ఊయలే ఉరితాడైంది!

ఊయలే ఉరితాడై ఒక పసివాడి ప్రాణాలు తీసింది. అప్పుడే తమ్ముడితో పోటీపడి అమ్మ చేతి గోరుముద్దలు తిన్న ఆ చిన్నారి.. చీరతో కట్టిన ఊయల మెడకు

Updated : 21 Apr 2021 10:26 IST

మెడకు బిగుసుకుని ఆరేళ్ల బాలుడి మృతి
బ్యాంకు ఉద్యోగి ఇంట్లో విషాదం

అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: ఊయలే ఉరితాడై ఒక పసివాడి ప్రాణాలు తీసింది. అప్పుడే తమ్ముడితో పోటీపడి అమ్మ చేతి గోరుముద్దలు తిన్న ఆ చిన్నారి.. చీరతో కట్టిన ఊయల మెడకు బిగదీసుకుపోవడంతో మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన రవికుమార్‌ మూడేళ్లుగా అశ్వారావుపేట యూనియన్‌ బ్యాంకు శాఖలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. బస్టాండ్‌ వెనుక వీధిలో నివాసముంటున్నారు. ఈయనకు సాహంత్‌(6), మూడేళ్ల మరో కుమారుడు ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం రవికుమార్‌ భార్య నందిని ఇద్దరు పిల్లలకు అన్నం తినిపించింది. ఆ సమయంలో ఇంట్లోకి వెళ్లిన సాహంత్‌ ఊగేందుకు ఊయల ఎక్కాడు. ఊగుతున్న క్రమంలో అది మెలిపడి మెడకు బిగుసుకుపోయింది. ఇంట్లోకి వచ్చిన తల్లి ఆ దృశ్యాన్ని చూసి పెద్దగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి  ఊయలను కత్తిరించి బాలుణ్ని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆసుపత్రి వద్ద కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. బ్యాంకు నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లిన రవికుమార్‌ కుమారుడి మృతదేహం చూసి కుప్పకూలిపోయారు. అప్పటివరకు తల్లి, తమ్ముడితో ఆటలాడిన ఆ చిన్నారి మృత్యువాత పడటంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని