Amazon Prime: ‘డాల్బీ అట్మోస్‌ హెచ్‌డీఆర్‌’కి అదనపు రుసుము!

అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లు యాడ్‌-ఫ్రీ, డాల్బీ అట్మోస్‌ హెచ్‌డీఆర్‌తో కంటెంట్‌ను వీక్షించేందుకు అదనపు రుసుము చెల్లించాలని సంస్థ తెలిపింది. 

Published : 13 Feb 2024 12:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ నెట్‌ఫ్లిక్స్‌( Netflix), డిస్నీ+ హాట్‌స్టార్‌(Disney+ Hotstar), అమెజాన్‌ ప్రైమ్‌(Amazon Prime)లు సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకునేందుకు గత ఏడాది కాలంగా సర్వీస్‌ నిబంధనల్లో మార్పులు చేస్తున్నాయి. ఇప్పటికే పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై నెట్‌ఫ్లిక్స్‌ ఆంక్షలు విధించింది. త్వరలో అమెజాన్‌ ప్రైమ్‌ ప్రీమియం సర్వీస్‌లకు అదనపు రుసుము వసూలు చేయనుంది. సాధారణ యూజర్లు యాడ్‌-ఫ్రీ, డాల్బీ విజన్‌ హెచ్‌డీఆర్‌, డాల్బీ అట్మోస్‌ ఆడియోతో కంటెంట్‌ వీక్షించాలంటే అదనంగా 2.99 డాలర్లు చెల్లించాలని సంస్థ అధికార ప్రతినిధి కేటీ బార్కర్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ నిబంధన విదేశాల్లోని యూజర్లకు అమల్లో ఉన్నట్లు ది వెర్గ్‌ సంస్థ పేర్కొంది. రాబోయే రోజుల్లో భారతీయ యూజర్లకు వర్తింప చేసే అవకాశం ఉందని తెలిపింది.

భారత్‌లో అమెజాన్‌ ప్రైమ్‌ ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ ధర రూ.1,499 కాగా, నెలవారీ రుసుము రూ.299గా ఉంది. ఇక మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌కి రూ.599, యాన్యువల్‌ ప్రైమ్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌కి రూ.799 చెల్లించాలి. డాల్బీ విజన్‌ హెచ్‌డీఆర్‌, యాడ్‌-ఫ్రీ నిబంధన అమల్లోకి వస్తే.. ప్రస్తుతం ఉన్న ధరలకు అదనంగా సుమారు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు భారతీయ యూజర్లను ఆకట్టుకునేందుకు ఓటీటీ సంస్థలు ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ ప్లాన్‌ (నెలకు రూ. 149), అమెజాన్‌ యాన్యువల్‌ ప్రైమ్‌ లైట్‌లను ప్రవేశపెట్టాయి. డిస్నీ+ హాట్‌స్టార్‌ కూడా ఈ ఏడాది నుంచి పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై పరిమితి విధించడంతోపాటు, మార్చి నుంచి కొత్త విధివిధానాలను అమలు చేస్తుందని గతేడాది ఆగస్టులో కంపెనీ సీఈవో బాబ్‌ ఐగర్‌ ప్రకటించారు. 

గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ పొద్దున్నే ఏం చదువుతారో తెలుసా?

డాల్బీ అట్మోస్‌ ఎలా ప‌నిచేస్తుందంటే?

సాధార‌ణ ఆడియో టెక్నాల‌జీలు ఛానెల్స్ ద్వారా సౌండ్‌ను వ్యాపింప చేస్తాయి. ఏదైనా ఒక ఛానెల్‌లో స‌మ‌స్య ఉన్నా.. సౌండ్ క్లారిటీ ఉండదు. డాల్బీ అట్మోస్‌ సాంకేతికత ఆడియోను ఆబ్జెక్ట్స్‌గా క్రియేట్ చేసి డివైజ్‌లకు అనుకూలంగా అందిస్తుంది. ఎత్తు ఆధారంగా ఇది పనిచేస్తుంది. స్పీకర్స్‌ను ఎత్తులో ఉంచితే.. డాల్బీ అట్మోస్‌ పనితీరు మెరుగ్గా ఉంటుంది. ప్ర‌స్తుతం స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, హెడ్‌ఫోన్స్‌లో కూడా ఈ టెక్నాలజీని ఇస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ డాల్బీ అట్మోస్‌ సౌండ్ సిస్ట‌మ్‌తో మూవీస్‌, వీడియోల‌ను రిలీజ్ చేస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని