Hyderabad: సీబీఐ అధికారుల్లా నటించి.. ప్రొఫెసర్‌ వద్ద రూ.కోటి కొట్టేశారు!

ముంబయి పోలీసు, సీబీఐ అధికారుల్లా నటించిన సైబర్‌ నేరగాళ్లు నగరానికి చెందిన ఓ వైద్య కళాశాల ప్రొఫెసర్‌ నుంచి రూ.99.35 లక్షలు కాజేశారు. 

Published : 06 Mar 2024 23:40 IST

హైదరాబాద్‌: ముంబయి పోలీసు, సీబీఐ అధికారుల్లా నటించిన సైబర్‌ నేరగాళ్లు నగరానికి చెందిన ఓ వైద్య కళాశాల ప్రొఫెసర్‌ నుంచి రూ.99.35 లక్షలు కాజేశారు. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టు వారెంటు జారీ అయ్యిందని బెదిరించి.. కేసు లేకుండా చూస్తామంటూ ఈ మొత్తం కొట్టేశారు. ఘటనపై నగర సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసు నమోదైంది.

హైదరాబాద్‌ చెందిన ప్రొఫెసర్‌ ఓ వైద్య కళాశాలలో పనిచేస్తున్నారు. ఫిబ్రవరిలో ఆయనకు కొత్త నంబరు నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. ముంబయిలోని కొలబా పోలీసు స్టేషన్‌ నుంచి మాట్లాడుతున్నామని, మీ ఆధార్‌ కార్డుపై మనీ లాండరింగ్‌ కేసు నమోదైందని చెప్పారు. వెంటనే వీడియో కాల్‌లో తమకు అందుబాటులోకి రావాలని చెప్పారు. ఆ తర్వాత సీబీఐ అధికారుల్లా నటిస్తూ మరికొందరు కాల్‌ చేశారు. కేసు నమోదైందని ఫోర్జరీ పత్రాలు, పోలీసు గుర్తింపు కార్డులు చూపించారు. కేసులో అరెస్టు వారెంటు లేకుండా సెటిల్‌ చేసుకోవాలంటే తమకు డబ్బు ఇవ్వాలని చెప్పారు. నిజమేనని భావించిన ప్రొఫెసర్‌ కాల్‌ చేసిన వ్యక్తులకు మూడు విడతల్లో రూ.99.35 లక్షలు పంపారు. అవతలి వ్యక్తులు పదేపదే నగదు అడగడంతో ఇదంతా మోసమని తెలుసుకున్నారు. సైబర్‌క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని