Agnipath Protest: సికింద్రాబాద్‌ అల్లర్ల కేసు... ఎట్టకేలకు ఆవుల సుబ్బారావు అరెస్టు

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్‌ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

Published : 24 Jun 2022 17:21 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్‌ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. అకాడమీలో పనిచేసే శివ, హరితో పాటు మరో నలుగురిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం జీఆర్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి బోయగూడలోని రైల్వే కోర్టులో హాజరుపర్చనున్నారు.

విధ్వంసంలో సుబ్బారావు శిష్యులదే ప్రధాన పాత్ర

ఈనెల 17న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన విధ్వంసంలో ఆవుల సుబ్బారావు పాత్ర ఉన్నట్టు పోలీసులు తేల్చారు. 16వ తేదీనే హైదరాబాద్‌ చేరుకున్న సుబ్బారావు.. ఆర్మీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువకులను రెచ్చగొట్టి రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించేలా పథక రచన చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇతనికి తెలుగు రాష్ట్రాల్లో డిఫెన్స్‌ అకాడమీలు ఉన్నాయి. అగ్నిపథ్‌ పథకం వల్ల కోచింగ్‌ సెంటర్లన్నీ మూతపడే పరిస్థితి నెలకొంటుందనే దురుద్దేశంతో యువకులను రెచ్చగొట్టినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈమేరకు హకీంపేట ఆర్మీ సోల్జర్స్‌ గ్రూప్‌లో పలు పోస్టులను ఆధారాలుగా చూపిస్తున్నారు. సాయిడిఫెన్స్‌ అకాడమీలో ఆర్మీ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్న పలువురు యువకులు విధ్వంసంలో ప్రధాన పాత్ర పోషించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసులో ఏ2గా ఉన్న పృథ్వీరాజ్‌ కూడా ఆవుల సుబ్బారావు శిష్యుడే.

మిగతా అకాడమీల డైరెక్టర్ల పాత్రపై ఆరా..

సాయి డిఫెన్స్‌ అకాడమీలో ఆర్మీ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకునే యువకులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. వసతికి సంబంధించి డబ్బులు వసూలు చేస్తారు. ఆర్మీ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల వద్ద రూ.2 లక్షల నుంచి 3లక్షల వరకు వసూలు చేస్తారు. ఇప్పటికే దేహదారుఢ్య, వైద్యపరీక్షలు పూర్తైన అభ్యర్థులు రాత పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్రం అగ్నిపథ్‌ ద్వారానే ఆర్మీ ఎంపికలు ఉంటాయని ప్రకటించగానే ఆవుల సుబ్బారావుతో పాటు మరి కొంత మంది డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్లు కలిసి విధ్వంసానికి కుట్ర పన్నినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. మిగతా అకాడమీలకు చెందిన డైరెక్టర్ల పాత్రపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని