బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!

నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది.

Updated : 19 Apr 2024 06:07 IST

తండ్రి, నాటువైద్యుడి నిర్వాకం
మూడున్నరేళ్ల తర్వాత విషయం వెలుగులోకి..
కుమురంభీం జిల్లాలోని రెబ్బెన మండలంలో ఘటన

రెబ్బెన, న్యూస్‌టుడే: నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. ఇన్నాళ్లుగా వేదనను భరించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కుమురంభీం జిల్లా రెబ్బెన సీఐ చిట్టిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన సుల్వ శ్రీనివాస్‌, మల్లీశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రిషి (11)కి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో 2020 నవంబరులో ఇదే మండలంలోని పాసిగాం శివారులో ఆశ్రమం నడిపిస్తున్న బామిని భీమ్‌రావు వద్ద చేర్పించారు. అతను నూనె రాస్తే రోగం నయమవుతుందని నమ్మించేవాడు. ఈ క్రమంలో బాలుడికి నాటు వైద్యం చేసేవాడు. శ్రీనివాస్‌ అతన్ని పూర్తిగా విశ్వసించాడు. నాటు వైద్యం వికటించడంతో కొద్ది రోజులకు బాలుడి పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా శ్రీనివాస్‌తో కలిసి భీమ్‌రావు ఆశ్రమం వెనుక మృతదేహాన్ని పాతిపెట్టాడు. బాబు ఎలా ఉన్నాడని ఆ తల్లి తన భర్తను ఎన్నోసార్లు ప్రశ్నించగా.. ఆశ్రమంలోనే ఉన్నాడని, ఆరోగ్యం మెరుగవుతోందంటూ నమ్మబలికేవాడు. కొన్నిసార్లు ఆమె ఆశ్రమానికి వెళ్లినా.. బాబు లోపల నిద్రపోతున్నాడని, చూడటానికి వీలుపడదని భీమ్‌రావు, శ్రీనివాస్‌లు నమ్మించారు.

అంతేకాకుండా ఆమెను ఇద్దరూ వేధింపులకు గురిచేసేవారు. ఈ క్రమంలో మానసికంగా కుంగిపోయిన ఆమె గత 11 నెలలుగా భర్తను వదిలి పుట్టింట్లో ఉంటున్నారు. ఎప్పటికీ కుమారుడిని చూపించకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తన పుట్టింటివారి సహకారంతో ఈ నెల 16న రెబ్బెన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితులు అసలు విషయాన్ని బయటపెట్టారు. ఈ మేరకు గురువారం బాలుడి మృతదేహాన్ని ఖననం చేసిన ప్రదేశాన్ని భీమ్‌రావు, శ్రీనివాస్‌లు సీఐ చిట్టిబాబు, ఎస్సై చంద్రశేఖర్‌లకు చూపించారు. సీఐ పర్యవేక్షణలో తహసీల్దార్‌ జ్యోత్స్న, ఫోరెన్సిక్‌ నిపుణుడు సురేందర్‌రెడ్డి సమక్షంలో అక్కడ తవ్వించగా బాలుడి మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. ఘటనా స్థలాన్ని ఆసిఫాబాద్‌ డీఎస్పీ సదయ్య పరిశీలించారు. డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించనున్నట్లు సీఐ తెలిపారు. నిందితులు భీమ్‌రావు, శ్రీనివాస్‌లను అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని