Working Hours: పని గంటలపై చర్చ.. కష్టపడేవాళ్లలో మనమూ ముందే!

Working Hours | నారాయణ మూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో పనిగంటలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే, ఎక్కువ గంటలు పని చేయడంలో భారతీయులు ఏ స్థానంలో ఉన్నారో ఐఎల్‌ఓ డేటా ఆసక్తికర విషయాన్ని వెల్లడిస్తోంది.

Updated : 01 Nov 2023 16:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పనిగంటలపై ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే తెరతీశాయి. భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో యువత 70 గంటల పాటు పనిచేయాలంటూ ఆయన చేసిన సూచనకు కొంతమంది మద్దతుగా నిలిస్తే.. మరికొంత మంది తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఏదేమైనప్పటికీ.. ఆయన వ్యాఖ్యలు సుదీర్ఘ పని గంటలు, భారత్‌లో వర్క్‌ కల్చర్‌పై ఆరోగ్యకరమైన చర్చకు దారితీసిందని మాత్రం చెప్పొచ్చు.

నారాయణమూర్తి (Narayana Murthy) వ్యాఖ్యలు, తదనంతర చర్చను పక్కనపెడితే ‘అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO)’ సమాచారం మాత్రం కీలక విషయాన్ని వెల్లడిస్తోంది. ప్రపంచంలో అత్యంత కష్టపడి పనిచేసే వారిలో భారతీయులు ఉన్నట్లు ఐఎల్‌ఓ డేటా ద్వారా తెలుస్తోంది. 2023 నాటికి భారతీయులు సగటున వారానికి 47.7 గంటలు పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్‌ ఈ విషయంలో ఏడో స్థానంలో ఉంది. మన కంటే ముందు ఖతార్‌, కాంగో, లెసోతో, భూటాన్‌, జాంబియా, యూఏఈ ఉన్నాయి. అయితే, పది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం భారతీయులే ఎక్కువ గంటలు పనిచేస్తున్నట్లు వెల్లడైంది. ఈ డేటా ఐఎల్‌ఓ దృష్టిని ఆకర్షించింది. భారత పనిగంటలపై నిర్దిష్ట నివేదికను రూపొందించే అంశాన్ని పరిశీలిస్తోంది. 

9AM నుంచి 9PM.. వారానికి 100 గంటలు.. పని గంటలపై బాస్‌ల మాట!

ఐఎల్‌ఓ డేటా విశ్లేషణ మరో ఓ ఆసక్తికర విషయాన్నీ వెల్లడిస్తోంది. ఉత్పాదకత, పనిగంటల మధ్య భిన్నమైన సంబంధం ఉన్నట్లు తెలిపింది. అత్యధిక తలసరి జీడీపీ ఉన్న దేశాల్లో తక్కువ పని గంటలు అమల్లో ఉన్నట్లు డేటాను పరిశీలిస్తే అర్థమవుతోంది. సగటున అత్యధిక పనిగంటలు ఉన్న భారత్‌.. ప్రపంచ తొలి 10 ఆర్థిక వ్యవస్థల్లో అత్యల్ప తలసరి జీడీపీని కలిగి ఉండడం గమనార్హం. అదే ఫ్రాన్స్‌లో 30 పని గంటల విధానం అమల్లో ఉంది. 55,493 డాలర్లతో అత్యధిక తలసరి జీడీపీ ఉన్న దేశాల్లో ఇదొకటి. ఈ నేపథ్యంలో పని గంటల విషయంలో ఒక బ్యాలెన్స్‌డ్‌ విధానాన్ని అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. పశ్చిమ దేశాల్లోలాగా 35 గంటలు కాకుండా.. అలా అని మరీ 70 గంటలు కూడా కాకుండా.. వారానికి 48 గంటలు పనిచేయాలని సూచిస్తున్నారు. తద్వారా ఇటు పనితో పాటు శారీరక, మానసిన ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టేందుకు సమయం లభిస్తుందంటున్నారు.

ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. భారత్‌లో ఉత్పాదకత ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని నారాయణ మూర్తి (Narayana Murthy) అన్నారు. దీనికి పరిష్కారంగా దేశ యువత వారానికి 70 గంటలు పనిచేయడానికి సంసిద్ధులు కావాలని సూచించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్‌ వంటి దేశాలు ఇదే సూత్రాన్ని పాటించాయని వివరించారు. ఈ ప్రతిపాదనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలా మంది పారిశ్రామిక వేత్తలు దీనిపై స్పందించారు. తమ అభిప్రాయాలను వెల్లడించారు. అయితే, సుదీర్ఘ పనిగంటలపై చర్చ జరగడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ పలువురు ప్రముఖులు రకరకాల సూచనలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని