e-Luna: ఈ ఐకానిక్‌ టూవీలర్స్‌ మళ్లీ వస్తున్నాయ్‌!

బజాజ్‌ చేతక్‌ బాటలోనే మరో రెండు కంపెనీలు సరికొత్త ప్రయాణానికి సిద్ధమయ్యాయి. కెనటిక్‌, ఎల్‌ఎంఎల్‌ కంపెనీలు రీ ఎంట్రీ ఇవ్వనున్నాయి. త్వరలో విద్యుత్‌ ద్విచక్ర వాహనాలు తీసుకురాబోతున్నాయి.

Updated : 24 Jan 2024 20:14 IST

Two wheelers | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు టూవీలర్‌ మార్కెట్‌ను ఏలిన కొన్ని మోడళ్లు వివిధ కారణాలతో కాలగర్భంలో కలిసిపోయాయి. ఉత్పత్తి నిలిచిపోయినా వాటి పేర్లు మాత్రం చాలామంది మదిలో ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. మార్కెట్లోకి కొత్తగా ఎన్ని మోటార్‌ సైకిళ్లు, స్కూటర్లు వచ్చినా.. వాటికున్న ఆ గుర్తింపే వేరు. ఎప్పుడైనా రోడ్డుపై కనిపిస్తే ‘ఇదే మా ఫస్ట్‌ బైక్‌’.. ‘దీనిపైనే మా నాన్న స్కూలుకు తీసుకెళ్లేవారు’ అంటూ ఇప్పటికీ గుర్తు చేసుకునేవారెందరో. అలా అంతరించిపోయిన బ్రాండ్లు మళ్లీ పురుడు పోసుకుంటున్నాయి. మళ్లీ కొత్త అవతారంలో రీఎంట్రీ ఇస్తున్నాయి.

లూనా.. ఈ పేరు చాలామందికి గుర్తే. సైకిల్‌కు, మోటార్‌సైకిల్‌కు మధ్యస్థంగా ఉండే ఈ 50 సీసీ మోపెడ్‌ ఒకప్పుడు ప్రతిచోటా దర్శనమిచ్చేది. ఈ శతాబ్దం ప్రారంభంలో లూనా ఉత్పత్తిని కైనటిక్‌ నిలిపివేసింది. ఇప్పటితరానికి బహుశా దీని గురించి పరిచయం కూడా ఉండకపోవచ్చు. అలాంటి లూనా మళ్లీ రోడ్లపైకి రానుంది. ఇ-లూనా (e-Luna) రూపంలో ఎంట్రీ ఇవ్వనుంది. ఫిబ్రవరిలో దీన్ని లాంచ్‌ చేయనున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కైనటిక్‌ గ్రీన్‌ సంస్థ దీన్ని తీసుకొస్తోంది.

అమ్మకానికి ‘అమెజాన్‌’ పుట్టినిల్లు..!

మార్కెట్‌ పోటీని తట్టుకోలేక కనుమరుగైన మరో బ్రాండ్‌ ఎల్‌ఎంఎల్‌ (LML). దీని పూర్తి పేరు లోహియా మెషినరీ లిమిటెడ్‌. ఒకప్పుడు బజాజ్‌ చేతక్‌కు పోటీగా స్కూటర్‌తో పాటు, బైకులను విడుదల చేసిన కంపెనీ.. తర్వాత దివాలా తీసింది. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ రూపంలో మళ్లీ రాబోతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్టార్‌ పేరిట ప్రీమియం సెగ్మెంట్లో ఓ విద్యుత్‌ స్కూటర్‌ను ఎల్‌ఎంఎల్‌ తీసుకురానుంది.

ఓ విధంగా ఈ రెండు కంపెనీలకు బజాజ్‌ స్ఫూర్తి అని చెప్పాలి. ఒకప్పుడు చేతక్‌ పేరిట ఫ్యామిలీ స్కూటర్లను విక్రయించిన బజాజ్‌.. తర్వాత దాని ఉత్పత్తిని నిలిపివేసింది. చేతక్‌కు ఉన్న బ్రాండ్‌ నేమ్‌ను వినియోగించుకునేందుకు చేతక్‌ పేరుతో విద్యుత్‌ స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఆ పేరు ఓ విధంగా బజాజ్‌కు బాగానే ఉపయోగపడింది. ఇదే తరహాలో కైనటిక్‌ గ్రీన్‌, ఎల్‌ఎంఎల్‌ సంస్థలు కొత్త అవతారంతో విద్యుత్‌ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. ఇప్పటికే ఈ మార్కెట్లో ఓలా, టీవీఎస్‌, బజాజ్‌, ఏథర్‌ దూసుకెళ్తున్నాయి. హోండా, యమహా, సుజుకీ సైతం త్వరలో ఈ సెగ్మెంట్లోకి అడుగుపెట్టనున్నాయి. మరి ఐకానిక్‌ బ్రాండ్లు ఏమేర రాణిస్తాయో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు