తెరపైకి కొత్త పేర్లు

అధిక వడ్డీలు ఇస్తానని రూ.కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాచౌదరి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. శనివారం నాటి విచారణలో రెండు కొత్త పేర్లు తెరపైకి వచ్చినట్లు తెలిసింది. శిల్పాచౌదరి దంపతులపై

Published : 05 Dec 2021 05:23 IST

 శిల్పాచౌదరి నివాసంలో సోదాలు

మణికొండ బ్యాంకులో ఖాతాల పరిశీలన

ముగిసిన రెండ్రోజుల పోలీసు కస్టడీ

ఈనాడు, హైదరాబాద్‌-నార్సింగి, న్యూస్‌టుడే: అధిక వడ్డీలు ఇస్తానని రూ.కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాచౌదరి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. శనివారం నాటి విచారణలో రెండు కొత్త పేర్లు తెరపైకి వచ్చినట్లు తెలిసింది. శిల్పాచౌదరి దంపతులపై ఇప్పటివరకూ నార్సింగి స్టేషన్‌లో 7 కేసులు నమోదయ్యాయి. సుమారు రూ.12 కోట్ల వరకూ మోసపోయినట్టు బాధితులు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్టయిన శిల్ప రెండ్రోజుల పోలీసు కస్టడీ శనివారం ముగిసింది. శుక్ర, శనివారాలు నార్సింగిలోని ఎస్‌వోటీ(స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌) కార్యాలయంలో ఈమెను విచారించారు. తొలిరోజు చూపిన అమాయకత్వమే శిల్ప రెండోరోజూ ప్రదర్శించినట్లు తెలిసింది. వ్యాపారం చేయాలనే ఉద్దేశంతోనే పరిచయస్తుల వద్ద అప్పులు చేశానంటూ ఆమె బదులిచ్చారు. తొలుత తడబడినా క్రమంగా తాను తీసుకున్న డబ్బును ఆసుపత్రి నిర్మాణానికి ఖర్చు చేశానని చెప్పుకొచ్చారు. స్థిరాస్తి పెట్టుబడులకు ఇద్దరికి పెద్దమొత్తంలో డబ్బు ఇచ్చినట్టు ఆమె కొత్త పేర్లు తెరమీదకు తెచ్చారు. వీరిలో శంకరంపల్లి ప్రాంతానికి చెందిన రాధికకు రూ.6 కోట్లు ఇచ్చానంటూ వెల్లడించారు. ఆమె వెల్లడించిన ఇద్దరికీ పోలీసులు సోమవారం విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. మరోవైపు రాధిక శనివారం సాయంత్రం మాదాపూర్‌ ఏసీపీను కలసి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. తనకు ఎవరూ డబ్బు ఇవ్వలేదని కేవలం ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వెలిబుచ్చినట్టు తెలుస్తోంది.

కీలక పత్రాలు స్వాధీనం

గండిపేటలోని సిగ్నేచర్‌ విల్లాస్‌లోని శిల్ప నివాసంలో శనివారం పోలీసులు సోదాలు జరిపి బ్యాంకు ఖాతా పుస్తకాలు, కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మణికొండలోని ప్రైవేటు బ్యాంకులో ఈ దంపతుల ఖాతాలను పోలీసులు పరిశీలించారు. బ్యాంకు అధికారులతో ఏడాదిగా జరిగిన లావాదేవీల గురించి మాట్లాడారు. నాలుగు బ్యాంకు ఖాతాల్లో రెండింట్లో నగదు లేదని గుర్తించారు. మరో రెండు బ్యాంకు ఖాతాలను జప్తు చేయించారు. శిల్ప నుంచి నగదు వివరాలు రాబట్టేందుకు మరోసారి కస్టడీకి తీసుకునేందుకు సోమవారం పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని