UTS app: కౌంటర్‌కు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. UTS యాప్‌తో బుకింగ్ ఎలా..?

UTS app: టికెట్‌ కొనుగోలును సులభతరం చేసేందుకు రైల్వే శాఖ యూటీఎస్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అందులో టికెట్‌ బుకింగ్‌ ఎలానో ఇప్పుడు చూద్దాం.. 

Updated : 16 Apr 2024 11:43 IST

UTS app | ఇంటర్నెట్‌డెస్క్‌: దగ్గరైనా, దూరమైనా.. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఎక్కువమంది ఇష్టపడేది ట్రైన్‌ జర్నీనే. సాధారణంగా బెర్త్‌ బుక్‌ చేసుకోవాలంటే చాలా రోజుల ముందే టికెట్ బుక్‌ చేసుకోవాలి. అప్పటికప్పుడు జర్నీ కోసమైతే కౌంటర్‌ వద్దే టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి కౌంటర్‌ వద్ద రద్దీ వల్ల టికెట్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకే రైల్వే శాఖ అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్‌ బుకింగ్‌ సిస్టమ్‌ను (UTS) యాప్‌ను ప్రారంభించింది.

ఒకప్పుడు తక్కువ దూరం ప్రయాణం, క్విక్‌ బుకింగ్‌, ప్లాట్‌ఫాం టికెట్‌, సీజన్‌ టికెట్‌, క్యూఆర్‌ బుకింగ్‌ కోసం అందుబాటులోకి తెచ్చిన యాప్‌.. ఇప్పుడు నాన్‌-సబర్బన్‌ ట్రావెల్‌ (non-suburban travel) టికెట్‌ బుక్‌ చేసుకొనే వెసులుబాటునూ అందిస్తోంది. అంటే 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న ప్రయాణానికి కూడా మూడు రోజుల ముందు టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చన్నమాట. 200 కి.మీ. కంటే తక్కువ దూరం ఉంటే ప్రయాణం రోజే టికెట్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

టికెట్‌ బుకింగ్ ఇలా..

  • UTS యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌/ యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి.
  • యాప్‌లో లాగిన్‌ అయిన వెంటనే స్క్రీన్‌పై కనిపించే Normal Booking సెక్షన్‌లోకి వెళ్లాలి. అందులో కనిపించే Book and Travel (పేపర్‌లెస్), Book and Print (పేపర్‌).. ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి.
  • పేపర్‌ లెస్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే మొబైల్‌లో జీపీఎస్‌ను ఆన్‌ చేయాల్సి ఉంటుంది.
  • తర్వాత మీరు ఎక్కడినుంచి ప్రయాణించాలనుకుంటున్నారో ఆ స్టేషన్‌తో పాటు చేరుకోవాల్సిన స్టేషన్‌ను ఎంచుకోవాలి.
  • కింద కనిపించే ఆప్షన్ల ద్వారా మీ ప్రయాణానికి అందుబాటులో ఉన్న ట్రైన్‌లు, వాటి ఛార్జీలు డిస్‌ప్లే అవుతాయి.
  • Get Fareపై క్లిక్‌ చేసి మీకు నచ్చిన ట్రైన్‌పై క్లిక్‌ చేయగానే సమయం, ప్లాట్‌ఫాం నంబర్‌, ట్రైన్‌ నంబర్‌, టికెట్‌ ధర వంటి వివరాలు కనిపిస్తాయి.
  • ప్యాసింజర్ల సంఖ్య, ట్రైన్‌ టైప్‌ (ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ ఫాస్ట్‌), పేమెంట్‌ టైప్‌ను ఎంచుకోవాలి.
  • కిందకు స్క్రోల్‌ చేయగానే కనిపించే BOOK TICKET ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. ఆర్‌- వాలెట్‌, డెబిట్‌ కార్డ్‌/ UPI / ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌/ క్రెడిట్‌ కార్డ్‌.. ఈ చెల్లింపు ఎంపికల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకొని టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.
  • టికెట్‌ బుక్‌ చేసే ముందు పేపర్‌ మోడ్‌ ఎంచుకుంటే దగ్గరల్లోని UTS కియోస్క్ లేదా రైల్వే బుకింగ్ కౌంటర్‌కు వెళ్లి ప్రింట్‌ తీసుకోవాలి.
  • ఆర్‌- వాలెట్‌ను టాప్‌- అప్‌ చేయడం తప్పనిసరి కాదు.  ఒకవేళ చేస్తే వాలెట్‌ టాప్‌-అప్‌పై 3 శాతం బోనస్‌ లభిస్తుంది.

ఈ యాప్‌ ద్వారా ఒకప్పుడు స్టేషన్‌కు 5 కి.మీ. పరిధిలో మాత్రమే టికెట్‌ బుక్‌ చేసుకునే వీలుండేది. దాన్ని పట్టణ ప్రాంతాల్లో 10 కి.మీ., ఇతర ప్రాంతాల్లో 20 కి.మీ.కు పెంచారు. ట్రైన్‌ ఎక్కాక టికెట్‌ బుక్‌ చేయడం వీలు పడదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని