చేయూత అంటూ సైబర్‌ మోసం.. యువతి ఖాతా నుంచి రూ. 82,697 మాయం

ఖాతాలో వైఎస్‌ఆర్‌ చేయూత నగదు పడుతుందంటూ నమ్మించి ఓ యువతి బ్యాంకు ఖాతా నుంచి రూ.82,697 కాజేసిన ఉదంతం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం ఉప్పేరులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

Updated : 22 Mar 2024 07:10 IST

ఉన్నతాధికారినంటూ వాలంటీర్‌కు ఫోన్‌
కాన్ఫరెన్స్‌ కాల్‌లో అతడు చెప్పినట్టు చేసిన బాధితురాలు

కుక్కునూరు, న్యూస్‌టుడే: ఖాతాలో వైఎస్‌ఆర్‌ చేయూత నగదు పడుతుందంటూ నమ్మించి ఓ యువతి బ్యాంకు ఖాతా నుంచి రూ.82,697 కాజేసిన ఉదంతం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం ఉప్పేరులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. దీనిపై బాధితురాలు పల్లం సంధ్యారాణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. యువతి తమ్ముడు నరేంద్రబాబుకు.. వాలంటీర్‌ ఎం.వెంకటేశ్‌ ఫోన్‌ చేశారు. వైఎస్‌ఆర్‌ చేయూత రూ.18,500 మీ ఖాతాలో పడుతుందని చెప్పారు. గ్రామ సచివాలయ అధికారి కాన్ఫరెన్సు కాల్‌లో ఉన్నారని, మీ ఫోన్‌పే నంబరు చెబితే నగదు జమచేస్తారని తెలిపారు. నరేంద్రబాబుకు ఫోన్‌పే లేకపోవడంతో తన సోదరి సంధ్యారాణి నంబరు చెప్పారు. దీంతో ఫోన్‌లైన్‌లో ఉన్న అవతలి వ్యక్తి మీ ఖాతాలో రూ.18,500 జమైనట్లు వస్తుంది చూడాలన్నారు. రాలేదని ఆమె చెప్పారు.

ఈ ప్రక్రియ ఒక నిమిషంలో పూర్తికావాలని, లేకుంటే జమ కాదని చెప్పి ఓటీపీ చెప్పించుకున్నారు. తర్వాత రూ.18,499 సక్సెస్‌ అంటూ కనిపించింది. రెండోసారి రూ.18,400, మూడోసారి రూ.18,399, నాలుగోసారి రూ.18,399, అయిదోసారి రూ.9000 సక్సెస్‌ అని వచ్చింది. అయితే, మొత్తం రూ.82,697 జమ కాకపోగా, తన ఖాతా నుంచి పోయినట్లు బాధితురాలు గుర్తించి, కుక్కునూరు పోలీసులకు, ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై వాలంటీర్‌ వెంకటేశ్‌ మాట్లాడుతూ.. ఉన్నతాధికారినంటూ తనకు ఫోన్‌ చేశారని, మీరు ఎవరని అడిగితే ఉన్నతాధికారులతో అలాగేనా మాట్లాడేది.. అంటూ బెదిరించి చేయూత నగదు పడని లబ్ధిదారులకు ఫోన్‌ చేయాలన్నారని, దాంతో తాను నరేంద్ర అనే వ్యక్తికి చేశానని చెప్పారు. బాధితురాలిని, వాలంటీర్‌ను కుక్కునూరు పోలీసులు విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని