12 మంది బాలికలపై అత్యాచారం కేసు..కామాంధుడికి జీవితఖైదు

నల్గొండ జిల్లా పెద్దవూర మండలం ఏనమీదితండాలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న వసతిగృహంలో 12 మంది బాలికలపై అత్యాచారం కేసులో రమావత్‌ హరీశ్‌ నాయక్‌కు

Updated : 07 Jan 2022 06:48 IST

సహకరించిన వ్యక్తికి కూడా..

నల్గొండ లీగల్‌, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా పెద్దవూర మండలం ఏనమీదితండాలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న వసతిగృహంలో 12 మంది బాలికలపై అత్యాచారం కేసులో రమావత్‌ హరీశ్‌ నాయక్‌కు జీవితఖైదు విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయస్థాన న్యాయమూర్తి నాగరాజు గురువారం తీర్పు వెలువరించారు.  సహకరించిన వసతిగృహ నిర్వాహకుడు శ్రీనివాస్‌కు జీవితఖైదు, అతడి భార్య సరితకు ఆరు నెలల జైలుశిక్ష ఖరారు చేశారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం కేసు వివరాలివీ.. ఏనమీదితండాలో గుంటూరు జిల్లా నాగారం మండల కేంద్రానికి చెందిన భార్యాభర్తలు నన్నం శ్రీనివాసరావు, సరితలు విలేజ్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ ఆర్గనైజేషన్‌(వీఆర్‌వో) అనే ప్రైవేటు సంస్థను ఏర్పాటు చేసి బాలికల వసతిగృహాన్ని నడుపుతున్నారు. ఈ వసతి గృహంలో బాలికలను చదివించేందుకు ట్యూటర్‌గా రమావత్‌ హరీశ్‌ రోజూ అక్కడికి వచ్చేవాడు. అక్కడ 12 మంది మైనర్లపై మూడు నెలలపాటు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎవరైనా ఎదురుతిరిగితే చంపేస్తానని బెదిరించేవాడు. అతడికి శ్రీనివాసరావు, సరితలు సహకరించేవారు. ఈ విషయం 2014 ఏప్రిల్‌ 3వ తేదీన బాధిత బాలిక ద్వారా వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మిగతా బాలికలపైనా అత్యాచారం జరిగినట్లు విచారణలో గుర్తించి.. 12 మంది బాలికల ఫిర్యాదు మేరకు 12 కేసులను నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం నిందితుడిపై వేర్వేరుగా 12 కేసులలో ఛార్జిషీట్లను దాఖలు చేశారు. అనంతరం న్యాయస్థాన విచారణలో 10 కేసులలో నేరనిర్ధారణ కావడంతో హరీశ్‌, శ్రీనివాసరావులకు జీవితఖైదు, రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. బెదిరింపులకు పాల్పడినందుకు హరీశ్‌కు మరో రెండేళ్లు, అసభ్యకరంగా ప్రవర్తించినందుకు మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని