IRCTC: ₹6 వేలకే తిరుమల, కాణిపాకం దర్శనం.. IRCTC ప్యాకేజీ వివరాలు ఇవే..!

IRCTC tour package: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్లాన్‌ చేస్తున్నారా? అయితే ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ టూర్‌ ప్యాకేజీపై ఓ లుక్కేయండి..

Published : 24 Nov 2023 01:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుడితో పాటు కాణిపాకం వినాయకుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా? తక్కువ వ్యవధిలో ఈ ఆలయాలన్నీ చుట్టి రావాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. యాత్రికులకు ప్రయాణంతో పాటు దర్శన భాగ్యం కల్పిస్తూ ‘సప్తగిరి’ పేరుతో ఈ టూరింగ్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది.

రెండు తెలుగు రాష్ట్రాల గుండా ఈ రైలు ప్రయాణిస్తుంది. కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. టూర్‌ అనంతరం అయా రైల్వే స్టేషన్లలో దిగే వెసులుబాటు ఉంది. ఈ టూర్‌ మొత్తం మూడు రాత్రులు నాలుగు పగళ్లు కొనసాగుతుంది. ప్రస్తుతానికి  డిసెంబరు 7, 14 తేదీల ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. టికెట్‌ ధరలు రూ.5 వేల నుంచి ప్రారంభమవుతాయి.

ప్రయాణం ఇలా..

 • మొదటి రోజు కరీంనగర్‌ (ట్రైన్‌ నం- 12762)లో రాత్రి 7:15 గంటలకు రైలు బయల్దేరుతుంది. పెద్దపల్లి, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ మీదుగా ప్రయాణం సాగుతుంది.
 • రెండో రోజు ఉదయం తిరుపతి చేరుకుంటారు. అక్కడ ముందుగా బుక్‌ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. అల్పాహారం అనంతరం శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుచానూరు ఆలయాలను వీక్షిస్తారు. దర్శనం అనంతరం తిరిగి హోటల్‌ చేరుకుంటారు. ఆ రాత్రి తిరుపతిలోనే బస ఉంటుంది.
 • మూడో రోజు స్వామి వారిని దర్శించు కోవటానికి ప్రత్యేక దర్శన టికెట్లు ఏర్పాటు చేస్తారు. ఉదయం తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకొని తిరుపతి రైల్వేస్టేషన్‌ చేరుకుంటారు. రాత్రి 8:15 గంటలకు రైలు (ట్రైన్‌ నెం- 12761)లో తిరుగు పయమనవుతారు.
 • నాలుగోరోజు ఆయా స్టేషన్లలో ట్రైన్‌ స్టాపింగ్‌ ఉంటుంది. మీ స్టేషన్‌ చేరుకోవటంలో యాత్ర పూర్తవుతుంది.

ఇవి గుర్తుంచుకోండి..

 • తిరుమల వెళ్లి రావడానికి రైలు టికెట్లు (3 ఏసీ, స్టాండర్డ్‌ క్లాస్‌) ప్యాకేజీలో అంతర్భాగంగా ఉంటాయి.
 • ఏసీ గదిలో బస, ఏసీ రవాణా సదుపాయం
 • రెండు రోజులు ఉదయం టిఫిన్ మాత్రమే ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేస్తుంది.
 • తిరుమల ప్రత్యేక దర్శన టికెట్లు, కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూరు ఆలయాల దర్శన టికెట్లూ ప్యాకేజీలో భాగమే.
 • టూర్‌ గైడ్, ప్రయాణ బీమా సదుపాయం ఉంటుంది.
 • ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే భక్తులే చెల్లించాలి.
 • తిరుమల్లో శ్రీవారిని దర్శించుకోవాలంటే స్త్రీ, పురుషులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది.

ప్యాకేజీ వివరాలు ఇలా..

 • స్టాండర్డ్‌లో (స్లీపర్‌ బెర్త్‌), రూమ్‌ సింగిల్ షేరింగ్ అయితే రూ.7,120, ట్విన్ షేరింగ్‌కు రూ.5,740, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.5,660. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.5,250, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.4,810 చెల్లించాలి.
 • కంఫర్ట్‌లో (థర్డ్‌ ఏసీ బెర్త్‌) సింగిల్ షేరింగ్‌కు రూ.9,010, ట్విన్ షేరింగ్‌కు రూ.7,640, ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.7,560 చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.5,250, అలాగే విత్ అవుట్ బెడ్ అయితే రూ.4,870 చెల్లించాలి.
 • ప్రయాణానికి 15 రోజుల ముందు ప్రయాణం రద్దు చేసుకుంటే ఒక్కో టికెట్‌కు క్యాన్సిలేషన్‌ కింద రూ.250 మినహాయించి మిగతా మొత్తాన్ని రీఫండ్‌ చేస్తారు. అదే 8 - 14 రోజుల ముందు రద్దు చేసుకుంటే 25 శాతం, 4 - 7 రోజుల ముందు రద్దు చేసుకుంటే 50 శాతం టికెట్‌ ధర నుంచి మినహాయిస్తారు. అయితే, ప్రయాణానికి నాలుగు రోజుల కంటే తక్కువ సమయంలో రద్దు చేసుకొంటే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు.

ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్‌ కోసం క్లిక్‌ చేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని