Fire accident: ముంబయి ఎల్టీటీ రైల్వే స్టేషన్‌ వద్ద అగ్నిప్రమాదం.. ‘జన్‌ ఆహార్‌’ కేంద్రంలో మంటలు!

ముంబయిలోని ఎల్టీటీ రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.

Published : 13 Dec 2023 17:46 IST

ముంబయి: దేశ ఆర్థిక రాజధానిగా పేర్కొనే ముంబయిలో ప్రఖ్యాత లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌ (ఎల్‌టీటీ) రైల్వే స్టేషన్‌ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాట్‌ ఫాం 1కు సమీపంలో రైల్వే స్టేషన్‌లోని క్యాంటీన్‌లో బుధవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన రైల్వే అధికారులు ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని ప్లాట్‌ఫాం నంబర్‌ 1 వెంబడి ఓవర్‌ హెడ్‌ వైర్లకు విద్యుత్‌ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో పలు రైళ్ల సర్వీసులు ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

ఎల్‌టీటీ రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలోని టికెట్‌ బుకింగ్‌ కేంద్రంపై తొలి అంతస్తులోని జన్‌ ఆహార్‌ కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం 2.45గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు సెంట్రల్‌ రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటన సమయంలో పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. ఆ సమయంలో ప్లాట్‌ఫాం నంబర్‌ 1లో ప్యాసింజర్‌ రైళ్లు లేవని మరో అధికారి చెప్పారు.  ఈ ఘటన నేపథ్యంలో టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు, అనౌన్స్‌మెంట్ సెంటర్లను ఖాళీ చేయించి అందరినీ సురక్షితంగా తరలించారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు ముంబయి పోలీసులు, ఇతర విభాగాలకు చెందిన భద్రతా సిబ్బంది పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు.  మధ్యాహ్నం 3.30గంటల వరకు మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు సెంట్రల్‌ రైల్వే సీపీఆర్వో వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని