Hyderabad: సోదరి నైటీలో వచ్చి చోరీ.. బెడిసి కొట్టిన సెక్యూరిటీ గార్డ్‌ ప్లాన్‌

సోదరి నైటీలో వచ్చి సికింద్రాబాద్‌లోని ఓ సెల్‌ఫోన్ల దుకాణంలో చోరీకి పాల్పడిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేశారు. 

Updated : 31 May 2023 17:20 IST

హైదరాబాద్‌: అతడు ఒక సెక్యూరిటీ గార్డు.. మొబైల్‌ షోరూమ్‌లో చోరీ చేయాలని పథకం వేశాడు. తనపై అనుమానం రాకుండా ఉద్యోగానికి ముందే సెలవు పెట్టాడు. తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు సోదరి నైటీలో వచ్చి దుకాణం తాళం పగులగొట్టి మొబైల్‌ ఫోన్లు దొంగిలించాడు. చివరకు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నుంచి రూ.8.28లక్షల విలువైన 37 రియల్‌ మీ ఫోన్లు, ఒక ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్‌ మహంకాళీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన చోరీ ఘటనకు సంబంధించిన వివరాలను ఏసీపీ రమేశ్‌, ఇన్‌స్పెక్టర్‌ కావేటి శ్రీనివాసులు, ఎస్‌ఐ శ్రీకాంత్‌ మీడియాకు వెల్లడించారు.

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లెకు చెందిన మంకాల యాకయ్య అలియాస్‌ వినయ్‌(28) తండ్రి చనిపోవడంతో ఉపాధి కోసం తల్లి, సోదరితో కలిసి ఐదేళ్ల కిత్రం నగరానికి వచ్చాడు. కంటోన్మెంట్‌ తాడ్‌బండ్, బాపూజీనగర్‌లో నివాసముంటూ సికింద్రాబాద్‌ ఎస్‌డీ రోడ్డులోని ఎమరాల్డ్‌ హౌస్‌లో నైట్‌ సెక్యూరిటీగార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం అతని సోదరి ప్రేమ వివాహం చేసుకొని వెళ్లిపోవడంతో తల్లితో కలిసి ఉంటున్నాడు.

పక్కా పథకంతో చోరీ..

గతంలో యాకయ్య రియల్‌ మీ మొబైల్‌ షోరూమ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేశాడు. ప్రస్తుతం పనిచేస్తున్న ఎమరాల్డ్‌ హౌస్‌ మొదటి అంతస్తులో కూడా రియల్‌ మీ షోరూమ్‌ ఉంది. అందులో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలుసుకుని చోరీ చేయాలని పథకం వేశాడు. మే 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పక్కాగా ప్లాన్‌ చేశాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ముందుగానే సొంతూరుకు వెళ్తున్నట్టు సెలవు పెట్టాడు. పక్కా ప్లాన్‌తో మే 28వ తేదీ రాత్రి 12.30 గంటలకు అతని సోదరి నైటీని ధరించి దుకాణం వద్దకు వెళ్లాడు. దుకాణానికి మరో వైపు మూసివేసి ఉన్న షట్టర్‌ తాళం పగులగొట్టి లోపలికి వెళ్లాడు. ట్యాబ్‌తో కలిపి 27 సెల్‌ఫోన్లు చోరీ చేసి సొంతూరు వెళ్లిపోయాడు.

నిందితుడు పోలీసులకు చిక్కింది ఇలా..

మే 29వ తేదీ ఉదయం మొబైల్‌ షోరూమ్‌లో చోరీ జరిగినట్లు స్టోర్‌ ఇన్‌ఛార్జి మహ్మద్‌ యూసుఫ్‌ మహంకాళీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలించగా నైటీలో ఒక మహిళ వచ్చినట్లుగా గుర్తించి దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డులను కూడా విచారించారు. ఇందులో భాగంగా యాకయ్యపై అనుమానం వచ్చి ఆ దిశలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం మహబూబాబాద్‌ జిల్లా మడిపల్లెలో నిందితుడిని అదుపులోకి తీసుకుని అక్కడే దాచిన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు