Tata Punch EV: టాటా పంచ్‌ ఈవీ వచ్చేసింది.. సింగిల్‌ ఛార్జ్‌తో 421km రేంజ్‌

Tata Punch EV: టాటా మోటార్స్‌ నుంచి పంచ్‌ ఈవీ విడుదలైంది. దీని ప్రారంభ ధర రూ.10.99 లక్షలు. సింగిల్‌ ఛార్జ్‌తో గరిష్ఠంగా 421 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది.

Updated : 17 Jan 2024 15:34 IST

Tata Punch EV | ఇంటర్నెట్‌ డెస్క్‌: టాటా మోటార్స్ (Tata motors) అనుబంధ టాటా పాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ మరో కొత్త విద్యుత్‌ కారును విడుదల చేసింది. టాటా పంచ్‌ ఈవీ (Tata Punch EV) పేరుతో కొత్త వాహనాన్ని పరిచయం చేసింది. దీని ధర రూ.10.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌) నుంచి ప్రారంభం అవుతుంది. టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ ధర రూ.14.49 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ధరలు లిమిటెడ్‌ పీరియడ్‌ మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే ఈ కారు బుకింగ్స్‌ ప్రారంభం కాగా.. జనవరి 22 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

టాటా అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్‌ ప్యూర్‌ ఈవీ ఆర్కిటెక్చర్‌పై పంచ్‌ ఈవీ రూపొందింది. ఈ కారు స్టాండర్డ్‌, లాంగ్‌ రేంజ్‌ వేరియంట్లలో లభిస్తుంది. స్టాండర్డ్‌ వేరియంట్‌లో 25kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది సింగిల్‌ ఛార్జ్‌తో 315 కిలోమీటర్లు (MIDC) రేంజ్‌ ఇస్తుంది. లాంగ్ రేంజ్‌ మోడల్‌లో 35 kWh బ్యాటరీ ప్యాక్‌ ఇస్తున్నారు. ఇది సింగిల్‌ ఛార్జ్‌పై 421 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మోటార్‌, బ్యాటరీ ప్యాక్‌ ఐపీ67 రేటింగ్‌తో వస్తున్నాయి. ఎనిమిదేళ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల (ఏది ముందైతే అది) వారెంటీతో వస్తోంది.

Fastag: మీ ఫాస్టాగ్‌ స్టేటస్‌ ఏంటి? కేవైసీ ఎలా పూర్తి చేయాలి?

టాటా స్టాండర్డ్‌ వేరియంట్‌ను 3.3kW ఏసీ హోమ్‌ వాల్‌ బాక్స్‌తో అయితే 9.4 గంటలు ఛార్జ్‌ చేయాల్సి ఉంటుంది. అదే 7.2kW ఏసీ హోమ్ వాల్‌ బాక్స్‌ ఛార్జర్‌తో అయితే 3.6 గంటలు, 15ఏ ప్లగ్‌తో అయితే 9.4 గంటలు ఛార్జ్‌ చేయాల్సి ఉంటుంది. 50kW డీసీ ఫాస్ట్‌ ఛార్జర్‌తో కేవలం 56 నిమిషాల్లోనే 10-80 శాతం ఛార్జ్‌ చేయొచ్చని కంపెనీ పేర్కొంది. లాంగ్‌ రేంజ్‌ వేరియంట్‌ను 3.3 kW ఏసీ హోమ్‌ ఛార్జర్‌ బాక్స్‌ లేదా 15ఏ ప్లగ్‌పాయింట్‌తో ఛార్జ్‌ చేయాల్సి వస్తే 10-100 శాతం ఛార్జ్‌ అవ్వడానికి 13.5 గంటల సమయం పడుతుంది. 7.2kW ఏసీ హోమ్‌ వాల్‌బాక్స్‌ ఛార్జర్‌తో అయితే 5 గంటలు, 50kW డీసీ ఫాస్ట్‌ ఛార్జర్‌తో అయితే కేవలం 56 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జ్‌ చేయొచ్చని టాటా మోటార్స్‌ పేర్కొంది.

పంచ్‌ ఈవీ స్మార్ట్‌, స్మార్ట్‌+, అడ్వెంచర్‌, ఎంపవర్డ్‌, ఎంపవర్డ్‌+ పేరిట మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ఎకో, సిటీ, స్పోర్ట్స్‌ పేరిట మూడు డ్రైవింగ్ మోడ్స్‌ ఉన్నాయి. 190 ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఈ కారు సొంతం. ఎంపవర్డ్‌ రెడ్‌, సీవీడ్‌, ఫియర్‌లెస్‌ రెడ్‌, డేటోనా గ్రే, ప్రిస్టైన్‌ వైట్‌ రంగుల్లో లభిస్తుంది. ఇందులో 16 అంగుళాల డైమండ్‌కట్‌ అల్లాయ్‌ వీల్స్‌ ఉన్నాయి. క్యాబిన్‌ను విశాలంగా ఉండేలా తీర్చిదిద్దారు. వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్స్‌, ఏక్యూఐ డిస్‌ప్లేతో కూడిన ఎయిర్‌ప్యూరిఫైయర్‌, వాయిస్‌ అసిస్టెంట్‌తో కూడిన ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, యూఎస్‌బీ టైప్‌-సి ఫాస్ట్‌ ఛార్జింగ్‌ పోర్ట్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. 10.25 అంగుళాల టచ్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, 10 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ర్టుమెంట్‌ క్లస్టర్‌ ఇచ్చారు. ఆరు వేర్వేరు భాషల్లో 200 వాయిస్‌ కమాండ్స్‌కు ఇది సపోర్ట్‌ చేస్తుంది. వైర్‌లెస్‌ స్మార్ట్‌ఛార్జర్‌ సదుపాయం కూడా ఉంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులను ఇస్తున్నారు. SOS కాలింగ్‌, ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌, 360 డిగ్రీ సరౌండ్‌ వ్యూ కెమెరా సిస్టమ్‌, బ్లైండ్‌ స్పాట్‌ మానిటర్‌ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లను టాటా ఆఫర్‌ చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని