Hyderabad: అగ్నికీలల మాటున ‘క్యూనెట్‌’ పాపం

సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ అగ్నికీలల మాటున మల్టీలెవల్‌ మార్కెటింగ్‌(ఎంఎల్‌ఎం) మాయాజాలం బహిర్గతమైంది. భారీ మొత్తాలను ఆశ చూపి అమాయకులకు వల వేస్తున్న ‘క్యూనెట్‌’ సంస్థ బాగోతం వెలుగులోకి వచ్చింది.

Updated : 18 Mar 2023 08:35 IST

మల్టీలెవల్‌ మార్కెటింగ్‌   మాయాజాలంలో బతుకులు బుగ్గి
‘స్వప్నలోక్‌’ మృతులంతా ఆ సంస్థకు   రూ.లక్షలు చెల్లించినవారే
జీతాలు సరిగా రాని కొలువులు  చేస్తూ అగ్నికి ఆహుతి
యువత స్వప్నాలు చెరిపేసిన ప్రమాదం
కుటుంబ కష్టాలు తీర్చకనే పరలోకాలకు

ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, నర్సంపేట, నేలకొండపల్లి: సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ అగ్నికీలల మాటున మల్టీలెవల్‌ మార్కెటింగ్‌(ఎంఎల్‌ఎం) మాయాజాలం బహిర్గతమైంది. భారీ మొత్తాలను ఆశ చూపి అమాయకులకు వల వేస్తున్న ‘క్యూనెట్‌’ సంస్థ బాగోతం వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదానికి ఆహుతైన ఆరుగురు ఈ సంస్థలోనే పనిచేస్తున్నట్లు తేలింది. ‘బీఎం5’ సంస్థ పేరిట కాల్‌సెంటర్‌ నిర్వహిస్తున్నా.. తెరవెనుక మాత్రం అక్కడ ఎంఎల్‌ఎం దందా సాగుతున్నట్లు వెల్లడవ్వడం చర్చనీయాంశమైంది. ఈ సంస్థపై గతం నుంచి తీవ్ర ఆరోపణలున్నప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తాజా దుర్ఘటనతో బయటపడింది. 40 మందికిపైగా యువతీయువకులు క్యూనెట్‌ కార్యాలయంలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ప్రమాదానికి 20 నిమిషాల ముందే చాలామంది అక్కడి నుంచి వెళ్లిపోగా.. ఆరుగురు గ్రూపులీడర్లు కావడంతో అక్కడే ఉండి ప్రాణాలు కోల్పోయారు. వీరందరివీ మధ్యతరగతి కుటుంబాలే. ప్రమాదంలో మృతిచెందిన వారంతా రెండు, మూడేళ్ల నుంచి క్యూనెట్‌లో ఏజెంట్లుగా చేరి పనిచేస్తున్నారు. సంస్థలో చేరేముందే ఒక్కొక్కరి నుంచి యాజమాన్యం రూ.1.5-3 లక్షల వరకు కట్టించుకుంటుందని మృతుల స్నేహితులు వెల్లడించారు. ‘ముందుగా చేరినవారు మరో ఇద్దర్ని చేర్పిస్తే కమీషన్‌ ఇస్తారు. సభ్యులు తొలుత రూ.30-40 వేలు అడ్వాన్సుగా కట్టాలి. తర్వాత విడతల వారీగా చెల్లించాలి. మావద్ద తీసుకున్న డబ్బులకు చిన్న వాచ్‌... డిన్నర్‌సెట్‌ లాంటివి చేతిలో పెడతారు. వాచ్‌ ఖరీదు రూ.50 వేలని చెబుతారు. అయితే అది రూ.2 వేలైనా ఉండదు. ఉద్యోగం మధ్యలో వదులుకోబోమని బాండ్‌ రాయించుకుంటారు. ఒకవేళ వెళ్లిపోవాలనుకుంటే మేము కట్టిన డబ్బులు ఇవ్వరు’ అని ఓ బాధితుడు వాపోయారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల నుంచీ ఈ సంస్థలో ఏజెంట్లు పనిచేస్తున్నారు. సికింద్రాబాద్‌, ఉప్పల్‌, మాదాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో సంస్థకు శాఖలున్నట్లు తెలుస్తోంది. అరచేతిలో వైకుంఠం చూపెడుతూ యువతను ఆకర్షిస్తూ బుట్టలో వేసుకుంటారు. ‘నేను రూ.2 లక్షలు కట్టాను. 5 నెలలుగా పైసా జీతం ఇవ్వలేదు. చేతి ఖర్చులకోసం ఇంటినుంచి మానాన్న రూ.3 వేలు పంపుతున్నారు. నా స్నేహితుల్ని ఏజెంట్లుగా చేర్పించినా.. కమీషన్‌ చెల్లించలేదు’ అని మరో యువతి వాపోయారు.


తాను చేరి.. తల్లిదండ్రులనూ చేర్పించి..

హబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం ఎర్రకుంటతండా సురేశ్‌నగర్‌కు చెందిన జాటోతు బుజ్జి-భద్రుకు ఒక్కగానొక్క కుమార్తె ప్రమీల(22). ఎకరా భూమిసాగుచేస్తూ భద్రు ఈమెను బీటెక్‌ చదివించారు. కుటుంబ కష్టాలను తొలగించాలని ప్రమీల హైదరాబాద్‌ వెళ్లారు. క్యూనెట్‌లో ఉద్యోగంలో చేరేందుకు రూ.3 లక్షలు కట్టారు. ఇతరులకు కంపెనీ గురించి చెప్పినా చేరకపోవడంతో.. మరో రూ.2 లక్షలు అప్పుచేసి తన తల్లిదండ్రులనే ఏజెంట్లుగా చేర్పించారు. గురువారం ప్రమీల.. తల్లికి ఫోన్‌ చేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పినవే చివరి మాటలయ్యాయి.


ఉపాధి వేటలో ఆగిన ఊపిరి

రంగల్‌ జిల్లా ఖానాపురం టేకులతండాకు చెందిన బానోతు పద్మ(రాంబాయి), నరసింహ దంపతులది నిరుపేద గిరిజన కుటుంబం. వీరికి కుమార్తెలు శ్రావణి(22), స్రవంతి, కుమారుడు రాజు. ఏడాది కిందట కుటుంబమంతా హైదరాబాద్‌కు వలస వచ్చింది. శ్రావణి డిగ్రీ పూర్తి కావడంతో స్నేహితుల సూచనతో రూ.3 లక్షలు అప్పుచేసి చెల్లించి క్యూనెట్‌లో చేరారు. నెలకు రూ.30 వేలు జీతం వస్తుండటంతో కుటుంబం ఒడ్డున పడుతుందనుకున్న తరుణంలోనే శ్రావణి మృత్యువాతపడ్డారు.


మాయమైన ‘వెన్నెల’ వెలుగులు

రంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లికి చెందిన వంగ లక్ష్మి-రవి దంపతుల కుమార్తె వెన్నెల(22). రవి దాసరిపల్లిలో కూలి పనులు చేస్తూ.. ఎకరా భూమి సాగు చేసేవారు. వెన్నెలను బీఎస్సీదాకా నర్సంపేటలో చదివించారు. డిగ్రీ పూర్తికాగానే వెన్నెల బిక్కాజిపల్లికి చెందిన బంధువుల ద్వారా రెండేళ్ల క్రితం క్యూనెట్‌లో చేరారు. ఇటీవల ఆ కుటుంబం ఇల్లు కట్టుకుంది. చివరిగా వెన్నెల గృహాప్రవేశానికి వచ్చి వెళ్లింది. అదే చివరి చూపని.. వెన్నెల మృతితో కుటుంబంలో వెలుగులు మాయమయ్యాయని తల్లిదండ్రులు విలపిస్తున్నారు.


జీవితంలో స్థిరపడకుండానే...

మ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్థేపల్లికి చెందిన కుంచం రామారావు-రమణలకు ఇద్దరు కుమార్తెలు. రామారావు ఆటోడ్రైవర్‌. తల్లి రమణ కూలీ. పెద్ద కుమార్తె త్రివేణి(22) కోదాడలో బీటెక్‌ పూర్తిచేశారు. తన స్నేహితురాలు క్యూనెట్‌లో పనిచేస్తుండటంతో త్రివేణి చేరారు.. అనంతరం తన సోదరి మమతనూ రెండు నెలల కిందట అందులోనే చేర్పించారు. జీవితంలో స్థిరపడేవరకు పెళ్లి వద్దని త్రివేణి తల్లిదండ్రులకు చెప్పారు. ఆ ఆశ తీరకుండానే ఆమె కన్నుమూశారు. రూ.1.5 లక్షలు కట్టించుకొని తమను ఉద్యోగంలో చేర్చుకున్నారని చెల్లి మమత తెలిపారు. తాము ప్రమాదంలో ఉన్నామని రక్షించమని తనకు ఫోన్‌లో అక్క త్రివేణి చెప్పినా.. అధికారులు సకాలంలో స్పందించలేదంటూ చెల్లి కన్నీటి పర్యంతమయ్యారు.


ఉగాది పండుగకు వస్తానని చెప్పి..

రంగల్‌ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లికి చెందిన ఉప్పుల రజిత-రాజు దంపతులకు కుమారుడు శివ(22), కూతురు సింధు ఉన్నారు. రాజు తాపీమేస్త్రీ పనితోపాటు ఎకరంన్నర భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. శివ హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. రూ.1.5 లక్షలు చెల్లించి క్యూనెట్‌లో చేరారు. కమీషన్‌, జీతం రాకపోయేసరికి ప్రతినెలా రాజు రూ.4 వేలు పంపిస్తున్నారు. శివ చెల్లెలు సింధు కూడా గతేడాది క్యూనెట్‌లో పనిచేసి జీతం రాకపోయేసరికి మానేశారు. గురువారం సింధు పుట్టినరోజు కావడంతో.. సాయంత్రం 4 గంటలకు తల్లి రజితతో ఫోన్‌లో మాట్లాడి.. ఉగాదికి వస్తానన్నారు. కొద్దిసేపయ్యాక వీడియోకాల్‌ చేస్తాననడమే చివరి మాటలయ్యాయని తల్లి రోదిస్తూ చెప్పారు.


25 రోజుల క్రితమే రూ.2.5 లక్షలు చెల్లించి..

హబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నెకు చెందిన ఉపేంద్ర-జనార్దన్‌ దంపతుల కుమారుడు ప్రశాంత్‌(23). మూడెకరాల్లో వ్యవసాయం చేసి డిగ్రీ వరకు చదివించారు. రెండుసార్లు ఆర్మీ ర్యాలీలో పాల్గొని ఉత్తీర్ణత సాధించి రాతపరీక్షకు అర్హత సాధించారు. కేంద్రం అగ్నిపథ్‌ను తీసుకురావడంతో ఆ అవకాశం కోల్పోయారు. పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ప్రైవేట్‌ ఉద్యోగంలో చేరి కుటుంబానికి ఆసరాగా ఉండాలనుకున్నారు. క్యూనెట్‌లో చేరేందుకు రూ.2.5 లక్షలు చెల్లించాల్సి రావడంతో తల్లిదండ్రులు అప్పటికప్పుడు తక్కువ ధరకే పత్తిని అమ్మగా రూ.50 వేలు వచ్చాయి. మరో రూ.2 లక్షలు అప్పుచేసి ప్రశాంత్‌కు ఇచ్చారు. 25 రోజుల క్రితమే ఉద్యోగంలో చేరి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని