవ్యోల్బణాన్ని మించి రాబడినిచ్చేలా చూసుకోండి. రూ.15వేలలో రూ.5వేలను సుకన్య సమృద్ధి యోజనలో జమ చేయండి. మిగతా రూ.10వేలను బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌, మల్టీ అసెట్‌ ఫండ్లలో మదుపు చేయండి.

బంగారంలో నెలకు రూ.5వేల వరకూ మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఇలా కనీసం ఏడెనిమిదేళ్లు కొనసాగిస్తాం. అనుకూలమైన పథకాలు ఏమున్నాయి?

శ్రావణి
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగారం మంచి రాబడినే అందిస్తోంది. మొత్తం పెట్టుబడిని బంగారంలోనే పెట్టకూడదు. మీరు పెట్టుబడి దృష్టితో చూస్తే.. రూ.1,000 వరకూ గోల్డ్‌ ఫండ్లలో మదుపు చేయండి. మిగతా రూ.4వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. భవిష్యత్తులో బంగారమే కొనాలనుకుంటే.. మొత్తం డబ్బును గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్లలో జమ చేయండి.

ఒకేసారి రూ.10 లక్షలు జమ చేసి, ఏడాదికోసారి వడ్డీ వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నాం. దీనికోసం మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయొచ్చా? ఏ తరహా ఫండ్లలో మదుపు చేయాలి?

 శ్రీకాంత్‌
పెట్టుబడి కోసం డెట్‌ ఫండ్లలోని షార్ట్‌ టర్మ్‌ ఇన్‌కం ఫండ్లను పరిశీలించవచ్చు. ఇందులో మంచి క్రెడిట్‌ క్వాలిటీ ఉన్న వాటిని ఎంచుకోండి. ఇవి దాదాపు 7.5-8 శాతం వరకూ రాబడినిస్తున్నాయి. నెలనెలా క్రమానుగత విధానంలో కొంత మేరకు వెనక్కి తీసుకోవచ్చు. లేదా ఏడాదికోసారి మీ అవసరాలను బట్టి ఉపసంహరించుకోవచ్చు.
తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని