Udgam: బ్యాంకుల్లో రూ.వేల కోట్ల అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు.. మన సొమ్ము చెక్‌ చేసుకోవడం ఎలా?

Udgam: బ్యాంకుల్లో ఎవరూ క్లెయిం చేయని డిపాజిట్లు రూ.కోట్లలో ఉన్నాయని కేంద్రం తెలిపింది. మరి అందులో మీవి లేదా మీ సంబంధీకుల సొమ్ము కూడా ఉందేమో తెలుసా? ఎలా చెక్‌ చేసుకోవాలో చూద్దాం!

Updated : 24 Dec 2023 16:56 IST

Udgam | ఇంటర్నెట్‌ డెస్క్‌: 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎవరూ క్లెయిమ్‌ చేయని (Unclaimed Deposits) డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 28 శాతం పెరిగి రూ.42,270 కోట్లకు చేరాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.36,185 కోట్లు, ప్రైవేటు రంగ బ్యాంకుల వద్ద రూ.6,087 కోట్ల డిపాజిట్లు ఉన్నాయన్నారు. అయితే, ఇలాంటి డిపాజిట్ల వివరాలను తెలుసుకోవడం కోసం ఆర్‌బీఐ (RBI) ప్రత్యేకంగా ఉద్గమ్‌ (Udgam) పేరిట ఒక కేంద్రీకృత వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించింది. కొన్ని ప్రాథమిక వివరాలతో ఎవరైనా తమ పేరు మీద క్లెయిమ్‌ చేసుకోని డిపాజిట్లు ఉన్నాయేమో తెలుసుకోవచ్చు.

పది లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా క్లెయిమ్‌ చేయని డిపాజిట్లను అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల (Unclaimed Deposits) కింద బ్యాంకులు వర్గీకరిస్తాయి. బ్యాంకులు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI)కు చెందిన ‘డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ (డీఈఏ)’ నిధికి వాటిని బదిలీ చేస్తాయి. అయినప్పటికీ.. సంబంధిత ఆధారాలతో బ్యాంకులను సంప్రదించి వాటిని తిరిగి పొందొచ్చు. ఉద్గమ్‌ పోర్టల్‌లో (Udgam) 29 బ్యాంకులు నమోదయ్యాయి. వాటిలో మీ లేదా మీ సంబంధీకుల ఖాతాల్లో అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు ఉన్నాయేమో చూడొచ్చు. ఖాతాదారులు మరణించిన పక్షంలో నామినీలు లేదా వారసులు అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల వివరాలు తెలుసుకోవచ్చు. తమ వారికి ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత ఆధారాలతో బ్యాంకును సంప్రదించి వాటిని క్లెయిం చేసుకోవచ్చు.

ఇలా చెక్ చేసుకోండి..

  • ఉద్గమ్‌ పోర్టల్‌ https://udgam.rbi.org.inలోకి వెళ్లాలి.
  • మొబైల్‌ నెంబర్‌ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
  • ఓటీపీ వెరిఫికేషన్‌ పూర్తిచేసి ఖాతాలోకి లాగిన్‌ కావాలి.
  • ఖాతాదారుడి పేరుతో పాటు మీ బ్యాంకును ఎంచుకోవాలి. కావాలంటే ‘అన్ని బ్యాంకులు’ అనే ఆప్షన్‌ను కూడా సెలెక్ట్‌ చేసుకోవచ్చు.
  • తర్వాత కింది వరుసలో ఖాతాదారుడి ఆధార్‌, పాన్‌, పుట్టిన తేదీ వంటి వివరాల్లో ఏదో ఒక దాన్ని ఎంటర్‌ చేయాలి. కావాలంటే అడ్రస్‌ కూడా ఇచ్చే ఆప్షన్‌ ఉంటుంది.
  • వివరాలన్నీ ఎంటర్‌ చేసిన తర్వాత సెర్చ్‌పై క్లిక్‌ చేస్తే సమాచారం మీ ముందుంటుంది.
  • అయితే, కొన్ని బ్యాంకుల వివరాలు వెంటనే లభించకపోవచ్చునని సైట్‌లో పేర్కొనడం గమనార్హం. వాటి కోసం కొంతకాలం తర్వాత ప్రయత్నించాలని సైట్‌ సూచిస్తోంది.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని