అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో.. అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి.

Published : 08 May 2024 03:56 IST

వీణవంక, మల్దకల్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో.. అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం వల్భాపూర్‌ గ్రామానికి చెందిన పోతరాజు పోచాలు(45) తన మూడెకరాల భూమిలో వరి, పత్తి సాగు చేశారు. ఇటీవల నీటితడి సరిగా అందక దిగుబడి రాక నష్టపోయారు. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో ఆందోళన చెందిన పోచాలు ఈ నెల 1న రాత్రి ఇంటి వద్ద పురుగు మందు తాగారు. కరీంనగర్‌లోని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు.

 జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ మండలం మల్లెందొడ్డి గ్రామానికి చెందిన తెలుగు నాగేశ(40)కు ముగ్గురు కుమార్తెలు. కుటుంబపోషణ, పొలం పెట్టుబడుల నిమిత్తం అప్పులు చేసి ఆయన తనకున్న రెండెకరాల్లో ఈ ఏడు మిరప పంట వేయగా గిట్టుబాటు ధర లేక నష్టాలు వచ్చాయి. దీంతో మనస్తాపానికి గురైన నాగేశ సోమవారం పొలంలోనే పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే గద్వాల ఆసుపత్రికి, మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలిస్తుండగా సోమవారం రాత్రి మార్గం మధ్యలోనే మృతి చెందారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు