ఈవీలపై టాటా మోటార్స్‌ డిస్కౌంట్‌.. ₹1.2 లక్షల వరకు తగ్గింపు

Tata motors: టాటా మోటార్స్‌ తన విద్యుత్‌ కార్లపై డిస్కౌంట్‌ ప్రకటించింది. నెక్సాన్‌, టియాగో మోడళ్లపై రూ.1.2 లక్షల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది.

Published : 13 Feb 2024 16:20 IST

Tata motors | దిల్లీ: విద్యుత్‌ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ (Tata motors) గుడ్‌న్యూస్‌ చెప్పింది. నెక్సాన్‌.ఈవీ, టియాగో.ఈవీలపై రూ.1.2 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. బ్యాటరీ వ్యయం తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నెక్సాన్‌.ఈవీపై గరిష్ఠంగా రూ.1.2 లక్షలు తగ్గిస్తున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటిచింది. దీంతో ఈ మోడల్‌ ధర రూ.14.49 లక్షలు నుంచి ప్రారంభం అవుతుంది. టియాగో.ఈవీపై రూ.70 వేల మేర డిస్కౌంట్‌ ప్రకటించింది. ఇకపై ఈ మోడల్‌ ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ పేర్కొంది. ఇటీవల విడుదల చేసిన పంచ్‌.ఈవీ ధరను మాత్రం స్థిరంగా ఉంచింది.

‘డాల్బీ అట్మోస్‌ హెచ్‌డీఆర్‌’కి అదనపు రుసుము!

‘‘ఈవీల ధరల్లో బ్యాటరీకయ్యే ఖర్చే సింహ భాగం ఉంటుంది. ఇటీవల కాలంలో బ్యాటరీ సెల్స్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి. భవిష్యత్‌లోనూ వీటి ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నాం. ఆ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయించాం’’ అని టాటా ప్యాసెంజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ వివేక్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఈవీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో వాటిని మరింత అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రయత్నంలో భాగంగా ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

దేశీయంగా విద్యుత్‌ వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని టాటా మోటార్స్‌ పేర్కొంది. 2023లో ప్రయాణ వాహనాల విక్రయాల్లో 8 శాతం వృద్ధి నమోదవగా.. ఈవీ సెగ్మెంట్‌లో 90 శాతం వృద్ధి నమోదైంది. 2024 జనవరిలో ఈవీ విక్రయాల్లో 100 శాతం విక్రయాలు పెరిగాయి. ప్రస్తుతం ఈవీ సెగ్మెంట్‌లో టాటా మోటార్స్‌ 70 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని