కుప్పంలో వైకాపా వర్గాల ఘర్షణ.. ఒకరి పరిస్థితి విషమం

చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపాలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Published : 26 May 2023 04:16 IST

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపాలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం మేరకు.. పురపాలక మొదటి వైస్‌ ఛైర్మన్‌ మునస్వామి, కొత్తపేటకు చెందిన రెస్కో డైరెక్టర్‌ బాలాజీ తమ్ముడు, వైకాపా నాయకుడు వాసుల మధ్య శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో వివాదం తలెత్తింది. మంగళవారం కొత్తపేటకు వెళ్లిన అమ్మవారి శిరస్సు ఊరేగింపులో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ రోజుకు వివాదం సద్దుమణిగింది. అయితే మళ్లీ గురువారం ఉదయం ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. వాసు అనుచరులు మునస్వామికి చెందిన జేసీబీని ధ్వంసం చేయడంతో మునస్వామి వర్గీయులు వాసు ఇంటిపై దాడి చేసి కారు, 10 ద్విచక్రవాహనాలు, ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. గాయపడిన వాసు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా.. విషయం తెలుసుకున్న మునస్వామి వర్గీయులు అక్కడికీ చేరుకొని విచక్షణా రహితంగా కర్రలతో వాసు, అతని అనుచరుడు షణ్ముగంపై మళ్లీ దాడి చేశారు. వాసు తలకు తీవ్రగాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మునస్వామి వర్గీయులపై లాఠీలు ఝళిపిస్తూ.. చెదరగొట్టారు. మునస్వామి వర్గీయులను అదుపులోకి తీసుకొని కుప్పం అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇరువర్గాలపై హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ సుధాకరరెడ్డి చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు