Xiaomi India: షావోమీ ఇండియాలో భారీగా కోతలు..

Layoffs in Xiaomi India: కరోనా మహమ్మారి తర్వాత అనేక రంగాల్లో దిగ్గజ కంపెనీలు లేఆఫ్‌ల బాట పట్టాయి. తాజాగా ఈ జాబితాలో షావోమీ ఇండియా కూడా చేరింది. ఉద్యోగుల సంఖ్యను 1000 దిగువకు తగ్గించేందుకు సిద్ధమైంది.

Published : 29 Jun 2023 14:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన దిగ్గజ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ షావోమీ గత కొంతకాలంగా భారత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈడీ కేసులతో పాటు మార్కెట్‌ షేరు కూడా పడిపోవడంతో షావోమీ ఇండియా (Xiaomi India) సంస్థలో మార్పులకు సిద్ధమైంది. దీనిలో భాగంగానే భారీగా లేఆఫ్‌లు (Layoffs) విధిస్తోంది. తన కంపెనీలో ఉద్యోగుల సంఖ్యను 1000 దిగువకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు ఓ ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది.

ఈ ఏడాది ఆరంభం నాటికి షావోమీ ఇండియా (Xiaomi India)లో దాదాపు 1400 - 1500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇటీవల ఇందులో 30 మందిని కంపెనీ తొలగించింది. రానున్న రోజుల్లో మరింత మందికి పింక్‌ స్లిప్‌లు అందే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సంస్థ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను 1000 దిగువకు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. దీనిపై షావోమీ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఇతర కంపెనీల మాదిరిగానే.. సంస్థ మార్కెట్‌ స్థితి, వ్యాపార అంచనాల ఆధారంగా ఉద్యోగుల సంఖ్యపై మేం నిర్ణయాలు తీసుకుంటున్నాం. మాకు సిబ్బంది అవసరమైనప్పుడు తప్పకుండా మళ్లీ నియామకాలు చేపడుతాం’’ అని చెప్పినట్లు సదరు కథనం వెల్లడించింది. కాగా.. షావోమీ ఇండియాలో పునర్‌వ్యవస్థీకరణ బాధ్యతలను చైనాలోని మాతృక సంస్థే చూస్తుందని, నిర్ణయాలన్నీ అక్కడి నుంచే అమలవుతున్నాయని సమాచారం.

గత కొన్ని రోజులుగా భారత్‌లో షావోమీ (Xiaomi India) విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. మార్కెట్‌ షేరు కూడా పడిపోయింది. గత రెండు త్రైమాసికాల్లో మార్కెట్‌ షేరులో షావోమీ ఇండియా అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. 2023 తొలి త్రైమాసికంలో కంపెనీ ఎగుమతులు కూడా 7-8 మిలియన్ల నుంచి 5 మిలియన్లకు తగ్గాయి. దీనికి తోడు ఫెమా(విదేశీ మారక చట్టం) నిబంధనల ఉల్లంఘనల కింద షావోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన బ్యాంకు ఖాతాల్లోని రూ.5551.27కోట్ల డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు గతేడాది జప్తు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో 10శాతం మందిని తొలగించనున్నట్లు గతేడాది డిసెంబరులో షావోమీ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని