సంక్షిప్త వార్తలు(7)

అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌కు (ఏపీఎస్‌ఈజెడ్‌) ‘ఏఏఏ’ రేటింగ్‌ను కేర్‌ రేటింగ్స్‌ ఇచ్చింది. తద్వారా ఈ రేటింగ్‌ పొందిన తొలి దిగ్గజ ప్రైవేట్‌ మౌలిక రంగ సంస్థగా నిలిచినట్లు ఏపీఎస్‌ఈజెడ్‌ తెలిపింది.

Published : 02 May 2024 02:16 IST

అదానీ పోర్ట్స్‌కు ఏఏఏ రేటింగ్‌

దిల్లీ: అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌కు (ఏపీఎస్‌ఈజెడ్‌) ‘ఏఏఏ’ రేటింగ్‌ను కేర్‌ రేటింగ్స్‌ ఇచ్చింది. తద్వారా ఈ రేటింగ్‌ పొందిన తొలి దిగ్గజ ప్రైవేట్‌ మౌలిక రంగ సంస్థగా నిలిచినట్లు ఏపీఎస్‌ఈజెడ్‌ తెలిపింది. ‘కంపెనీకున్న అనుసంధాన వ్యాపార విధానం, పరిశ్రమలో బలమైన స్థానం, మర్కెట్‌ వాటా వృద్ధిలో స్థిరత్వం, మెరుగైన లాభదాయకత, అధిక ద్రవ్యలభ్యత, తక్కువ రుణ భారం లాంటివి ఏపీఎస్‌ఈజెడ్‌ ఈ రేటింగ్‌ను పొందేందుకు కారణం అయ్యాయ’ని వెల్లడించింది.


వాణిజ్య గ్యాస్‌ సిలిండరు ధర రూ.19 తగ్గింది

హైదరాబాద్‌: వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల గ్యాస్‌ సిలిండరు ధరను ఈనెల 1 నుంచి రూ.19 మేర తగ్గించినట్లు చమురు మార్కెటింగ్‌ సంస్థలు తెలిపాయి. ఇప్పటివరకు రూ.1994.50 గా ఉన్న ఈ సిలిండరు ధర ప్రస్తుతం రూ.1,975.50కు చేరింది. 

  • విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధర స్వల్పంగా పెరిగింది. దిల్లీలో 0.7% (రూ.749.25) పెరగడంతో కిలోలీటరు ధర రూ.1,01,642.88కు చేరింది.
  •  దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై అదాటు లాభాల పన్ను (విండ్‌ఫాల్‌ టాక్స్‌)ను టన్నుకు రూ.9,600 నుంచి రూ.8,400కు తగ్గించారు.

అమెరికా వడ్డీ రేట్లు మారలేదు

వాషింగ్టన్‌: వరుసగా ఆరో సమీక్షలోనూ అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ తన వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. మార్కెట్‌ వర్గాల అంచనాలకు తగ్గట్లుగానే 23 ఏళ్ల గరిష్ఠ స్థాయి అయిన 5.25-5.50 శాతంగా కొనసాగించింది. ద్రవ్యోల్బణ  తాజా గణాంకాలు అంచనాలకు మించి 3.7 శాతంగా నమోదు కావడమే ఇందుకు నేపథ్యం. 2022 మార్చి తర్వాత విధాన రేటును 11 సార్లు పెంచుతూ 5.25 శాతానికి చేర్చిన ఫెడ్‌, 2023 జులై నుంచి యథాతథంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని 2% లోపునకు తీసుకురావాలన్నది ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌ఓఎమ్‌సీ) లక్ష్యం. ఆర్థిక భవిష్యత్‌ అంచనాలు అనిశ్చితిగా ఉన్నందున, రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే కమిటీ మొగ్గు చూపింది.
నేటి బోర్డు సమావేశాలు: అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, కోల్‌ ఇండియా, డాబర్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, కోఫోర్జ్‌, బ్లూస్టార్‌, అజంతా ఫార్మా


టాటా మోటార్స్‌కు రూ.25 కోట్ల పన్ను నోటీసు

దిల్లీ: జరిమానా, వడ్డీతో కలిపి సుమారు రూ.25 కోట్లు చెల్లించాలంటూ టాటా మోటార్స్‌కు పన్ను నోటీసు వచ్చింది. పన్ను మొత్తంలో కొంత తగ్గించి చెల్లించడం, పరిమితికి మించి రుణం పొందడాన్ని పరిగణనలోకి తీసుకుని సీజీఎస్‌టీ/ ఎస్‌జీఎస్‌టీ చట్టం- 2017లోని సెక్షన్‌ 73 కింద పన్ను అధికారులు ఈ నోటీసులు పంపినట్లు టాటా మోటార్స్‌ ధ్రువీకరించింది. ఇందులో పన్ను మొత్తం రూ.14,25,68,173 కాగా.. వడ్డీ రూ.9,14,15,704, జరిమానా రూ.1,42,56,815. ‘పన్ను నోటీసును కంపెనీ పరిశీలిస్తోంది. దీనిపై అప్పీల్‌ చేసుకునే హక్కును ఉపయోగించుకుంటామ’ని ఎక్స్ఛేంజీలకు టాటా మోటార్స్‌ తెలిపింది. ఈ నోటీసుల వల్ల కంపెనీ ఆర్థిక, నిర్వహణ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం పడదని స్పష్టం చేసింది.


ప్రతి నెలా ఒక కొత్త హోటల్‌  
ఫార్చూన్‌ హోటల్స్‌ ప్రణాళిక

దిల్లీ: ఐటీసీ హోటల్‌ గ్రూప్‌నకు చెందిన ఫార్చూన్‌ హోటల్స్‌ బ్రాండ్‌పై ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రతి నెలా ఒక కొత్త హోటల్‌ తెరవాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు కంపెనీ ఎండీ సమీర్‌ ఎంసీ బుధవారం వెల్లడించారు. నేపాల్‌లోని భక్తాపుర్‌లో తొలి అంతర్జాతీయ హోటల్‌ - ఫార్చూన్‌ రిసార్ట్‌ అండ్‌ వెల్‌నెస్‌ స్పాను ప్రారంభించిన సమీర్‌ ఈ విషయాన్ని తెలిపారు.  దక్షిణాసియా, సన్నిహిత విపణుల్లో తమ హోటళ్లను విస్తరిస్తామని పేర్కొన్నారు. కేవడియా (ఏక్తా నగర్‌, గుజరాత్‌), క్యాండోలిమ్‌ (గోవా), పాలంపుర్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌), బీచ్‌ రిసార్ట్‌ (చెన్నై) తదితర ప్రత్యేక గమ్యస్థానాల్లో కనీసం 4-6 హోటళ్లను ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో తెరుస్తామని వెల్లడించారు. అక్టోబరు - మార్చి మధ్య ఇదే సంఖ్యలో కొత్త హోటళ్లను ప్రారంభిస్తామని సమీర్‌ తెలిపారు.


అంబుజా సిమెంట్స్‌ లాభం రెట్టింపు

దిల్లీ: అదానీ గ్రూప్‌ సంస్థ అంబుజా సిమెంట్స్‌, మార్చి త్రైమాసికంలో రూ.1,525.78 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదుచేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.763.30 కోట్లతో పోలిస్తే, ఇది రెట్టింపు. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.7,965.98 కోట్ల నుంచి రూ.8,893.99 కోట్లకు పెరిగింది. గత త్రైమాసికంలో కొనుగోలు చేసిన సంఘీ ఇండస్ట్రీస్‌ ఆర్థిక ఫలితాలు ఇందులో కలిశాయని, దీంతో గత ఆర్థిక సంవత్సరంతో పోల్చిచూడలేమని కంపెనీ తెలిపింది. మార్చి త్రైమాసికంలో అంబుజా మొత్తం వ్యయాలు రూ.7,741.31 కోట్లుగా, మొత్తం ఆదాయం రూ.9,127.45 కోట్లుగా నమోదయ్యాయి. స్టాండలోన్‌ ప్రాతిపదికన కంపెనీ లాభం రూ.502.40 కోట్ల నుంచి రూ.532.29 కోట్లకు పెరిగింది. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.4,780.32 కోట్లుగా ఉంది. మొత్తం విక్రయాలు 16.6 మిలియన్‌ టన్నులకు చేరాయి.

రూ.2 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.2 డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది.


13% తగ్గిన అదానీ ఎనర్జీ లాభం

దిల్లీ: అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.381.29 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.439.60 కోట్లతో పోలిస్తే ఇది 13.26% తక్కువ. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.3,494.84 కోట్ల నుంచి రూ.4,855.18 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు కూడా రూ.3,200.50 కోట్ల నుంచి రూ.4,358.83 కోట్లకు చేరాయి. పూర్తి ఆర్థిక సంవత్సరం (2023-24)లో కంపెనీ లాభం రూ.1,195.61 కోట్లకు పరిమితమైంది. 2022-23లో లాభం రూ.1,280.60 కోట్లు కావడం గమనార్హం. అయితే మొత్తం ఆదాయం రూ.13,840.46 కోట్ల నుంచి రూ.17,218.31 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.13,164.32 కోట్ల నుంచి రూ.14,978.74 కోట్లకు చేరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని